మహిళా సాధికారిత సాధనలో బ్యాంకర్ల సహకారం కావాలి

 216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

2020–21లో దేశ జీడీపీ 7.25శాతం మేర తగ్గితే ఏపీలో 2.58శాతానికి పరిమితం

సంపూర్ణ డిజిటలైజేషన్‌కు ప్రతిరూపాలుగా ఆర్బీకేలను బ్యాంకర్లు తీర్చిదిద్దాలి

ఇంటి నిర్మాణం కోసం కనీసం ఒక్కొక్కరికి రూ.35వేల రుణం

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ సమావేశం 

తాడేప‌ల్లి:  మహిళా సాధికారిత సాధన విషయంలో బ్యాంకర్ల సహకారం  అవ‌స‌ర‌మ‌ని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  కోవిడ్‌లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న బ్యాంకులకు ధన్యవాదాలు చెప్తున్నాను. 
కోవిడ్‌ విపత్తు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించింది. పంపిణీ వ్యవస్థ దెబ్బతింది. ఉపాధిమార్గాలు దెబ్బతిన్నాయి. కోవిడ్‌ కారణంగా ప్రాణాలుకూడా కోల్పోయారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా ఇదే రకంగా దెబ్బతింది. గడచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38శాతం తగ్గింది. దీని తదనంతర సంవత్సరం అంటే 2020–21లో కూడా కోవిడ్‌విస్తరణను అడ్డుకోవడానికి లాక్‌డౌన్, ఇత‌రత్రా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగింద‌ని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట్లాడారు.

దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25శాతం మేర పడిపోయింది. మొదటి త్రైమాసికంలో అయితే 24.43శాతం మేర జీడీపీ వృద్ధిరేటు పడిపోయింది. ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందనే చెప్పొచ్చు.  2020–21లో దేశ జీడీపీ 7.25శాతం మేర తగ్గితే ఏపీలో 2.58శాతానికి పరిమితమైంది. ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందిస్తున్నాను. 

ఇదే సందర్భంలో కొన్ని విషయాలను బ్యాంకర్లముందుకు తీసుకు వస్తున్నాను. గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే టర్మ్‌ రుణాలు రూ.3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయి. వ్యవసాయరంగానికి 1.32 శాతం తక్కువగా రుణపంపిణీ ఉన్నట్టు గణాంకాలద్వారా తెలుస్తోంది. అదే సమయంలో పంటరుణాలు 10.49శాతం అధికంగా ఇచ్చినట్టు కనిపించడం సంతోషదాయకం. 

కౌలు రైతుల రుణాలపై ప్రత్యేకదృష్టి
కౌలురైతులకు రుణాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని బ్యాంకర్లను కోరుతున్నాను. ఇప్పటివరకూ 4,91,330 క్రాప్‌ కల్టివేటర్‌ రైట్‌కార్డ్స్‌ (సీసీఆర్‌సీలను) ఇచ్చాం. వీరికి సీసీఆర్‌సీ కార్డులను ఇవ్వడమే కాదు, ఆ డేటాను ఇ–క్రాపింగ్‌లో పొందుపరిచాం. వీరు ఎక్కడ భూమిని కౌలుకు తీసుకున్నారు? వారి సర్వే నంబరు ఏంటి? ఈ వివరాలను ఆర్బీకేలకు, ఇ–క్రాపింగ్‌కు, సీసీఆర్‌సీ కార్డులకు డేటాను అనుసంధానం చేశాం. ఈ కౌలు రైతులంతా నిజంగా పంటను సాగుచేస్తున్న రైతులు. సీసీఆర్‌సీ కార్డుల ద్వారా వీరు కౌలు రైతులుగా ఒక డాక్యుమెంట్‌ద్వారా నిర్థారిస్తున్నాం, అంతేకాదు, వీరు ఎక్కడ పంటను సాగుచేస్తున్నారో ఇ–క్రాపింగ్‌ద్వారా పరిశీలనచేసి ధృవీకరిస్తున్నాం. వీరి విషయంలో బ్యాంకర్లు ముందుకు వచ్చి, వారికి రుణాలు ఇవ్వాలి. వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే ప్రతి ఒక్కరికీ కూడా పంటరుణాలు అందడం చాలా ముఖ్యమైన విషయం. వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నులైన వారికి కచ్చితంగా రుణాలు అందాలి. 

