దుష్ట చతుష్టయానికి తిండి లేదు.. లోకేష్, పవన్ లకు పాలు లేవు

 వరదల్లో "ఎల్లో" బురద రాజకీయంపై రాష్ట్ర మంత్రులు ఫైర్

రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుండి మీడియాతో మాట్లాడిన మంత్రులు అంబటి రాంబాబు,  చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,  కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ,  పినిపె విశ్వరూప్  

 బాబుకు అధికారం పోవడం వల్లే రామోజీకి పుట్టిన ఆకలి ఇది

  బాబు బురద రాజకీయానికి ఈనాడు, ఎల్లో మీడియా దుష్ట పన్నాగం

  రాజకీయంగా మునిగిపోయిన చంద్రబాబు, టీడీపీని రక్షించడానికి బరితెగించి రామోజీ రాతలు

 రాష్ట్ర చరిత్రలోనే మరే ప్రభుత్వం చేయనంతగా వరద విషయంలో అప్రమత్తత, సహాయక చర్యలు

  బాబు హయాంలో కరువే తప్ప ఈ స్థాయిలో వరద వచ్చింది లేదు

 సచివాలయాలు, వాలంటీర్ల నుంచి నూతన జిల్లాల వరకు.. ఇంత భారీ యంత్రాంగం ఎప్పుడూ లేదు.

 చంద్రబాబు, ఈటీవీ, ఏబీఎన్, టీవీ-5 లకు తిండి లేదు.. లోకేశ్, పవన్ కల్యాణ్ లకు పాలు లేవు
  చంద్రబాబులా ఏరియల్ విహార యాత్ర చేయలేదు

 అయినా, విషపు రాతల రామోజీకు ఎందుకు కడుపు మంట..?

 వరదల సమయంలో బాబు ఏరియల్ సర్వేలు చేయలేదా!?

  సచివాలయాలు, జిల్లాల పునర్విభజనతో ఒకరికి ఆరుగురు చొప్పున ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది

  పునరావాస శిబిరాల నుంచి వెళ్ళే కుటుంబాలకు రూ. 2వేలు ఇస్తున్నాం.. టీడీపీ హయాంలో ఎప్పుడైనా ఇచ్చారా..?

 పునరావాస కేంద్రాల్లో  ఇచ్చే పాలు, బిస్కెట్లు, భోజనం.. ప్రతి విషయంలోనూ అధికారయంత్రాంగం ఫోకస్

 ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాం:  రాష్ట్ర మంత్రులు

అమ‌రావ‌తి: జులై రెండో వారంలో గోదావరిలో ఇంత వరద రావడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేకపోయినా,  ప్రభుత్వం అన్నివిధాలా అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టిందని మంత్రులు అంబటి రాంబాబు,  చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,  కారుమూరి వెంకట నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, పినిపె విశ్వరూప్ తదితరులు స్పష్టం చేశారు. 

ఎల్లో మీడియా అబద్ధాలు, అసలు నిజాలకు సంబంధించి మంత్రులు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే...

