సీఎం ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా స్విమ్స్ అభివృద్ధి

రాష్ట్రంలోనే అత్యుత్త‌మ వైద్య‌సంస్థ‌గా తీర్చిదిద్దుతాం

టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

తిరుప‌తి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్ష‌ల మేర‌కు స్విమ్స్‌ను రాష్ట్రంలోనే అత్యుత్త‌మ వైద్య‌సంస్థ‌గా అభివృద్ధి చేస్తామ‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్విమ్స్ ప్రాంగ‌ణంలోని శ్రీ‌ప‌ద్మావ‌తి ఆడిటోరియంలో డాక్టర్స్ ఫర్ యు, హెచ్.డి.ఎఫ్.సి సంస్థలు రూ.5 కోట్ల వ్య‌యంతో విరాళంగా అందించిన అధునాత‌న వైద్యపరికరాలను డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామితో క‌లిసి టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో తిరుప‌తి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి ఆదేశాల‌కు అనుగుణంగా స్విమ్స్‌కు తోడ్పాటును అందించాల‌నే ఉద్దేశంతో టీటీడీలో విలీనం చేసిన‌ట్టు చెప్పారు. దాతల స‌హకారంతో అన్ని విభాగాల‌లోను అధునాత‌న వైద్య‌ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చ‌నున్నట్టు వివ‌రించారు. ఆస్ప‌త్రికి అవ‌స‌ర‌మైన రూ.5 కోట్లు విలువైన వైద్యపరికరాలు విరాళంగా అందించిన డాక్టర్స్ ఫర్ యు, హెచ్.డి.ఎఫ్.సి సంస్థల ప్ర‌తినిధులను టీటీడీ చైర్మ‌న్ అభినందించారు. ఐసీయూలో వెంటిలేటర్లకు సహాయంగా ఉండేందుకు, కోవిడ్ వ్యాధిగ్రస్తులకు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు 10 హై ఎండ్ మల్టీపారా మానిటర్లు, 20 మిడ్ రేంజ్ మల్టీపారా మానిటర్లు, 50 పల్స్ ఆక్సీ మీటర్లు ఉన్నాయ‌న్నారు. అదేవిధంగా 10 వెంటిలేటర్లు, ఒక నియోనెటల్ వెంటిలేటర్, 100 ఫాలర్ కోట్స్ ఆటోమేటిక్ విత్ మాట్రిసెస్, 25 డయాలసిస్ యంత్రాలు, 2 అల్ట్రాసౌండ్ యంత్రాలు తదితర వైద్య పరికరాలు విరాళంగా అందించిన‌ట్టు తెలియ‌జేశారు. స్విమ్స్‌లో మ‌రింత మెరుగైన వైద్య‌సేవ‌లు అందించేందుకు కృషి జ‌రుగుతోంద‌ని, ఇందులో భాగంగా ఇక్క‌డున్న 100 ప‌డ‌క‌ల క్యాన్స‌ర్ విభాగాన్ని 300 ప‌డ‌క‌ల‌కు పెంచాల‌ని ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ. శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించార‌ని, దాత‌ల స‌హ‌కారంతో ఈ ప‌నులు త్వ‌ర‌లో పూర్తి చేస్తామ‌ని చెప్పారు.

డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి మాట్లాడుతూ.. కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన వారికి వైద్య‌సేవ‌లు అందించ‌డం ద్వారా స్విమ్స్ సంస్థ ప్ర‌త్యేక గుర్తింపు పొందింద‌న్నారు. వైద్య‌సేవ‌ల‌తోపాటు వైద్య విద్య, వైద్య ప‌రిశోధ‌న‌, సామాజిక సేవ కార్య‌క్ర‌మాలు అమ‌లుప‌ర‌చ‌డంలో స్విమ్స్ ప్ర‌థ‌మ స్థానంలో ఉంద‌న్నారు. అధునాత‌న ప‌రిక‌రాల ద్వారా మరింత మంది రోగుల‌కు అత్య‌వ‌స‌ర వైద్యం అందించ‌వ‌చ్చ‌ని చెప్పారు.

తాను కూడా స్విమ్స్‌ క‌ళాశాలలోనే చ‌దువుకున్నాన‌ని,  వైద్యులంద‌రూ ఎంతో గొప్ప సంస్థ‌గా భావిస్తార‌ని తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి గుర్తుచేశారు. ఎంతో మంది పేద రోగుల‌కు స్విమ్స్ ఆస్ప‌త్రి ఒక వ‌రంలాంటిద‌న్నారు. ఆస్ప‌త్రి అభివృద్ధితో పాటు విమానాశ్ర‌యం ప‌క్క‌న గ‌ల స్విమ్స్ స్థ‌లంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు.

 

Back to Top