అనంతపురం జిల్లా: తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడగూరు మండలం అప్పేచర్లలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అరాచకం సృష్టించారు. గురువారం ఉదయం వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తల తలకు బలమైన గాయం కావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడి విషయాన్ని వైయస్ఆర్‌సీపీ కార్యకర్త భాస్కర రెడ్డి సెల్ఫీ వీడియోలో వివరించారు. జేసీపై ఫిర్యాదు తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై దళిత సంఘం నేత రాంపుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనను ఫోన్‌లో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బెదిరించిన జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటిదాకా ఎన్ని కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు చెప్పాలని సమాచార చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీకి రిజిస్టర్ పోస్టు ద్వారా వివరాలను పంపించారు.