    1)  ఇంతగా వరద ముంచెత్తుతోందని తెలిసిన వెంటనే గ్రామాలను ఖాళీ చేయించటం, ప్రజల ప్రాణాలు రక్షించటం... ఇవీ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతలు. 
    2) మునిగే ప్రాంతాలేవో ముందుగానే హెచ్చరించేందుకు, నివాసాలనుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు, శిబిరాలకు తరలించేందుకు ప్రభుత్వం చేసిన కృషి అందరికీ తెలుసు.     3) గతానికి  – ఇప్పటికి తేడా ఏమిటంటే... గతంలో ఇదే గోదావరి జిల్లాలకు ఉన్నది ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు మాత్రమే. 
    4) ఇప్పుడు రెండు జిల్లాలు ఆరు జిల్లాలయ్యాయి. ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు ఎస్పీలు, ఆరుగురు జేసీలు, వీరి కింద ఉండే యంత్రాంగం... వీరంతా పై స్థాయిలో ఉంటూ అధికార యంత్రాంగం తరఫున వరద పరిస్థితిమీద కానివ్వండి, వరద బాధిత గ్రామాలను ఖాళీ చేయించి ప్రాణాలు కాపాడే విషయంలో కానివ్వండి... వరద బాధిత ప్రజలకు సహాయ సహకారాలు అందించే విషయంలో కానివ్వండి... ఇంతకు ముందు కంటే ఎంతో మిన్నగా పని చేస్తున్నారు. 
    5) మరో వంక, ప్రజా క్షేత్రం నుంచి వచ్చిన, ప్రభుత్వ ప్రతినిధులు అయిన ఎమ్మెల్యేలు, ఆ జిల్లాల్లో మంత్రులు, ఆ జిల్లాలకు ఇన్‌చార్జిలుగా ఉన్న మంత్రులు, వీరంతా రాత్రనక, పగలనక తమకు సంబంధించిన జిల్లాల్లో సహాయక చర్యల్ని అధికారులతో, ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్షించి ఎక్కడికక్కడ చర్యలు తీసుకునేలా దగ్గరుండి పని జరిపించారు. 
    6) ఈ రెండు వ్యవస్థలకు తోడుగా... గ్రామ స్థాయిలో ప్రతి 50 ఇళ్ళకు ఒకరు చొప్పున మనందరి ప్రభుత్వం పెట్టిన వాలంటీర్‌ వ్యవస్థ కానివ్వండి... మనందరి ప్రభుత్వం పెట్టిన గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ కానివ్వండి... ఎక్కడికి అక్కడ పరిస్థితిని సమీక్షించి సహాయపడుతున్నారు. 
    7) రాష్ట్ర చరిత్రలోనే ఏ ప్రభుత్వమూ ఇంతగా వరద విషయంలో అప్రమత్తం కాలేదు. ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇంతగా... జులై లోనే వచ్చిన ఇంత భారీ వరదను, భద్రాచలంలో 70 అడుగులు దాటిపోయిన వరదను... 27 లక్షల క్యూసెక్కులకు పైగా పొంగిన గోదావరిని.. ఎదుర్కొని ఒక్క ప్రాణం కూడా పోవటానికి వీల్లేదని ఇలా కదిలింది లేదు.  ఇదీ వాస్తవం.  చంద్రబాబు నాయుడు హయాంలో కరువే తప్ప వరద, అదీ ఈ స్థాయి వరద వచ్చింది లేదు.  ఆ రోజుల్లో ఇలాంటి మూడు–నాలుగు అంచల వ్యవస్థగానీ, ఇంత భారీగా జిల్లాలుగానీ, జిల్లా యంత్రాంగంగానీ, జిల్లాల మంత్రులుగానీ లేరు. వరదల్లో ఏ ఒక్క మనిషీ మరణించటానికి వీల్లేదని ఇంతగా పని చేసిన పరిస్థితి... ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. ఇదీ వాస్తవం.
    8) మరి ఇవన్నీ వాస్తవాలు అయితే... ఒక చంద్రబాబు నాయుడు ఎలా బతకాలి?.  అధికార పార్టీమీద రాజకీయం ఎలా చేయాలి?  ఈ నెల 21న చంద్రబాబు, టీడీపీ బృందం వెళ్ళేసరికి... ప్రజల్లో ఎలా అపోహలు కలిగించాలి?.  ‘‘ఏమీ అందలేదు’’ అని ఎలా చెప్పించాలి?. ఈ దుష్ట ఆలోచనలు చేయటానికి టీడీపీ తరఫున ‘ఈనాడు’ రెడీ అయింది.  వరద బాధితుల్ని కాదు... రాజకీయంగా మునిగిపోయిన చంద్రబాబుని, తెలుగు దేశం పార్టీని రక్షించుకోవటం కోసం రామోజీ నడుం బిగించి... బరి తెగించి... అబద్ధాలు ఎలా రాస్తున్నాడో, ఎలా ఈటీవీ మైకులు పంపి... నలుగురైనా, మాకు ఏదీ అందలేదని చెప్పండి అని పడవల మీద వెళ్ళి మరీ తంటాలు పడుతున్నారో నాలుగు రోజులుగా చూస్తున్నాం. 
    9) ఈ దుర్మార్గపు ఆలోచనల్లో భాగంగానే ఈ రోజు ఈనాడులో ‘‘పెద్దలకు తిండి లేదు... పిల్లలకు పాల చుక్క లేదు...’’అంటూ చంద్రబాబు వచ్చినప్పుడు కొద్దిమంది అయినా ఏం మాట్లాడాలో ప్రిపేర్‌ చేయటానికి ఈ పేపర్‌ అనే చీడపురుగు సమాజం బుర్రలో విషం నింపటానికి రెడీ అయింది. ‘పెద్దలకు తిండి’అంటే తెలుగుదేశం పార్టీ పెద్దలైన ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 పెద్దలకు తిండి. పిల్లలకు పాల చుక్క అంటే లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ బ్యాచ్‌కు పాల చుక్క అని అర్థం చేసుకోవాలి. ఇది అధికారం పోయి పుట్టిన ఆకలి. 

నిజాలు ఏంటంటే...
    10– వరద శిబిరాల్లో ఉన్న ప్రజలకు సహాయం అందించే విషయంలో ఎక్కడా అలసత్వం లేదు. ఇంతకు ముందే చెప్పినట్టు, చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని వరదల్ని... ఈ 75 ఏళ్ళ స్వాతంత్య్ర చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పునర్‌ నిర్మించుకున్న వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు మొదలు జిల్లాలు, కలెక్టర్ల వ్యవస్థ వరకు అంతా ఇంత భారీగా పని చేసిన మరో సందర్భం లేదు. 
    11) పునరావాలస శిబిరాల్లోనుంచి వెళ్ళే ప్రజల కుటుంబాలకు రూ. 2000 ఇచ్చిన పరిస్థితి టీడీపీ హయాంలో ఏనాడూ లేదు. 
    12) టీడీపీ పాలనలో కరువే తప్ప, వర్షం, నీరు, వరద లాంటివి చంద్రబాబు మహిమ వల్ల ఏనాడూ లేవు. పైగా, చేతగాని వాడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందన్న సామెత మాదిరిగా... చంద్రబాబు కట్టిన పోలవరం కట్టడాలు 2019–20 వరదలకు కొట్టుకుపోయాయి. ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా, యుద్ధ ప్రాతిపదికన, కాఫర్‌ డ్యాం ఎత్తును మరో పెంచే కార్యక్రమం... ఇంత వరదల్లో ప్రారంభించి జగన్‌గారి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ఇది పత్రికల్లో రాయించుకునేందుకు, బాకా ఊదించుకునేందుకు  కాదు... బాధ్యత కలిగిన ప్రభుత్వం చేసిన పని! 
    13) ఈ స్థాయి వరదే లేకపోయినా, ఈ రోజు ఈనాడులో ఏం రాశారంటే... అదే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడైతే... ఇలా వరదలు వచ్చినప్పుడు... పిల్లలందరికీ పాలు, బిస్కెట్‌ ప్యాకెట్లు; ఇంట్లో ఉన్నవారందరికీ భోజనం ప్యాకెట్లూ ఇచ్చేవారని ‘ఈనాడు’లో రాశారు. వరదను రాజకీయం చేయటంలో చంద్రబాబు కంటే తాము ముందుంటామని; అబద్ధాల ఫ్యాక్టరీ నడపటంలో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానం తమదే అని చెప్పటానికి ఇలాంటి తప్పుడు రాతలు ఉదాహరణలుగా నిలుస్తాయి. 
    14) పునరావాస కేంద్రాల్లో ఉన్నప్పుడు, అక్కడినుంచి వెనక్కు వెళుతున్నప్పుడు వరద బాధితులకు ఇచ్చే సహాయం గురించి టీడీపీ ఏనాడూ తన పాలనలో ఆలోచన చేసినదే లేదు. 
– పునరావాస కేంద్రాల్లో ఇచ్చే పాలు, బిస్కెట్లు, భోజనం వంటి ప్రతి ఒక్క విషయంలో జగన్‌గారి ప్రభుత్వం మెరుగైన ఫోకస్‌ పెట్టింది. 
    
