గౌత‌మ్ రెడ్డి భౌతికాయానికి క‌డ‌సారి నివాళులు

నెల్లూరు: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (50) అకాల మరణంతో సింహపురి కన్నీటి సంద్రమైంది. జిల్లా ప్రజలు కఠోర నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నెల్లూరు న‌గ‌రంలోని మేక‌పాటి క్యాంపు కార్యాల‌యంలో గౌత‌మ్ రెడ్డి భౌతిక‌కాయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్ర‌జాప్రతినిధులు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, అధికారులు, అభిమానులు క‌డ‌సారి క‌న్నీటి నివాళుల‌ర్పిస్తున్నారు.  మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో జిల్లా ప్ర‌జ‌లు శోక సంద్రంలో మునిగిపోయారు. మృధుస్వభావి, మానవతావాది, స్నేహశీలి, వివాదారహితుడిగా అందరి ఆత్మబంధువయ్యారు. దశాబ్ద కాలంలోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయాల్లో విభిన్నమైన వ్యక్తిగా బలమైన నేతగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా తన రాజకీయ ప్రస్థానంలో సామాన్యుడి నుంచి కార్పొరేట్ల వరకు అందరి వాడయ్యారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రిగా జిల్లా అభివృద్ధిలోనే కాకుండా రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అజాత శత్రువు అంతలోనే దిగంతాల్లో ఒరిగిపోయారు.  ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండే అరుదైన నేతగా ముద్ర వేసుకున్నారు. అందరిని ఆత్మీయంగా పలకరించే గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతి వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. జిల్లా వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి.   కార్యకర్తల పట్ల ఆయన ఎంతో ఆప్యాయత, ప్రేమతో ఉండేవారు. గౌతమ్‌రెడ్డి లాంటి మంచి నేత మళ్లీ తిరిగిరారని కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. 

Back to Top