ఆర్థికేతర అంశాలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రయత్నం

అన్ని అంశాలను సానుకూలంగా పరిష్కరిస్తాం
 
ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  

పీఆర్సీ పెండింగ్‌ అంశాలపై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చ

అమరావతి: ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికేతర అంశాలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామ‌ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అన్ని అంశాలను సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పారు . బుధవారం వెలగపూడి సచివాలయంలో పీఆర్సీ పెండింగ్‌ అంశాలు, వాటిలో ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సభ్యులైన సజ్జల, బొత్స సత్యనారాయణ చర్చించారు. 

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..  ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌ అమలులో సమస్యల పరిష్కారం, పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంపును సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాలతో పాటు పలు సంస్థల ఉద్యోగులకు వర్తింపచేయడం, కొత్త జిల్లాలకు పాత జిల్లాల హెచ్‌ఆర్‌ఏ వర్తింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కోవిడ్‌ వల్ల మరణించిన ఉద్యోగుల కుటుంబీకులకు సత్వరమే కారుణ్య నియామకం, క్యాడర్‌వారీగా పే స్కేళ్ల ఫిక్సేషన్‌ జీవో జారీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఆర్థిక అంశాలకు సంబంధించి పెండింగ్‌ బిల్లుల క్లియరెన్సు, పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపు తదితర అంశాలపైనా చర్చించారు. ఈ సమావేశంలో జీఏడీ సర్వీసెస్‌ కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కీలకమైన ప్రత్యేక హోదాయే ఇవ్వలేదు.. పునర్విభజన పెద్ద విషయం కాదు 
విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, కీలకమైన ప్రత్యేక హోదాయే ఇవ్వలేదని, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కేంద్రానికి పెద్ద విషయమేమీ కాదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ప్రత్యేక హోదాపైనే కేంద్రం తప్పించుకోవాలని చూస్తోందని చెప్పారు.

చంద్రబాబు బీజేపీతో అధికారాన్ని పంచుకున్నప్పుడు ప్రత్యేక హోదా గురించి ఒత్తిడి చేయలేదని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చడం వంటి అంశాలతో వాళ్లు రాజీ పడ్డారని, దానివల్ల రాష్ట్రం నష్టపోయిందని తెలిపారు. తమ పార్టీ విధానం పరిపాలన వికేంద్రీకరణ అని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇంకా కిందిస్థాయికి ప్రాతినిథ్యం పెరుగుతుందని  చెప్పారు. వరదల గురించి చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన మొక్కుబడిగా లక్ష మాటలు మాట్లాడతారని, ఆయనది అంతా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ అని, కెమెరాలకు పోజులివ్వడానికే వెళతారని విమర్శించారు.

సీఎం వైయ‌స్‌ జగన్‌ వరద ప్రాంతాల్లో షెడ్యూల్‌లో లేని గ్రామాలకు కూడా వెళ్లారని, ప్రతి గడపను టచ్‌ చేశారని తెలిపారు. సాయం అందలేదన్న మాట ఎక్కడా వినపడలేదన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. విలీన గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపమని కోరలేదని స్పష్టం చేశారు. వరదలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. జిల్లా కేంద్రం పాడేరు దూరంగా ఉందని వేరే సందర్భంలో చెప్పిన విషయాన్ని వరదలకు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.  

Back to Top