తాడేపల్లి: ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా అసెంబ్లీలో మాజీ సీఎం వైయస్ జగన్, చిరంజీవిలపై బాలకృష్ణ నోటికొచ్చినట్టు మాట్లాడాడని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అందించిన స్ర్కిప్టు ప్రకారమే బాలకృష్ణ సభకొచ్చి వివాదం సృష్టించి వెళ్లాడని, కానీ చంద్రబాబు పథకం వికటించడంతో మరుసటి రోజున స్ర్ర్కిప్టు మార్చి కామినేనితో రికార్డుల నుంచి తొలగించాలని అభ్యర్థించేలా చేశారని సుధాకర్ బాబు వివరించారు. వివాదం జరిగిన రోజునే స్పీకర్ స్వచ్ఛందంగా ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఈ వివాదంలో ఇప్పటివరకు చంద్రబాబు, బాలకృష్ణలు చిరంజీవికి క్షమాపణలు చెప్పలేదని, దీనిపై కనీసం స్పందించకుండా తమ్ముళ్లిద్దరూ చిరంజీవిని నడిరోడ్డుపై ఒంటరిగా వదిలేశారని చెప్పారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలన్నీ చూస్తుంటే చిరంజీవి మీద ఏదో కుట్ర జరుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. ఆనాడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి ఏమీ అనకపోయినా ఏడ్చి హంగామా చేసిన చంద్రబాబు, ఎల్లోమీడియాలు.. సభలో లేని మాజీ సీఎం వైయస్ జగన్ గురించి బాలకృష్ణ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే సభా నాయకుడు చంద్రబాబు, స్పీకర్లకు తప్పనిపించలేదా అని సుధాకర్ బాబు ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే... కూటమి ప్రభుత్వం తన 16 నెలల పాలనలో ప్రజాసమస్యల పరిష్కారంతోపాటు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలోనూ ఘోరంగా విపలమైంది. కనీసం ఒక్క బస్తా యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొందని అన్నదాత ఆక్రోశిస్తున్నాడు. కూటమి నాయకులు రైతులకు అందాల్సిన యూరియాని బ్లాక్ మార్కెట్‌కి తరలించి కృత్రిమ కొరతను సృష్టించి దోచుకుంటున్నారు. రూ.267లకు దక్కాల్సిన యూరియా రూ.600 వెచ్చించినా దొరకని దుస్తితి. ఇంకోపక్క రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర దొరకడం లేదు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే మంచి సంకల్పంతో మాజీ సీఎం వైయస్ జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే వాటిని పీపీపీ పద్ధతిలో చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నాడు. ఇంకోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్నా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం లేదు. ఎన్నిలకు ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చెప్పిన చంద్రబాబు ఏడాదిలోనే రూ. 19వేల కోట్ల విద్యుత్ బిల్లుల భారాన్ని ప్రజలపై మోపాడు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయ. మహిళకు రక్షణ ఉండటం లేదు. అన్నిరంగాల్లోనూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిన విషయాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా వైయస్ఆర్‌సీపీ ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని చూసి తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తో అసందర్భ కామెంట్లు చేయించాడు. కామినేని శ్రీనివాస్ అనే వ్యక్తి చిరంజీవి, పవన్ కల్యాణ్, వెంకయ్యనాయుడికి అత్యంత సన్నిహితుడు. 2014-19 మధ్య చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలవడానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రతిసారీ ఆయనతో కామినేని ఉండేవాడు. కామినేని శ్రీనివాసే దగ్గరుండి పలుమార్లు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ని కలిపించేవాడు. 2024లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి కామినేని శ్రీనివాస్ తీవ్రంగా ప్రయత్నించాడు. కుదరకపోవడంతో ఆయన్ను చంద్రబాబు బీజేపీ నుంచి బరిలో దింపాడు. - వైయస్ జగన్‌ని తిట్టడం చంద్రబాబుకి తప్పనిపించలేదా? చంద్రబాబుకి సమస్య నుంచి ఎలా పారిపోవాలో తెలిసినట్టుగా పరిష్కరించడం తెలియదు. అందుకే సమస్యలు వచ్చినప్పుడల్లా ఏదోక వివాదం సృష్టించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. ఆ విధంగా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. సినిమా షూటింగ్‌లో ఉన్న బాలకృష్ణను సభకు పిలిపించి నోటికొచ్చినట్టు మాట్లాడించి వివాదం సృష్టించాడు. మూడోసారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న బాలకృష్ణ ఈ 11 ఏళ్లలో ఎన్నిసార్లు శాసనసభకు వచ్చారో వేళ్ల మీద లెక్కించవచ్చు. చంద్రబాబు సూచనలతో ప్రత్యేక ఎజెండాతో సభలో అడుగుపెట్టిన యాక్టర్ బాలకృష్ణ. అందుకే వివాదం సృష్టించి వెళ్లిపోయాడు. వివాదం జరిగినప్పుడు, ఆ ముందు రోజు, తర్వాత రోజు ఒక గంట మాత్రమే బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యాడు. మా