శ్రీకాకుళం: పట్టభద్రులంతా వైయస్ఆర్‌సీపీ వైపే ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అంతా ఏకతాటిపై నిలవాలని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జరిగే శాసన మండలి ఎన్నికలలో విజయ భేరీ మోగించాలని, అధికార పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ను అనూహ్య మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు కన్వెన్షన్ హాల్ లో వైయస్ఆర్ సీపీ జిల్లా కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏర్పాటు చేసిన ఈ సమావేశాన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇది ఒక ముఖ్యమయిన సమావేశం. మనం ఒకచోట సమావేశం అయి భవిష్యత్ కార్యాచరణ గురించి ఏమీ అనుకోక పోతే, చర్చించక పోతే మన గురించి అసత్య ప్రచారాలు విపక్షాలు చేసే అవకాశం ఉంది. యాదవులకు చట్ట సభల్లో ప్రాధాన్యం ఇవ్వడం ఈ సారి ప్రత్యేకం. యాదవులు 83 నుంచి టీడీపీ కే మద్దతుగా ఉన్నారు. 1999,2004,2009,2014 ఎన్నికల వరకూ నాటి వైయస్ హయాం నుంచి నేటి జగన్ పాలన వరకూ క్రమ క్రమంగా యాదవులు సంబంధిత నాయకత్వాలకు మద్దతు ఇవ్వడం మొదలపెట్టారు. 1983 నుంచి 2019 వరకూ టీడీపి యాదవులకు జిల్లా నుంచి అవకాశం ఇవ్వలేదు. ఇది ఒక శుభ పరిణామం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాలుగో పెద్ద కమ్యూనిటీ యాదవులు. కాపు, కాళింగ, వెలమ, తరువాత యాదవ ఇవే కీలక సామాజిక వర్గాలు. ఈ నేపథ్యాన వీరికి ప్రాధాన్యం ఇవ్వడం ఆనందదాయకం. ఈ మండలి ఎన్నికలు ఎలానూ గెలుస్తాం. ఇదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించాలి. ఇదే సందర్భాన మన జిల్లాకు చెందిన కొంత మంది యాదవ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్నేళ్ల కాల గతిలో మీకు ఎన్నడూ చట్ట సభలలో అడుగు పెట్టే అవకాశమే రాలేదు. ఇవాళ మీరంతా జగన్ ను కోరిన మేరకు ఆయన మీ కోరిక నెరవేర్చారు. దీనిని మీరు గుర్తించాలి. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఉన్న యాదవులు అంతా వైసీపీ వెనుక నడవాలి. లేదంటే మీకు గుర్తింపు ఇచ్చినా ఇవ్వకున్నా ఒక్కటే అన్న భావన రేపటి వేళ వైసీపీకే కాదు ఇతర రాజకీయ పార్టీలకు వస్తుంది. ఆ విధంగా రాకూడదంటే మీరంతా వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ నాయకత్వాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శనీయంగా ఉంది. ఇక్కడ చూస్తే యాదవ,పక్క జిల్లాలో వాడ బలిజ, ఇంకా మిగిలిన ప్రాంతా లలో బలిజతో సహా ఇతర వెనుకబడిన సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి, రాజకీయ అధికారం దక్కించిన పార్టీ వైయస్ఆర్ సీపీనే, ఇదే సందర్భాన వైయస్ఆర్ సీపీకి కృతజ్ఞత ఓ యాదవుల మహా సభను నిర్వహించి, వచ్చే ఎన్నికల్లో మద్దతుగా ఉంటాం అని ఓ తీర్మానం చేయించండి. దీనిని గ్రామాగ్రామాన వినిపించండి. యాదవులంతా వైయస్ఆర్ సీపీ వెనుకే అన్న నినాదాన్ని నర్తు రామారావు నాయకత్వా న వినిపించండి. 1999 నుంచి ఈ జిల్లాలో నాడు వైయస్ఆర్ కు కానీ ఇప్పుడు వైయస్ జగన్ కు కానీ యాదవులు మద్దతుగా ఉన్నారు. అలానే కాపులు కూడా ఉన్నారు. కాపుల కోసం కూడా అపార్థం చేసుకోనవసరం లేదు. కాపులు కూడా వైయస్ఆర్ సీపీతోనే ఉన్నారు. ఇవన్నీ మీడియాలో వచ్చే కథనాలు,వీటిని నమ్మాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వైసీపీ కి ఓటు వేస్తే మళ్లీ వేరొక పార్టీకి ఓటేయ్యరు. మన మధ్య విభేదాలు తెచ్చే కథనాలు నమ్మవద్దు.