ఆర్బీకేలు– విత్తనం నుంచి విక్రయం వరకూ...
రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులను ఇవి ముందుండి నడిపిస్తాయి.
ఆర్బీకేల్లోనే ఇ– క్రాపింగ్‌ కూడా చేస్తున్నాం. 
సాగు చేస్తున్న కమతం వద్దే రైతును నిలబెట్టి ఫొటో తీసి, జియో ట్యాగింగ్‌చేసి మరీ ఈ– క్రాపింగ్‌ చేస్తున్నాం. 
పంటను సాగుచేస్తున్న రైతుకు డిజిటల్‌ రశీదే కాదు, భౌతిక రశీదుకూడా ఇస్తున్నాం. ఇలాంటి రైతు భరోసా కేంద్రాలు, వ్యవస్థలను గ్రామాల్లో ఉంచాం. వీటిని వినియోగించుకోగలిగితే సమాజానికి బాగా మేలు జరుగుతుంది.

ఈ– క్రాపింగ్‌ అనేది సీసీఆర్‌సీ కార్డులకే కాదు, వడ్డీలేని పంటరుణాలకు, ఇన్‌పుట్ సబ్సిడీకే కాదు, ఇన్సూరెన్స్‌కు.. .ఇలా అన్నింటికీ అనుసంధానం అవుతుంది. దీనివల్ల బ్యాంకర్లు ఇచ్చే రుణాలకు భద్రత కూడా ఉంటుంది. 

ఆర్బీకేలు–బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు
ఇప్పటికే బ్యాంకర్లు 9160 ఆర్బీకేలను మ్యాపింగ్‌చేసి అక్కడ  బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను పెట్టాలని బ్యాంకర్లు నిర్ణయించడం ముదావహం. ఇప్పటికే 6538 కరస్పాండెంట్లను పెట్టడం ప్రశంసనీయం. మిగిలిన చోట్లకూడా వీలైనంత త్వరగా బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను నియమించాలని కోరుతున్నాను. ప్రతి ఆర్బీకే కేంద్రంలో ఒక బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ ఉండాలి. 
ఆ బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ ఆర్బీకేను వినియోగించాలి, అలాగే బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ సేవలు ఆర్బీకే వినియోగించుకోవాలి. 
ఈ– క్రాపింగ్‌ ప్రక్రియలో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ భాగం కావాలి. 
ఇది అంతిమంగా డిజిటలైజేషన్‌ మార్గంలో పెద్ద అడుగు అవుతుంది. 
బ్యాంకింగ్‌ విషయంలో వైయస్సార్‌ జిల్లాలో 100 శాతం డిజిటలైజేషన్‌ పూర్తిచేశామని చెప్తున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో డిజిటలైజేషన్‌ అంటే ఏంటని అడిగితే.. ఖాతాదారులందరికీ ఏటీఎం సదుపాయం కల్పించడం, క్రెడిట్‌కార్డులు ఇవ్వడం, ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడం, ఆన్‌లైన్‌ సదుపాయం కల్పించడం అనిచెప్పారు. ఇది మంచిదే. కాని ఇవి ఇస్తేనే డిజిటలైజేషన్‌ పూర్తికాదనేది నా భావన. గ్రామాల్లోని ఆర్బీకేల్లో ఉన్న మీ బ్యాంకింగ్‌ బిజినెస్‌ కరస్పాండెంట్లు.. బ్యాంకులుగా మారినప్పుడే డిజిటలైజేషన్‌ దిశగా గొప్ప అడుగు వేసినట్టు. వ్యవసాయానికి సంబంధించి రుణాలు ఇవ్వడం, ఇ– క్రాపింగ్‌ ద్వారా వారికి రుణాలు ఇవ్వడం.. ఇవన్నీ ఆర్బీకేల్లోని బిజినెస్‌ కరస్పాండెంట్ల ద్వారా చేయగలిగితే.. గొప్ప విప్లవాన్ని మనం చూడగలుగుతాం. 
ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన  ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు... ఇలా పంటల సాగుకు కావాల్సిన వాటిని కొనుగోలు చేయడానికి రైతులకు అందుబాటులో కియోస్క్‌లను పెట్టాం. అందులో రైతులు ఆర్డర్‌చేస్తే నిర్దేశిత సమయంలోగా వారి గ్రామాల్లోనే వారి ఇంటివద్దకే వారికి కావాల్సినవి అందుతాయి. ఈ వ్యవస్థ అంతా బ్యాంకింగ్‌ రంగంతో అనుసంధానం కావాలి. అంతిమంగా వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమైన ప్రతి వ్యక్తికీ కూడా రుణాలు అందాలి. ఆర్బీకేలు, అందులో కియోస్క్‌లు లాంటి వ్యవస్థలు ఇతర రాష్ట్రాల్లో లేవు. ఇప్పుడు ఇలాంటి వ్యవస్థలు మన రాష్ట్రంలో మనకు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఆదర్శ రాష్ట్రంగా ఏపీని చూపించగలగాలి. ఆర్బీకేలను తమవిగా బ్యాంకర్లు భావించాలి. సంపూర్ణ డిజిటలైజేషన్‌కు ప్రతిరూపాలుగా ఆర్బీకేలను బ్యాంకర్లు తీర్చిదిద్దాలి. 