 

జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్

వరదల్లోనూ రాజకీయాలా..?, సిగ్గుచేటు
        రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ,  వరద సహాయక చర్యలను ఈ ప్రభుత్వం సమర్థవంతంగా చేపడుతుంది.  గ్రామ సచివాలయాల్లోని వాలంటీర్ల మొదలు, జిల్లాల యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం, మంత్రుల వరకు వరద సహాయ చర్యల్లో పాల్గొన్నారు.  ప్రజలను సైతం భాగస్వాములను చేస్తూ వరద బాధితులను చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం  ఆదుకుంటుంది. వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఎల్లో మీడియా ప్రభుత్వంపై బురదచల్లుతూ, వరదల సమయంలో కూడా రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రిగా రు అక్కడకు వెళ్ళి, వారి ముందు నాలుగు ఫోటోలు దిగి, ఆర్భాటాలు చేయకపోవచ్చుగానీ, ప్రతిక్షణం సీఎంగారు వరద పరిస్థితులపై అధికారులతో, మంత్రులతో సమీక్షలు నిర్వహిస్తూ.. ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. 
        గడిచిన 36 ఏళ్లలో గోదావరికి ఇంత ఉద్ధృతంగా వరదలు వచ్చిన సందర్భాలు లేవు, 1986లో ఇంతకన్నా ఎక్కువగా వరదలు వచ్చాయని తెలిపారు. అయితే జూలై నెల మొదట్లో ఇంతస్థాయిలో వరదలు రావడం ఎప్పుడూ జరగలేదన్నారు. 27 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వస్తే మొదట మేమంతా భయపడ్డాం. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ ను డిజైన్ చేసింది 28 లక్షల క్యూసెక్కులకు మాత్రమే. ఒకవేళ వరద పెరిగి,  28-29 లక్షల క్యూసెక్కులకు వెళితే.. కాఫర్ డ్యాం కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడుతుందని భావించి, సీఎం గారి ఆదేశాల మేరకు, యుద్ధప్రాతిపదికన 30 లక్షల క్యూసెక్కులు వచ్చినా, పోలవరం డ్యామ్ దెబ్బతినకుండా ఉండేందుకు, ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు 2  మీటర్లు పెంచి తక్షణ చర్యలు చేపట్టారు.  ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

-  వాస్తవాలు ఇలా ఉంటే.. వరదలు వస్తే సంబరాలు చేసుకోవడం,  ప్రజలు కష్టాల్లో ఉంటే సానుభూతి పిండుకోవాలని చూసే ఒక దౌర్భాగ్యపు ఎల్లో దండు ఈ రాష్ట్రంలో ఉంది. వరద వచ్చినా, ఎండలు కాసినా, చలి వచ్చినా, ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద విషం చల్లాలి. సందర్భం దొరికినప్పుడల్లా చంద్రబాబును రాజకీయంగా పైకి లేపాలి అన్న దుర్బుద్ధితో ఓ వర్గం మీడియా విషపు రాతలు రాస్తున్నారు. ఈ ఆపద సమయంలో జగన్ మోహన్ రెడ్డిగారి మీద విషపు రాతలు రాసి, చంద్రబాబుకు లబ్ధి చేకూర్చే విధంగా తాపత్రయపడే కొంతమంది వ్యక్తులు, సంస్థలు, పత్రికలు ఉన్నాయి. 

