వంశధార నిర్వాసితులను చంద్రబాబు పట్టించుకోలేదు

పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి

అమరావతి : వంశధార నిర్వాసితులను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమ‌ర్శించారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి వంశధార ప్రాజెక్టును ప్రారంభించారని ఆమె గుర్తుచేశారు. జలయజ్ఞంలో భాగంగా వైయ‌స్ఆర్‌ హయంలో 80 శాతం భూసేకరణ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. వైయ‌స్ఆర్‌ మరణం తర్వాత ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా వంశధార ప్రాజెక్టుకు సంబంధించి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడారు.

వంశధార పూర్తయితే 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆమె తెలిపారు. రైతులు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. గత ఐదేళ్లుగా వంశధార నిర్వాసితులను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబు హయంలో నిర్వాసితుల ఆందోళనను దేశం మొత్తం చూసిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని కోరారు. గత పాలకులు వంశధార ప్రాజెక్టు నిధులను స్వాహా చేశారని ఆరోపించారు. ప్రజాతీర్పును వంచించి అక్కడి ఎమ్మెల్యే టీడీపీ పంచన చేరారని గుర్తుచేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ప్రభుత్వం అండతో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. నిర్వాసితులకు జరిగిన అన్యాయాన్ని బయటకు తీయాలని కోరారు. 

అనంతరం మాట్లాడిన నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. వంశధార ప్రాజక్టు నిర్వాహితులకు పరిహారం చెల్లింపుపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని స్పష్టం చేశారు. అవినీతిని వెలికి తీసీ చర్యలు తీసుకుంటామని తెలిపారు.  నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజీల విషయంలో కూడా అవినీతి జరడం దారుణమన్నారు.

తాజా ఫోటోలు

Back to Top