వైయస్సార్‌ చేయూత
వైయస్సార్‌ చేయూత ద్వారా మహిళలు గణనీయంగా లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారైన మహిళ సుస్థిర ఆర్థిక ప్రగతికి ప్రత్యేక దృష్టిపెడుతున్నాం. లబ్ధిదారులైన మహిళలకు ఏదో ఒకటి ఇవ్వడం కాదు. చేయూత ద్వారా క్రమం తప్పకుండా నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.18,750 చొప్పున, అదే లబ్ధిదారైన మహిళకు మొత్తంగా రూ.75వేలు అందుతాయి. వివక్షకు తావులేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లనుంచి 60 ఏళ్లలోపు ఉన్నవారికి అందుతాయి. రిలయన్స్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గాంబిల్, హిందుస్థాన్‌ యూనిలీవర్, అమూల్‌ లాంటి కంపెనీలతో టై అప్‌ చేశాం. 
ఈ మహిళలకు సరైన మార్గనిర్దేశంచేస్తే.. ఈ డబ్బును పెట్టుబడిగా పెట్టుకుని క్రమం తప్పకుండా ఉపాధి పొందుతారు. చేయూత కింద ఇప్పటికే 2 సార్లు నగదు అందించాం. మరో రెండుసార్లు అందిస్తాం. బ్యాంకర్లు ఈ కార్యక్రమంపై ప్రత్యే శ్రద్ధపెట్టాలని కోరుతున్నాను. మహిళచేతిలో పెట్టే డబ్బు, బ్యాంకర్ల సహకారంతో ఆస్తులుగా మారి, వారికి ఉపాధి అందాలని కోరుతున్నాను. 
ఇప్పటికే 1.17 లక్షల పాలిచ్చే పశువులను పంపిణీచేశాం. 72,179 మేకలు, గొర్రెల యూనిట్లనుకూడా అందించాం. ఫేజ్‌ –2లో భాగంగా కిరాణా దుకాణాలకోసం 22వేలమంది, మరో 35,898 మంది పాలిచ్చే పశువులు కావాలనికూడా దరఖాస్తు చేసుకున్నారు. మహిళా సాధికారిత సాధన విషయంలో బ్యాంకర్ల సహకారం కోరుతున్నాం. 