విషపు రాతల రామోజీ.. నీ కెందుకు కడుపు మంట..?
        ప్రధానంగా ఈనాడులో ఈరోజు ఏం రాశారు.. "పెద్దలకు తిండి లేదు.. పిల్లలకు పాల చుక్క లేదు" అంటూ విషపు రాతలు రాశారు. ఎందుకంటే, చంద్రబాబు 21న వరద ప్రాంతాలకు వెళుతున్నారట. వరద తగ్గిన తర్వాత, తమ్ముళ్ళూ చూశారా.. వరద వచ్చినా పట్టించుకోలేదు, తిండి అందలేదు, పిల్లలకు పాలు ఇవ్వలేదు అని చెప్పటానికి, ప్రజలను రెచ్చగొట్టి, వారిలో విషపు ఆలోచనలు రేకెత్తించి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారి మీద విషం చల్లాలన్నదే ఈ దుష్ట చతుష్టయం బ్యాచ్ ఆరాటం. ఈ వార్తలను ఈటీవీ, ఏబీఎన్, టీవీ 5లలో హెడ్ లైన్ లలో చూపించి, చర్చలుపెట్టి, జగన్ మోహన్ రెడ్డిగారి మీద ప్రజలు తిరుగుబాటు అన్నట్టుగా ప్రచారం చేయాలన్నదే వీరి కుట్ర. మీరు రాసే పిచ్చి రాతలకు.. జగన్ గారి మీద వ్యతిరేకత వస్తుందా..?, రానే రాదు. మీరేంటో, మీ రాతల వెనుక ఉన్న దురుద్దేశాలు ఏమిటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. 
- తమ వాడికి అధికారం పోయిందన్న కడుపు మంటతోనే ఈనాడు రామోజీ తప్పుడు రాతలు రాస్తున్నాడు. చంద్రబాబు ఇక అధికారంలోకి రాలేడన్న ఏడుపుతో విషం చిమ్ముతున్నారు.  

ఆ నలుగురికి రాజకీయంగా తిండి లేదు.. లోకేష్, పవన్ లకు పాలు లేవు
        చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులకు ఈరోజు రాజకీయంగా తిండి లేదు. అందుకే.. ఇటువంటి అడ్డగోలు రాతలు రాస్తూ, విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు పుత్రుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ లకు పాలు లేవు. దాంతో  వీళ్ళను ఆదుకోవడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో ఛానళ్ళు బయలుదేరాయి.  రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలనే చిత్తశుద్ధితో స్పెషల్ అధికారులను నియమించి, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరుగురు కలెక్టర్లు నిరంతరం పనిచేస్తుంటే.. ఎందుకు బురదచల్లుతున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నాం.   - వరద బాధితులకు పునరావాస కేంద్రాల్లో రూ. 2 వేలు ఎప్పుడైనా  ఇచ్చారా చంద్రబాబూ....?
- ఇటువంటి ప్రభుత్వం చేసిన మంచికి సంబంధించి ఒక్క ముక్క రాయరు కానీ, గతంలో చంద్రబాబు హయాంలో అయితే పాలు, బిస్కెట్లు, భోజనం పెట్టేవారని, వారి హయాంలో బహు గొప్పగా ఉందని, ఆహో..ఓహో అని సిగ్గు, ఎగ్గూ లేని రాతలు రాస్తున్నారు. ఇటువంటి  విషపు రాతలు రాయటం వల్ల చంద్రబాబుకు అధికారం వస్తుందని కలలు గంటున్నారు. జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం మీద నిప్పులు చల్లాలని, బురద చల్లాలని అనుకుంటే.. ఆకాశం మీద ఉమ్మి వేస్తే.. ఏం జరుగుతుందో మీకూ అదే శాస్తి జరుగుతుంది. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలలో తాను స్వయంగా పర్యటించినప్పుడు కూడా.. కొన్ని లంక గ్రామాల్లో, పిల్లాజెల్లల్ని అయితే పునరావాస కేంద్రాలకు తరలించాం, వారికి అన్ని ఏర్పాట్లు చేశాంకానీ, పశువుల కోసం అని కొంతమంది ఇంకా లంకలను విడిచి రావటం లేదు. అటువంటి ప్రదేశాలకు వెళ్ళి మైకులు పెట్టి, వారిని రెచ్చగొట్టి ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తుంది.   వరదల్లోనూ రాజకీయం చేసి, మీరు ఆనందం పొందాలనుకుంటే అది మీకు తాత్కాలికమే. 

- ఎప్పుడూ చెప్పేటట్టే.. అక్క ఆరాటమే తప్ప బావ బతకడు అన్నట్టు...   చంద్రబాబు  కోసం మీ ఆరాటమే తప్ప రాజకీయంగా ఆయన పైకి లెగవడు. ఇప్పటికే ప్రజలు చంద్రబాబును, ఆయన పార్టీని రాజకీయంగా సమాధి చేశారు. 

- ప్రజల కోసం తాపత్రయపడుతున్న ప్రభుత్వం  ఇది. వరద  బాధితుల మనోభావాలను తెలుసుకుని ముందుకు వెళ్ళే ప్రభుత్వం ఇది.. అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. 