మన పార్టీ ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే ఉంటుంది. మనలో ఉన్న కాపులు ఎవ్వరూ పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించలేదు. రామారావు గెలుపు.. వైయస్ఆర్ సీపీకి కష్టమయిన పని కాదు. స్థానిక సంస్థల కోటాలో ఆయన గెలుపు సుసాధ్యం. ఎవ్వరైనా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తే మరుసటి రోజే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. ఎవ్వరైనా ఏ స్థానిక ప్రతినిధి అయినా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తే వెంటనే చర్యలు తప్పవు. వెంటనే పార్టీకి తెలిసి పోతుంది. అలానే పట్టభద్రుల నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్న సీతంరాజు సుధాకర్ గెలుపునకు కూడా కృషి చేయాల్సి ఉంది. ఉత్తరాంధ్ర పట్టభద్రులంతా కూడా వైయస్ఆర్ సీపీతోనే ఉన్నారు. ఇప్పటికే ఎన్ రోల్ మెంట్ కూడా పెద్ద సంఖ్యలో సాగింది. అదేవిధంగా ఇవాళ విశాఖను రాజధానిగా చేయాలన్న ప్రయత్నం వైయస్ జగన్ చేస్తున్నారు. ఆయన ప్రయత్నం కారణంగా మన హోదా,మన సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక చదువుకున్న పిల్లలెవరైనా వైయస్ఆర్ సీపీకి వ్యతిరేకంగా ఉంటారని అనుకోను. పార్టీ అందించే సాయం అన్నది గొప్పది. దానిని ఎవ్వరూ విస్మరించకూడదు,. పార్టీలో ఉన్న వివిధ సామాజిక వర్గాల నేతలు గుర్తించుకోవాలి. విశాఖ కేంద్రంగా క్యాపిటల్ వస్తే ఇక్కడ ప్రజల ఆస్తుల విలువ పెరగడం ఖాయం. ఎప్పుడయినా ఆస్తి విలువ అన్నది ఆ ప్రాంతంకు ఉన్న ప్రాధాన్యం అనుసరించి పెరిగిపోతుంది. ఆ విధంగా ఇక్కడున్న ఆరు జిల్లాలకు చెందిన ఆస్తుల విలువ పెరిగిపోనుంది. అందుకే పట్టభద్రులను వైయస్ఆర్ సీపీకి ఓటు వేసే విధంగా ప్రచారం చేయాలి. ఎన్నికలకు సంబంధించి బాధ్యతలు అప్పగించిన వారంతా సక్రమంగా పనిచేయగలగాలి. ఏది చెప్పినా మన నినాదం ఐక్యతకు సంకేతం కావాలి. వైసీపీ వర్థిల్లాలి అంటే ఏం చేయాలి ప్రతి ఎన్నికల్లోనూ శత్రువును జయించాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇప్పటి మండలి ఎన్నికల్లోనూ గెలుపు సాధించాలి. పట్టభద్రుల ఎన్నికలు గెలవకపోతే ఎడ్యుకేటర్స్ లో ఈ పార్టీకి బలం లేదన్న సంకేతాలు వెళ్తాయి. రూరల్ లోనూ, మహిళల్లోనూ ఇంకా ఇతర వర్గాల్లోనూ వైయస్ఆర్ సీపీ ఇవాళ బలంగా ఉంది. కనుక ఇది ఒక మంచి అవకాశం. దీనిని జారవిడుచు కోవద్దు. పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపు సాధించడమే ధ్యేయంగా అంతా పనిచేయాలి. త్వరలోనే యాదవుల మహా సభ ఒకటి జిల్లా స్థాయిలో నర్తు రామా రావు నాయకత్వాన నిర్వహించనున్నారు. ఆ సభలో కూడా ప్రతి పక్షపార్టీలకు చెందిన యాదవ నాయకులను కూడా కలుపుకుని వెళ్దాం. ఆ సభలో ప్రవేశ పెట్టే తీర్మానానికి అనుగుణంగా రేపటి వేళ వైయస్ఆర్ సీపీకి మద్దతుగా యాదవులంతా నిలవాలి. అదే సందేశాన్ని గ్రామ గ్రామానికీ తీసుకుని వెళ్లాలి అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.