వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై టీడీపీ వర్గీయుల దాడి

బొజ్జల సుధీర్‌రెడ్డి కారు దూసుకెళ్లడంతో నలుగురికి గాయాలు

సీఎం, ఎమ్మెల్యేలపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు 

రేణిగుంటలో ఉద్రిక్తత

చిత్తూరు జిల్లా:  రేణిగుంటలో టీడీపీ నాయకులు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై మంగళవారం దాడులకు తెగబడ్డారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి కారు వారిపైకి దూసుకెళ్లడంతో వార్డు సభ్యులు, ముగ్గురు మహిళలు గాయపడ్డారు. విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి, పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహయాదవ్‌ల నేతృత్వంలో మండల టీడీపీ నాయకులు రేణిగుంటలోని ఎన్‌టీఆర్‌ విగ్రహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు.

ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైన, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత దూషణలతో నినాదాలు చేశారు. దీంతో ఎంపీపీ హరిప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో అక్కడికి చేరుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని వారిని కోరారు. దీంతో టీడీపీ వారు మరింతగా దూషిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ వర్గీయులపై చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ఈ సమయంలోనే బొజ్జల సుధీర్‌రెడ్డి కారు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై వేగంగా దూసుకెళ్లింది. దీంతో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన రేణిగుంట వార్డు సభ్యుడు కృష్ణమూర్తి, కార్యకర్తలు ఈశ్వరి, దర్బార్‌బీ, సాయిలత గాయపడ్డారు. రేణిగుంట డీఎస్‌పీ రామచంద్ర, సీఐ అంజూయాదవ్‌ అక్కడకు చేరుకుని సర్దిచెప్పారు. కారుతో తొక్కించి గాయపరచారని బొజ్జల సుధీర్‌రెడ్డిపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తాజా వీడియోలు

Back to Top