పోలవరం ప్రాజెక్టు విషయానికొస్తే..
    డయాఫ్రం వాల్ మునిగిపోవడం టీడీపీ చారిత్రక తప్పిదం అని అంటే.. అంబటి రాంబాబు ఆంబోతు అని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు చేస్తున్నాడు. నేను ఆంబోతు అయితే..  నీవు ఏమన్నా ఆవువా.. గేదవా.. లేకపోతే కేసి ఆర్ చెప్పినట్టు అటూ ఇటూ కాని శిఖండివా..?
- నాకు మాత్రమే అన్నీ తెలుసనని అహంకారంతో, అహంభావంతో దేవినేని ఉమ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. ఆయనే అపర మేధావి అనుకుంటున్నాడు. మాకు తెలియకపోతే, అధికారులను అడిగి తెలుసుకుని మాట్లాడతాం. అతనిలా అహంభావంతో మాట్లాడం. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు, సోమవారం పోలవారం అని  పెట్టుకుని 40 సార్లు పోలవరం వెళ్ళారు.. పోలవరం 70 శాతం పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న దేవినేని ఉమను, చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాను. 1995లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పోలవరానికి శంఖుస్థాపన చేయాలని ఎందుకు అనుకోలేదు?. దివంగత నేత వైఎస్ఆర్ గారు ఆలోచన చేసి, కేంద్రం నుంచి అనుమతులు తీసుకువచ్చి, కాలువలు తవ్వి,  ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తే, చంద్రబాబు నాయుడు అప్పుడు ఎక్కడున్నాడు..?
- 1995 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వమే ఉంటే.. ఎందుకు పోలవరం కట్టాలని ఆలోచన కూడా చేయలేదు. దీనికి సమాధానం చెప్పి, ఆ తర్వాతే విమర్శలు చేయండి.  
- అలానే,  2018కి పోలవరం నుంచి నీళ్ళు ఇచ్చి చూపిస్తాం.. అపర భగీరథుడు చంద్రబాబు, రాసుకో.. రాసుకో అని ప్రగల్భాలు పలికిన మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు...? దీనికి సమాధానం చెప్పండి. 
- 2018లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతగాని వాళ్ళు మీరా.. మేమా.. నిద్రపోయింది మీరా.. మేమా..?
- పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణం ముమ్మాటికీ మీ అహంకారం, మీ తెలివి తక్కువతనం, మీ తొందరపాటు చర్యే. అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి మీ అసమర్థత. మీ దద్దమ్మతనం కాదని చెప్పగలరా..?

పోలవరంపై చర్చిద్దాం అసెంబ్లీకి రండి అంటే పారిపోతారేం..
- పోలవరం ప్రాజెక్టుపై చర్చించాలంటే నిర్మాణాత్మకంగా జరగాలి. పోలవరం, తాడేపల్లిలో కాదు చర్చించాల్సింది. మీరు బయలుదేరి, మేము బయలుదేరి, పోలీసులు అడ్డుకుని, మీడియాలో రచ్చ చేయడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. పోలవరంపై నిర్మాణాత్మకంగా చర్చ జరగాలి అంటే, శాసన సభ వేదికగా చర్చిద్దాం.. రా.. అని చంద్రబాబును అడిగాం. నీకు చేతనైతే, మీ బాసు చంద్రబాబును నువ్వు అయినా ఒప్పించి తీసుకురా. ఎటూ నీవు అసెంబ్లీకి రాలేవు. మాట్లాడితే, మీరు ఏం పీకారు అంటున్నావు కదా.. గతంలో నీవు గెలిచి, మంత్రిగా ఉన్న మైలవరం నుంచి నిన్ను పీకేశామా.. లేదా..?
- కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా, డయాఫ్రం వాల్ ఎక్కడైనా కడతారా.. ? కాఫర్ డ్యామ్ చేయపోయినా ఫర్వాలేదు, సగం చేసి, గోతులు పెట్టడంవల్లే, డయాఫ్రం వాల్ మునిగిపోయింది. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు, అపర మేధావి ఉమాలే.  మీలాంటి అతి తెలివ వాళ్ళ వల్ల జరిగిన వందల కోట్ల నష్టం అది.  మీరు అపర మేథావులు  కాబట్టే.. ఇన్ని తప్పులు చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మాట్లాడు దేవినేని ఉమా.. నీవే ఏదో మోతుబరిలా అహంభావంతో మాట్లాడమాకు, తగ్గించుకో..
- పోలవరం  పూర్తి చేయడానికి ప్రతిక్షణం మేం తాపత్రయపడతాం. వైఎస్ఆర్ గారు ప్రారంభించిన ప్రాజెక్టును మేమే పూర్తిచేస్తాం. 
- చంద్రబాబు, లోకేష్ పవవన్ కల్యాణ్, బీజేపీ, సీపీఐ, సీపీఎం ఎంత మంది కట్టకట్టుకొని వచ్చినా.. ఒక్కడుగా ఎదుర్కోగల సమర్థుడు జగన్ గారు. ఇప్పటికైనా పిచ్చి మాటలు మాట్లాడటం మానండి. 

తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రెస్‌మీట్ 

ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకున్నాం
    గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి ఉగ్రరూపంలో వరద రావడం జరిగింది. ఈ వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ముందుగానే ఎక్కడికక్కడ అధికారులను సమాయత్తంగా ఉండేలా  అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్తగా ముంపు ప్రాంతాల వద్ద ప్రతిచోట క్యాంపులు ఏర్పాటు చేయించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. గోదావరికి ఇంత పెద్ద ఎత్తున వరద నీరు వచ్చినా ప్రభుత్వం ముందు చర్యల్లో భాగంగా అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చేసింది. అలాగే ఏటుగట్టలు బలహీనపడకుండా రాత్రింబవళ్లు శ్రమించడం జరిగింది.

- గతంలో ఉభయ గోదావరి జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు ఉండేవాళ్లు. అయితే జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఆరు జిల్లాలు కావడంతో.. ఆరుగురు జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు,  ఎస్పీలు అంతా సమిష్టిగా వరద ప్రభావిత జిల్లాల్లో పూర్తి అప్రమత్తంగా వ్యవహరించి బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టారు. వాలంటీరీ వ్యవస్థను తీసుకువచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు హేళనగా మాట్లాడారు. అలాంటి వాలంటీర్లతో పాటు సచివాలయ సిబ్బంది ఇవాళ బాధితులను ఆదుకోవడం జరిగింది.

నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం
        ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌ఛార్జ్‌ మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఆదుకోవడంతో పాటు వారి సమస్యలను విన్నారు. ఇంత పకడ్బందీగా వరద సహాయక చర్యలు చేపట్టడం గతంలో ఎప్పుడూ చూడలేదు. ప్రతి జిల్లాకు కలెక్టర్ల వద్ద రూ.2కోట్ల సహాయ నిధిని ఉంచి, ముఖ్యమంత్రిగారు ఎప్పటికప్పుడూ వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహించారు. అలాగే వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్‌ పంపిణీ  చేశాం.

వరదల సమయంలో బాబు ఏరియల్ సర్వేలు చేయలేదా?
        వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు అనంతరం టెలి కాన్ఫరెన్స్‌లో సంబంధిత జిల్లాల అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏరియల్‌ సర్వే చేస్తే అయిపోతుందా అని విమర్శలు చేయడం సరికాదు. వరదల సమయంలో చంద్రబాబు నాయుడు కూడా ఏరియల్‌ సర్వేలు నిర్వహించలేదా? ఆ సమయంలో ఆయన   ఫ్రూట్స్‌ తింటూ ఏరియల్‌ సర్వేను విహార యాత్రలా, పిల్లచేష్టల్లా చేపట్టలేదా?

- కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు మాత్రం ప్రతి విషయాన్ని ప్రజలకు దగ్గరగా ఉండేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా విపక్షాలు విమర్శలు చేయడం దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు ఏంచేసినా ఆయనకు మైలేజీ రావడం లేదు. టీడీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు కూడా మా సంక్షేమ పథకాలు అందటంతో ముఖ్యమంత్రిగారు ప్రతి కుటుంబంలో, వారి సొంత బిడ్డలా అయిపోయారు.  దాంతో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదు. అందుకే ఇటువంటి అర్థం పర్థం లేని విమర్శలు. 

రామోజీకి తిండి లేదా..?
        ఈనాడు రామోజీరావు చంద్రబాబును భుజాన వేసుకుని పైకిలేపే ప్రయత్నం చేస్తున్నారు. ‘పిల్లలకు పాలచుక్క లేదు... పెద్దలకు తిండి లేదు’ అంటూ హెడ్డింగ్‌ పెట్టి ఓ వార్తను ప్రచురించారు. రామోజీరావుకు పెద్ద వయసు వచ్చి పెద్దవారు అయిపోయారు కానీ, వయసు పెరిగినకొద్దీ వారు  పిల్ల చేష్టలు చేస్తున్నారు. ఎవరికి తిండి లేదు రామోజీరావుగారికా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, టీవీ5 బీఆర్‌ నాయుడుకు తిండి లేదు. నారా లోకేష్‌ నాయుడుకు, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌కు పాల చుక్కలు లేవు. రామోజీరావు అష్టకష్టాలు పడి చంద్రబాబును జాకీలు పెట్టి పైకి లేపాలని ప్రయత్నం చేస్తున్నా... తుప్పు పట్టి కిందకు దిగపోతోంది కానీ, ప్రయోజనం శూన్యంగా మారింది.

- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ప్రజల మనిషి అయ్యారు. ప్రజల గుండెల్లో ఉన్నారు. ప్రతి కుటుంబానికి మామయ్య, అన్నయ్య, తమ్ముడిగా, కుటుంబసభ్యుడిగా  అండగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పాలనతో విసిగిపోయిన జనం వైఎస్‌ జగన్‌గారికి అధికారం ఇస్తే ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి బిడ్డగా మారారు. వరదల విపత్తు సమయంలో, కష్టకాలంలో కూడా దిగజారుడు రాతలు రాయించడం సిగ్గుచేటు.  వరదల సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు. మీరు చేసేది పాలిటిక్స్‌ కాదు ... పాలిట్రిక్స్‌.

- వరదలు వచ్చి, అయిపోయాక చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అంటూ హడావుడి చేస్తాడట. ఇదే ఈనాడులో వచ్చిన ఇటువంటి చెత్త వార్తలతో చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి పాలిట్రిక్స్‌ చేస్తాడు. ఇక పవన్‌ కల్యాణ్‌ మండపేట, భీమవరం వెళ్లారు. పక్కనే గోదావరి. అయినా గోదావరి గట్టుకు రాలేదు. బాధిత ప్రజల్ని పరామర్శించలేదు. చంద్రబాబు ప్రెస్‌మీట్‌ కాగానే పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌ ట్వీట్‌ చేస్తారు. చీప్‌ పాలిటిక్స్‌ చేస్తున్న మిమ్మల్ని ప్రజలు ద్వేషించే పరిస్థితికి తెచ్చుకున్నారు. రామోజీరావు, ఈ వయసులో అయినా ఈనాడు దినపత్రిక క్రెడిబులిటీ పెంచుకుంటారనుకుంటే మరింత దిగజారి, ప్రభుత్వంపై బుదర చల్లించే కార్యక్రమం చేస్తున్నారు.

