ఏపీ రాష్ట్రం మీ బాబు జాగీరా.. లోకేశ్‌

కుప్పంలో చంద్రబాబును మత్స్యకారుడితో ఓడిస్తాం

టీడీపీ చంద్రబాబు ఆక్రమించుకున్న పార్టీ

మంత్రి సీదిరి అప్పలరాజు

కాశీబుగ్గ: ‘ఏపీ రాష్ట్రం మీ బాబు జాగీరా.. లోకేశ్‌ నువ్వు మంత్రి ఎలా అయ్యావు.. టీడీపీని ఆక్రమించుకున్నది మీరు. అలాంటి మీరు సీఎం వైఎస్‌ జగన్‌ పై విమర్శలు చేస్తారా?’ అంటూ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. ఆయన ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాసలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉండి దొడ్డిదారిలో లోకేశ్‌కు ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి అయ్యారని చెప్పారు. చంద్రబాబు కుమారుడిగా పుట్టడం తప్ప లోకేశ్‌కు ఇంకెలాంటి అర్హతలు లేవని విమర్శించారు.

ఎక్కడైనా ఎమ్మెల్యేగా గెలవగలవా అని సవాల్‌ విసిరారు. కుప్పంలో మత్స్యకారుడు పోటీచేస్తున్నాడని, ఆయనపై చంద్రబాబు గెలవగలరా అంటూ ప్రశ్నించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయితే దేశ నాయకుడు అయిపోరని చురకలు అంటించారు. సీఎం జగన్‌ వద్దకు వెళ్లాలంటే అప్పలరాజు వంటి లక్షలమందిని దాటాల్సి ఉంటుందని చెప్పారు. అమరావతిలో చంద్రబాబు నివాసంతోపాటు ప్రజావేదిక వంటివన్నీ అక్రమ నిర్మాణాలేని, అలాంటి వ్యక్తులు అక్రమాలపై మాట్లాడడమా అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం వల్లే పలాసలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.

వైఎస్‌ జగన్‌ నేర్పించిన క్రమశిక్షణ వల్ల సహనంతో ఉంటున్నామన్నారు. గౌతు కుటుంబసభ్యులు తమ 60 ఏళ్ల పాలనలో పలాసకు ఒక డిగ్రీ కాలేజీ తీసుకురాలేకపోయారని విమర్శించారు. సీఎం దయ వల్ల డిగ్రీ కళాశాల, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, డయాలసిస్‌ కేంద్రాలు తెచ్చుకున్నామని చెప్పారు. నియోజకవర్గం పరిధిలోని గిరిజన గ్రామాల్లో రూ.42 కోట్లతో రోడ్లు వేశామన్నారు. గౌతు శిరీష మాటతీరు చూస్తుంటే లచ్చన్న మనవరాలి మాటల్లా లేవన్నారు. తనను పలుమార్లు పశువు పశువు అని సంభోదిస్తుంటే చాలా బాధ కలిగిందని చెప్పారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top