చంద్రబాబు ఓటు వేసింది సైకిల్‌కా? ఫ్యాన్‌కా?

సజ్జల రామకృష్ణారెడ్డి 

సానుభూతి కోసమే ఈసీ కార్యలయం ముందు డ్రామా

 చంద్రబాబు మానసిక స్థితిని వైద్యులే చెప్పాలి

 హైదరాబాద్‌ : చంద్రబాబుకు ఓడిపోతున్నామని ముందే తెలిసిపోవడంతో పోలింగ్‌ ఒక రోజు ముందే పెద్ద డ్రామాకు తెరలేపారని వైయస్‌ఆర్‌సీపీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఒక గుర్తుకు ఓటేస్తే మరో గుర్తుకు వెళ్తోందని చంద్రబాబు అర్ధరహిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80 శాతం పోలింగ్‌ జరిగిందని, చంద్రబాబు కుటుంబం సహా ఓటు వేసిన వారెవరూ దీనిపై ఫిర్యాదు చేయలేదన్నారు. కానీ చంద్రబాబుకు మాత్రమే ఈవీఎంలపై అనుమానాలు వస్తున్నాయని, అసలు ఆయన దేనికి ఓటే వేశారని, సైకిల్‌కా? లేక ఫ్యాన్‌ గుర్తుకా? అని ప్రశ్నించారు.

శనివారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు ఏమైందో తెలియదు. పోలింగ్‌ ఒక రోజు ముందు పెద్ద డ్రామాకు తెరలేపారు. సానుభూతి కోసమే ఈసీ కార్యలయం ముందు బైఠాయించారు. 2014లో కూడా ఇవే ఈవీఎంలు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలో వచ్చారంటే అప్పుడు కూడా ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగాయా? 2014 ఫలితాలను జగ్‌మోహన్‌ రెడ్డి హుందాగా స్వీకరించారు. 70 ఏళ్ల చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారో అందరు చూస్తున్నారు. ఒక గుర్తుకు ఓటేస్తే మరో గుర్తుకు వెళ్తోందంటున్న చంద్రబాబు మానసిక స్థితిని వైద్యులే చెప్పాలి. ఎన్టీఆర్‌ తెలుగు జాతి కోసం పోరాడితే.. చంద్రబాబు మాత్రం తెలుగువారి పరువు తీస్తున్నారు.

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనేది ప్రజలకు సంబంధించినది కాదు. చంద్రబాబు సొంత పనుల కోసం పెట్టుకున్నారు. ఆయన్ను తప్పించడం వల్ల జరిగే నష్టమేమి లేదు. సీఎస్‌ మరో ముగ్గురు ఎస్పీలను బదిలీ చేశారు. మిగిలిన అధికారులంతా ఐదేళ్లు ప్రభుత్వంలో ఉన్నవారే. గులామ్‌ల్లాగా పనిచేసే వారు లేరని చంద్రబాబుకు బాధ. ప్రభుత్వ ఉద్యోగులు లక్షల మంది ఉన్నా... చైతన్య, నారాయణ కాలేజీ సిబ్బంది ఎందుకు వాడారు? ఓటర్లకు నీళ్లు, బిస్కెట్లు రాలేదని లోకేష్‌ ఆరోపిస్తున్నారు. ఆ బాధ్యత ప్రభుత్వంలో ఉన్న మీది కాదా? ఈవీఎంలు పనిచేయకపోవడం కూడా అధికార పార్టీ వైఫల్యమే. ఏపీ డీజీపీ ఆఫీసుకు సీఎస్‌ వెళ్లడం తప్పుకాదు. ఏపీ సీఎస్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు. ఏపీ సీఎస్‌పై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. సీఎం హోదా ఉండి ఈసీ ఆఫీసుకు చంద్రబాబు వెళ్లలేదా? ప్రజలు నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారని మేం భావిస్తున్నాం’ అని సజ్జల పేర్కొన్నారు.

 

Back to Top