రూ. 2 వేలు తక్షణ సాయంగా ఇస్తున్నాం
         విపత్తు సమయంలో బాధితుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. పునరావాస కేంద్రాల్లో కూడా ఉన్నవారందరికీ నాణ్యతతో కూడిన భోజనాన్ని అందిస్తున్నాం. క్యాంప్‌ నుంచి బాధితులు తమ ఇళ్లకు వెళ్లేటప్పుడు ఒక్కో కుటుంబానికి రూ.2వేలు తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలా?

- రామోజీరావుగారు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. చంద్రబాబు లెగ్‌ మహత్యం ఏమోకానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు మండుటెండలు బాగా వస్తాయి. కరువు వస్తుంది, ఆ సమయంలో మనుషులు తినడానికి తిండి దొరకదు కదా, పశువులు తినేందుకు గడ్డి కూడా ఉండేదికాదు. విజయనగరం జిల్లాలో పొలాలు అమ్ముకుని భోజనం చేసినవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి దారుణమైన పరిస్థితి చంద్రబాబు హయాంలో వచ్చినా.. రామోజీరావు తన పత్రికలో రాయలేదు. అవన్నీ ఆయన కంటికి కనిపించలేదు.

- ఇవాళ పశువులకు కూడా మేలైన మేత అందించడం జరిగింది. నేను స్వయంగా పర్యటించాను, పలు ప్రాంతాల్లో పశుగ్రాసం అందించాం. ఏ ఒక్క జీవరాశికి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాం. ఇంత జరుగుతున్నా ప్రజలు అసహ్యించుకుంటారనే సిగ్గు లేకుండా నిసిగ్గుగా పనికిమాలిన రాతలు రాయడం బాధాకరం. జగన్‌ గారి పాలన చాలా బాగుందుని ప్రజలకు తెలుసు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ అందిస్తున్నారని ప్రతి గ్రామంలోనూ తెలుసు. మా ముఖ్యమంత్రిగారు అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారనే విషయం రాష్ట్రమంతా తెలుసు. అయినా సరే టీడీపీని, చంద్రబాబు నాయుడును రాతలతో, చేతలతో పైకిలేపాలని రామోజీరావు  ఎంత ప్రయత్నించినా కిందకే కానీ పైకి లేవరు. మీతో పాటు, మీ పత్రిక కూడా దిగజారిపోతోంది.

- రాష్ట్ర ప్రజల కోసం జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అహర్నిశలు పని చేస్తున్నారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు, సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా సమిష్టిగా పనిచేస్తోంది. ఈ విషయాన్ని విమర్శలు చేసేవారు గుర్తుపెట్టుకుంటే మంచిది. 

వెల‌గ‌పూడి సచివాలయంలో మంత్రి సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ప్రెస్ మీట్

రాత్రింబవళ్ళు ప్రభుత్వ యంత్రాంగం వరద సహాయక చర్యల్లోనే..
              రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సకాలంలో అవసరమైన అన్నిముందుస్తు చర్యలు తీసుకోవడంతో గోదావరి వరదల్లో ప్రాణ నష్టం లేకుండా చూడ గలిగాం. గోదావరి వరదలతో అల్లూరి సీతారామరాజు,తూర్పు గోదావరి, ఏలూరు,పశ్చిమ గోదావరి,కోనసీమ జిల్లాలు అత్యధికంగా ప్రభావితం అయ్యాయి. ఆయా జిల్లాల మంత్రులు,జిల్లా ఇన్చార్జి మంత్రులు,ఎంఎల్ఏలు,కలెక్టర్లు,ప్రత్యేక అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు,గ్రామ సర్పంచ్ ల వరకూ అంతా నిరంతరం రేయింబవళ్ళు క్షేత్రస్థాయిలోనే ఉండి ప్రజలకు సేవలందించారు.అన్నిటికంటే ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాలు,వాలంటీర్ల వ్యవస్థల ద్వారా లంక,లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి వారిని సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం లేకుండా కాపాడగలిగాం.
    
వరద ప్రభావానికి లోనైన 5 జిల్లాల్లో 191 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, లక్షా 30వేల 574 మందిని వాటిలోకి తరలించి వారికి అవసరమైన తాగునీరు,ఆహారం వంటి కనీస అవసరాలను కల్పించడం జరుగుతోంది. 256 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడం తోపాటు వదర ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబల కుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. పునరావాస కేంద్రాలల్లోని వారికి కోటి 64 లక్షల ఆహార పొట్లాలను సిద్దం చేసి పంపిణీ చేశాం. అదే విధంగా 14 లక్షల మంచినీటి ప్యాకెట్లను అందించాం.ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు 10 ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు ప్రాంతంలోని బాధితులకై 10వేల ఆహార పొట్లాలను అందించడంతో పాటు రాజమహేంద్రవరం నుండి మరో 10 వేల ఆహార పొట్లాలను కూడా పంపిస్తున్నాం. పునరావాస కేంద్రాల నుండి ఇంటికి తిరిగివెళ్ళే వారికి కుటుంబానికి 2వేల రూ.లు వంతున ఆర్ధిక సహాయాన్ని అందించండ జరుగుతోంది. అదే విధంగా వదర ప్రభావానికి లోనై పునరావాస కేంద్రాల్లో లేని కుటుంబాల వారికి కుటుంబానికి 25కిలోల బియ్యం,కిలో కందిప్పు,కిలో ఉల్లిపాయలు,కిలో బంగాళా దుంపలు, కిలో ఆయిల్ తోపాటు పాలు వంటి సరుకులను ఉచితంగా అందిస్తున్నాం. 

