తాడేపల్లి: పేదల ఇళ్లపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని, ఆ ఇళ్లన్నీ గుల్ల చేయాలన్న కుతంత్రంతో అవినీతి ఆరోపణలు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి అన్నారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పుత్తా శివశంకర్‌రెడ్డి ఏమన్నారంటే..: – రాష్ట్రంలో సొంతిల్లు లేకుండా ఏ ఒక్క కుటుంబం కూడా ఉండకూడదన్న లక్ష్యంతో నాడు సీఎం వైయస్ జగన్, కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా 31.70 లక్షల ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. – ఇంకా ఇళ్లు నిర్మించే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంది. ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం దాదాపు రూ.2.70 లక్షలు కాగా, అందులో రూ.1.80 లక్షలు ప్రభుత్వమే సమకూర్చింది. ఇంకా 4.5 మెట్రిక్ టన్నుల సిమెంట్, 20 టన్నుల ఇసుక, కంకర తదితరాల రూపంలో ఒక్కో ఇంటి నిర్మాణం కోసం మరో రూ.40 వేల మేర లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇంకా రూ.35 వేలు రుణం రూపంలో, అది కూడా కేవలం పావలా వడ్డీకే ఇప్పించారు. – రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా, వాటిలో 19.13 లక్షల సాధారణ ఇళ్లు, 2.60 లక్షల టిడ్కో ఇళ్లు ఉన్నాయి. – వాటిలో ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 9.02 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, 11.61 లక్షల ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. – దేశంలో ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణం ఒక యజ్ఞంలా కొనసాగింది. అయినా పేదలకు ఇచ్చిన ఆ ఇంటి స్థలాల విషయంలో కూటమి నాయకుల కుళ్లు కుతంత్రాలు చూపిస్తున్నారు. – ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినా, చంద్రబాబు ఒక్కరికి కూడా కనీసం సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. – వైయస్ఆర్ జగనన్న కాలనీల కోసం మొత్తం 71,811.19 ఎకరాలు కేటాయించడం జరిగింది. అందులో ప్రభుత్వ భూములు 28,554.64 ఎకరాలు కాగా, సేకరించిన భూమి 25,374 ఎకరాలు, ల్యాండ్ పూలింగ్ ద్వారా 4,457 ఎకరాలు, విశాఖలో ఏఎమ్మార్డీఏ నుంచి 1074 ఎకరాలు, టిడ్కో నుంచి 2550 ఎకరాలు సేకరించడం జరిగింది. – ఈ కార్యక్రమం మొత్తం జిల్లా కలెక్టర్ల ద్వారానే కొనసాగింది. ఎక్కడా నేతల ప్రమేయం లేదు. భూసేకణ కోసం డిప్యూటీ కలెక్టర్లు రైతులతో నేరుగా మాట్లాడారు. పరిహారం కూడా చెక్కుల రూపంలో ఇచ్చారు. ఇదంతా పూర్తి పారదర్శకంగా జరిగింది. – ఆరోజు ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్న కలెక్టర్లు, ఇతర అధికారులు నేడూ పని చేస్తున్నారు. కావాలంటే విచారణ చేసుకోవచ్చు. మేము అభ్యంతరం చెప్పబోము. – ఇప్పటికే చాలా చోట్ల కాలనీలుగా, ఊళ్లుగా రూపుదిద్దుకున్న ప్రాంతాలను, దర్యాప్తు పేరుతో పనులు ఆపిన ప్రభుత్వం, వాటిని నామరూపాల్లేకుండా చేయాలన్న కుట్రకు పూనుకోవడం హేయం. – పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి ఉంటే, అసంపూర్తిగా ఉన్న కాలనీల నిర్మాణాలు పూర్తి చేసి, లబ్ధిదార్లకు అందజేయాలని పుత్తా శివశంకర్‌రెడ్డి కోరారు.