31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు
దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్‌చేసి ఇచ్చాం. జియోట్యాగింగ్‌చేసి, వారి ఇంటి స్థలాన్ని వారిముందే అప్పగించాం. ఇప్పటికే 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యింది. మొదటి విడతలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం. ఒక్కో లబ్ధిదారునికి కనీసంగా రూ.4–5లక్షల ఆస్తిని సమకూరుస్తున్నాం. సిమెంట్‌, స్టీలు తదితర వినియోగం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. పనులుకూడా విరివిగా లభిస్తాయి. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులైన మహిళలు అంతా అంతా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులే. ఇంటి నిర్మాణం కోసం కనీసం ఒక్కొక్కరికి రూ.35వేల రుణం ఇచ్చే దిశగా బ్యాంకులు అడుగులు ముందుకేయాలి. దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో వారికి తగిన తోడ్పాటు లభిస్తుంది. బ్యాంకులు 3 శాతం వడ్డీకి ఇస్తే, మిగిలిన వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. దీనిపై బ్యాంకులు చురుగ్గా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

జగనన్న తోడు– చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు
జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. 9.05 లక్షలమంది చిరువ్యాపారులు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరికీ రూ.10వేల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. దీనిపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. 
ప్రతి ఆరునెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడంతోపాటు, అందులో అర్హులైన వారికి రుణాలు మంజూరు ప్రక్రియ కొనసాగాలి. దీనిపై బ్యాంకులు దృష్టిసారించాలి.

ఎంఎస్‌ఎంఈలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను కోరుతున్నాను.ఒక్కో పరిశ్రమ కనీసం 10 నుంచి 20 మందికి ఉపాధినిస్తున్నాయి.వీరికి తగిన తోడ్పాటు అందించాలని బ్యాంకర్లను కోరుతున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు. 

ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను పెట్టాం: వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌
 
10778 ఆర్బీకేల్లో ఇప్పటికే 6538 చోట్ల పెట్టాం. 
మిగిలిన చోట్ల కూడా బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను పెట్టేందుకు చర్యలు తీసుకుంటాం. 
ఏపీ చేపడుతున్న చేయూత సహా మహిళల్లో స్వయంఉపాధి కోసం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి
ఇటీవల ముంబైలో జరిగిన సమావేశాల్లో పలు ఉత్తరాది రాష్ట్రాలు ఏపీ కార్యక్రమాలపట్ల ఆకర్షితులయ్యారు.
తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని బ్యాంకర్లను కోరారు.
పెద్ద సంస్థలతో కలిసి రిటైల్‌ దుకాణాలను మహిళలు నడుపుతున్న తీరుపట్ల బిహార్, యూపీ ఎంపీలు ఆసక్తి వ్యక్తంచేశారు.
ఏపీ తరహాలోనూ తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. 
జగనన్న తోడులో భాగంగా చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాల్లో దేశంలోనే ఏపీ నంబర్‌ఒన్‌గా నిలిచింది.

సంపూర్ణ డిజటలైజేషన్‌: సుధీర్‌కుమార్‌ జన్నావర్‌, చీఫ్‌జనరల్‌మేనేజర్, నాబార్డ్‌

వైయస్సార్‌ జిల్లాలో పూర్తిస్తాయి డిజిటలైజేషన్‌ పూర్తయ్యింది. తదుపరి గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో సంపూర్ణ డిజటలైజేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.

రైతులకు చాలా ప్రయోజనకరం: దినేష్‌కుమార్‌ గార్గ్, యూబీఐ ఈడీ, ముంబై.
ఆంధ్రప్రదేశ్‌ చేపడుతున్న కార్యక్రమాలు కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్థిక వ్యవస్థ నిలబడ్డానికి దోహదపడ్డాయి. ఆర్బీకేలు కూడా వినూత్న వ్యవస్థ. దీనివల్ల రైతులకు చాలా ప్రయోజనకరం. ఆర్బీకేల ద్వారా ఎరువులు, పురుగుమందులు, విత్తనాల అమ్మకం, కియోస్క్‌ల ద్వారా ఆర్డర్లు తీసుకోవడం ఇప్పటి డిజిటల్‌ ఏజ్‌లో ముందడుగుగా భావిస్తున్నాం. 

ఈ సమావేశంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి కె సునీత,  ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధీర్‌ జన్నావర్,  ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ వి బ్రహ్మానందరెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

వర్చువల్‌గా ఆర్‌బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ కె నిఖిల, యూబీఐ ఈడీ దినేష్‌ కుమార్‌ గార్గ్‌లు సమావేశంలో పాల్గొన్నారు.

Back to Top