- మరోవైపు కోనసీమ ప్రాంతంలో 31చోట్ల ఏటిగట్లు బలహీనంగా ఉండి గండ్లు పడే అవకాశం ఉన్న చోట్ల ఇసుకబస్తాలు వేసి గండ్లు పడకుండా ప్రజలను కాపాడాం.

చంద్రబాబులా ఏరియల్ విహార యాత్ర చేయలేదు
         గత ప్రభుత్వంలో చంద్రబాబులా ఏరియల్ సర్వే పేరుతో హెలికాప్టర్‌లో విహార యాత్రలు మేం చేయలేదు. సీఎం జగన్‌ గారు ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏరియల్‌ సర్వే చేశారు. చంద్రబాబు హయాంలో వర్షాలు లేవు.. ఎప్పుడూ కరువే. దాంతో ప్రజాగ్రహం అనే వరదలో చంద్రబాబు కొట్టుకుపోయారు. వరద ప్రభావానికి గురైన ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం అంతా అహర్నిశలు శ్రమిస్తుంటే.. వాస్తవాలను కప్పి పుచ్చి కేవలం రాజకీయ లబ్దికోసం ప్రతిపక్షనేతలు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదు. చంద్రబాబు హయాంలో నిత్యం కరువు పరిస్థితులే నెలకొన్నాయి. ప్రతిపక్షం అంటే ఆపదలో ఉన్న వారికి ఓదార్పు నివ్వాలి, ప్రభుత్వం అందించే సహాయ చర్యల్లో ఏమైనా లోపాలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలి తప్ప లేనిపోని ఆరోపణలు చేయడం సబబు కాదు.

- పునరావాస కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనాన్ని నేను కూడా స్వయంగా తిన్నాను. మీరు ఒడ్డున కూర్చుని విమర్శలు చేయడం కాదు. పునరావాస కేంద్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు చూడాలంటే.. రండి వెళదాం. మేమే స్వయంగా చూపిస్తాం. కానీ కొన్ని పత్రికా యాజమాన్యాలు రాజకీయంగా సమాధి అయిన చంద్రబాబును, పైకి తీసుకురావాలని చూస్తున్నారు.  ప్రతిపక్ష నాయకుడు తన రాజకీయాల కోసమే ప్రతి అంశాన్ని వాడుకుంటాడు. హెలికాఫ్టర్ లో తిరిగితే ప్రజల కష్టాలు తీరతాయా.. అని మాట్లాడుతున్న చంద్రబాబులా వరదల్లో నాలుగు ఫోటోలు దిగి, మీ మీడియాలో ప్రచారం చేసుకుంటే కష్టాలు తీరతాయా..?. చంద్రబాబు మాట్లాడినంత మాత్రాన, రాసే ఈనాడు పత్రికకు అయినా బుద్ధి ఉండాలి కదా..? చంద్రబాబును చూస్తే వాన దేవుడు కూడా పారిపోతాడు. ఆయన హయాంలో ఎప్పుడూ కరువే. తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదారి పట్టించాలని ఓ వర్గం మీడియా తప్పుడు రాతలు రాస్తుంది. పిల్లలకు పాలు లేవు అని ఈనాడు రాతలు రాస్తుంది. మరి, లోకేష్ కు పాలు లేక.. చంద్రబాబు, ఈనాడు రామోజీ ఏడుపేమో. చంద్రబాబు ఏడిస్తే.. రామోజీకి ఎందుకు ఏడుపొస్తుందో వారే చెప్పాలి. వరద బాధితులను వదిలేశామనే రాతలు ఇకనైనా మానుకుంటే మంచిది. 

- మీ నాయకులు ఎవరైనా వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారా అంటే లేదు. ఇటువంటి ప్రకృతి విపత్తు వచ్చిన సమయాల్లో, గతంలో ఒక అధికారి పనిచేస్తే.. ఇప్పుడు ఒకరి స్థానంలో సచివాలయాలు, జిల్లాల పునర్విభజన ద్వారా ఆరుగురు పనిచేస్తున్నారంటే, పరిపాలనను ఎంత సమర్థవంతంగా జగన్ గారు ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళామో అర్థం అవుతుంది. 

- పార్టీ పెట్టి 14 ఏళ్ళు అయినా, పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. నిన్న మండపేట వచ్చి.. తన పార్టీని ఏ పార్టీలో విలీనం చేయనని మాట్లాడితే.. ఎవరు నమ్ముతారు..?. పవన్ కల్యాణ్ కు విశ్వసనీయత ఎక్కడ ఉంది. 
 

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం  కొట్టు సత్యనారాయణ, మంత్రి  విశ్వరూప్ లు మాట్లాడుతూ.. 

వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు.  రెండు రోజులుగా వరద పరిస్థితి ఉందని, అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం అని తెలిపారు.  లంక గ్రామాల్లో కూడా భోజనం, వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా.. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో ఆయిల్, ఉల్లి, ఆలు గడ్డలు ప్రతి బాధిత కుటుంబానికి అందిస్తున్నట్లు తెలిపారు. వరదల్లో కూడా చంద్రబాబు బురద రాజకీయం చేయడం దుర్మార్గం. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు విమర్శలను ఓ వర్గం మీడియాలో ప్రాధాన్యత ఇస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. మీడియా బాధ్యతగా ప్రవర్తించాల‌ని మంత్రులు అన్నారు.

Back to Top