తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అవసరాలకు పెట్టిన టెంట్ హౌజ్ పార్టీనే జనసేన అని, పవన్ రాజకీయాలు కూడా కూడా చంద్రబాబు కోసమే నడుస్తున్నాయని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎద్దేవా చేశారు. పొత్తులపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నాని స్పందిస్తూ.. బలం లేదన్న విషయం పవన్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా?. పార్టీ పెట్టిన సమయంలోనే బలం లేదని పవన్‌కు తెలుసు. అప్పుడు బలం లేదు కాబట్టి పోటీ చేయలేదని చెప్పాడు. మరి 2019లో ఎందుకు పోటీ చేశాడు?. ఎందుకంటే.. 2019లో చంద్రబాబుకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆ ఓట్లు వైయస్ జగన్‌కు పడకుండా చీల్చడానికే జనసేన పోటీ చేసింది. ఓట్ల కోసం రాజకీయాలు చేయడం పవన్‌కే చెల్లింది. ఒకప్పుడు వంద కోట్ల రూపాయలు వదులుకుని.. రాజకీయాలు చేశానని చెప్పుకున్నాడు. మరి ఇప్పుడు.. చంద్రబాబుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయటకు వస్తున్నాడు. ఏదో వాహనం(వారాహిని ఉద్దేశించి..) అంటూ హడావుడి చేసి ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తే బయటకు తీస్తా అంటున్నాడు. నా బాధ అంతా ఒక్కటే. పవన్‌ను నమ్ముకుని సాఫ్ట్‌వేర్ జాబ్స్ సైతం వదులుకుని.. పవన్‌ను సీఎం చేస్తామంటూ కంకణం కట్టకుని కొందరు ఊరురా తిరుగుతున్నారు. వాళ్లు తమ త్యాగాలను మానుకుని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని పేర్ని నాని సూచించారు.