నాయకుడు వైయస్ జగన్ వ్యక్తిత్వ హననం చేయడమే లక్ష్యంగా అత్యంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడేశాడు. ఆనాడు వైయస్ఆర్‌సీపీప్రభుత్వ హయాంలో చంద్రబాబు భార్యను ఉద్దేశించి మా సభ్యులు అనని మాటలు అన్నట్టుగా చిత్రీకరించి సీన్ క్రియేట్ చేసిన చంద్రబాబు, ఎల్లో మీడియా.. ప్రతిపక్ష నాయకుడి గురించి బాలకృష్ణ అసెంబ్లీలో దారుణంగా మాట్లాడితే ఇప్పుడెందుకు స్పందించడం లేదు? మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతుంటే స్పీకర్ కానీ, సభా నాయకుడు చంద్రబాబు కానీ ఎందుకు ఖండించలేదు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాగబాబులు వైయస్ జగన్, చిరంజీవిలను ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడిన మాటలను ఇంతవరకు ఎందుకు ఖండించలేదు? చిరంజీవికి అవమానం జరగకపోయినా వైయస్ జగన్ అవమానించారని ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ కళ్లముందే తన అన్నని వాడు వీడు అని బాలకృష్ణ అసెంబ్లీలో నీచంగా మాట్లాడితే ఎందుకు ప్రశ్నించ లేకపోతున్నారు? తన ఉన్నతికి కారణమైన చిరంజీవిని తిడితే తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు ఖండించడానికి ఎందుకు బయటకు రావడం లేదు? - చిరంజీవిపై ఏదో కుట్ర జరుగుతోంది తన అన్న వదినలను వైయస్ జగన్ సాదరంగా ఆహ్వానించి ఆదరిస్తే, అవమానించారని రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ పదే పదే ఆరోపణలు చేసినా అది అబద్దమని చిరంజీవి కనీసం నోరు విప్పలేదు. రెండేళ్ల తర్వాత ఈ వివాదం నేపథ్యంలో తనకు వైయస్ జగన్ వల్ల ఏ అవమానం జరగలేదని చిరంజీవి నోరువిప్పాడు. కానీ ఆనాడు తనని వెనకేసుకొచ్చిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు బాలకృష్ణ అవమానిస్తే ఎందుకు స్పందించడం లేదో చిరంజీవి ఆలోచించుకోవాలి. ఇదంతా చూస్తుంటే చిరంజీవి మీద తమ్ముళ్లు కుట్రలు చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ సమయంలో సభలోనే ఉన్న మంత్రి కందుల దుర్గేశ్ కూడా ఖండించలేదు సరికదా, ఇప్పటికీ దానిమీద నోరు మెదపడం లేదు. జనసేన పార్టీ చిరంజీవిని అవమానించి నడిరోడ్డు మీద ఒంటరిగా నిలబెట్టారని స్పష్టంగా తెలిసిపోతుంది. వైయస్ఆర్‌సీపీ సభ్యులు సభకు రావాలని చెప్పే స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభలో లేని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, చిరంజీవిలను అవమానిస్తుంటే రికార్డుల నుంచి తొలగించాలని ఎందుకు ఆదేశించలేదు? వాస్తవానికి కామినేని తన వ్యాఖ్యల్లో ఎక్కడా చిరంజీవిని ఉద్దేశించి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. కానీ మాజీ సీఎం వైయస్ జగన్ గురించి మాత్రమే అన్నారు. దానికి కామినేని శ్రీనివాస్.. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి క్షమాపణలు చెప్పాలి. కామినేని శ్రీనివాస్ మాట్లాడిన రోజే రికార్డుల నుంచి తొలగించి ఉంటే సభ మీద, సభాపతి మీద ప్రజల్లో గౌరవం పెరిగేది. కానీ ఆ పనిచేయకుండా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో తెల్లారి సభకు కొత్త స్క్రిప్టుతో వచ్చారు. కానీ సభకు రావాల్సిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జ్వరం పేరుతో హైదరాబాద్ వెళ్లారు. ఆయన్ను పరామర్శించడానికి చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు. ఆయనకి పుష్పగుచ్ఛం ఇవ్వడానికి జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ డోర్ దగ్గరకి వచ్చాడు. వాస్తవానికి చిరంజీవికి జరిగిన అవమానంతో ప్రభుత్వం మీద కాపు సమాజంలో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఫొటోలకు పోజులిచ్చి మీడియాలో హడావుడి చేశారే తప్ప, ఇప్పటికీ అన్నయ్యకు బాలకృష్ణ, చంద్రబాబు క్షమాపణలు చెప్పలేదు. పవన్ కళ్యాన్ కి జ్వరమొస్తే హైదరాబాద్‌కి పరిగెత్తాడంటే విజయవాడ లేదా ఏపీలో ఆయన జ్వరానికి వైద్యం అందించే ఆస్పత్రి లేదనే సందేశం పంపించారు. - రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ పోరాటం ఎన్ని విధాలుగా వేధించినా, కేసులు పెట్టినా, డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రభుత్వ వైఫల్యాల మీద వైయస్ఆర్‌సీపీ పోరాటం ఆపే ప్రసక్తే లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అందులో భాగంగానే రేపు మంగళవారం (సెప్టెంబర్ 3వ తేదీన) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాల వద్ద వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. ప్రైవేటీకరణ జీఓను రద్దు చేసి ఎస్సీలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించేదాకా పోరాటం ఆపే ప్రసక్తే లేదు. చంద్రబాబు నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం.