చంద్రబాబు జైలుకెళ్తే టీడీపీ నాయకులు ఎవరూ బాధపడటం లేదు

మాజీ మంత్రి పేర్ని నాని

లంచాలు తిని కంచాలు మోగించటం చూస్తుంటే.. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టుంది

టీడీపీకి కోటిమంది సభ్యత్వం ఉన్నట్టు చెప్పుకునేవారు

మరి నిన్న ఎంతమంది గంట కొట్టారు?

ఇప్పటికైనా ప్రగల్భాలు పలికేవాళ్లంతా ఆత్మావలోకనం చేసుకోవాలి

సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమా?: లోకేష్‌కు పేర్ని నాని సవాల్‌

తాడేప‌ల్లి: చేసిన పాపాలకు చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.చంద్రబాబు జైలుకెళ్తే టీడీపీ నాయకులు ఎవరూ బాధపడటం లేదన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన చంద్రబాబు.. ముద్రగడ పద్మనాభం నిరసనకు దిగితే ఆయన్ను వేధించారు. లంచాలు తిని కంచాలు మోగిస్తారా   అంటూ దుయ్యబట్టారు.  ఆదివారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.   

చంద్రబాబు చేసిన పాపాలు, ఘోరాలు, దోపిడీలు.. దండనై మిమ్మల్ని దండిచే పరిస్థితి ఎదురైంది. 
నాడు కాపులకు బీసీ రిజర్వేషన్లు వర్తింపజేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఓట్లేయించుకుని దగా చేశారు. 
అధికారంలోకి రాగానే వారి ఆశలను, బీసీ రిజర్వేషన్‌ను చంద్రబాబు తుంగలో తొక్కాడు. 
ఆ ఉద్యమంలో భాగంగా ముద్రగడ పద్మనాభం పళ్ళాలను మోత చేస్తూ కాపుల ఆకలి కేకలను వినిపించాడు. 
ఆనాటి నిరసన ఆవేదనతో కూడిన నిరసన..
నిన్న చూస్తే ఆనందంతో డోలు కొడతారు..ఢమరుకం వాయిస్తారు...
వారి అంతర్జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అవినీతి కేసులో లోపలకు వెళ్లడం పట్ల ఎవరికీ కించిత్‌ బాధ కనిపించడం లేదు. దానిని ఒక రాజకీయ కార్యక్రమంగా చేయడం మినహా వారిలో బాధ మాత్రం లేదు. 

 అక్రమ కేసులు అయితే చట్టాలు మిమ్మల్ని ఎందుకు కాపాడటం లేదు?: 
చంద్రబాబుపై అక్రమ కేసులు పెడుతున్నారని తెగ గగ్గోలు పెడుతున్నారు. 
అక్రమ కేసులు అయితే.. చట్టాలు ఎందుకు వారిని కాపాడటం లేదు.? 
ఆయనలో ఏ తప్పు లేకపోతే, ఏ దోపిడీ చేయకపోతే, ప్రజల సొమ్మును కైంకర్యం చేయకపోతే ఎందుకు కోర్టులు రిలీఫ్‌ ఇవ్వడం లేదు? 
ఈ మాత్రం నిజం చంటిపిల్లలకు కూడా అర్ధమవుతోంది. 
లంచాలు తినేసి కంచాలు మోగించడం విచిత్రంగా ఉంది..తినమరిగిన కోడి ఇళ్లెక్కి కూసినట్లుంది. 
మీ పార్టీ సభ్యత్వం 2020లో 50 లక్షలు అన్నారు.. 2022లో అది కోటికి చేరిందట. 
ఈ ఐదు కోట్ల జనాభాలో కోటి మంది టీడీపీ సభ్యులు ఉన్నారని మీరు డప్పు కొట్టుకుంటున్నారు. 
మీ కోటి మంది కార్యకర్తలు కూడా చంద్రబాబు జనం సొమ్ము దిగమింగేశాడని నమ్మారు కాబట్టే కంచాలు కొట్టలేదు. ఇప్పటికైనా ప్రగల్భాలు పలికే టీడీపీ నేతలు కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి. 
ప్రజలే కాదు...టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు ప్రజల సొమ్ము నొక్కేశారని భావిస్తున్నారన్నది గుర్తించాలి. 

 జనం సొమ్ము దోచుకున్నోడి కోసం మోత మోగించాలా..?: 
ఇన్నాళ్లకు పాపం పండి ఒక కేసులో లోపలికి వెళితే అన్నీ మోగించాలట. 
బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసిందని తిరగబడిన ఆంధ్రరాష్ట్ర ప్రజలు రోడ్డెక్కితే లోపలేశారు. 
జనం సొమ్ము దోచుకున్నోడ్ని అరెస్టు చేస్తే మాత్రం అందరూ వచ్చి గంట మోగించాలి..మోత మోగించాలి. 
వైఎస్‌ జగన్‌ గారిపై పెట్టిన కేసులు అక్రమ కేసులని ఐదు కోట్ల ప్రజలు నమ్ముతున్నారు.. కాబట్టే ఈ రోజుకీ ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. 
చంద్రబాబు, సోనియా గాంధీ, ఆనాటి తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు, కోర్టుల్లో కేసులు వేశారు. 
జగన్‌ గారిపై కేసులో అప్పటి ప్రభుత్వానికి నోటీసులిస్తే ఆనాడు కిమ్మనలేదు. ఫలితంగా సీబీఐకి ఇచ్చారు. 
ఆ జడ్జి గారు రిటైర్‌ అవగానే ఏ పదవి పొందాడో ప్రపంచం అంతా చూసింది. 
ఇలాంటివి ఎన్ని తప్పుడు కేసులు కట్టారు? ఆఖరికి మరణించిన రాజశేఖరరెడ్డి గారిని కూడా ముద్దాయిగా పేర్కొన్న దుర్మార్గపు చర్యలు జరిగాయి. 
కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపి జగన్‌ గారిని ఏ విధంగా అణచివేయాలని చూశారో అందరూ చూశారు. 
జగన్‌ గారు సిమెంట్‌ ఫ్యాక్టరీ, సాక్షి టీవీ, ఇతర వ్యాపారాలు చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నారు. 
చంద్రబాబు, సోనియా గాంధీ కలిసి పెట్టిన ఒక్కొక్క కేసు వీగిపోతున్నది ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. 
ఒక రోజు ఆలస్యమవ్వొచ్చు...ఖచ్చితంగా జగన్‌ గారు మీరు పెట్టిన తప్పుడు కేసుల నుంచి వజ్రంలా బయటకు రావడం గ్యారెంటీ. 

 మీ జూబ్లీహిల్స్‌ కొంప, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం ఎవరు కట్టారు..?: 
కొత్తపలుకుల్లో పాపపు సొమ్ము ఎవరిది అంటూ రాతలు రాసుకొచ్చాడు. 
మార్గదర్శిలో సుమారు రూ.2500 కోట్లు జనం సొమ్ము కట్టాల్సి వస్తే..కోర్టులో కేసులు తప్పించుకోవడానికి మీ నల్ల ధనాన్ని తెల్లగా చేసి తిరిగి కట్టింది అందరికీ తెలిసిందే. 
మీరు కొట్టేసిన ప్రజల సొమ్మును టివి చానల్‌ 5లో గుమ్మరిస్తున్నది నిజం కాదా..? 
మీ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కొంప, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ కొంప ఎవరు కట్టారు..? 
మాధాపూర్‌లోని బిల్డింగ్‌ ఎవరు కట్టారో జనానికి తెలియదని భావిస్తున్నారా? 
హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లోని మీ పాత కొంప పడేసి మళ్లీ మైసూర్‌ ప్యాలెస్‌ కంటే పెద్ద కొంప కట్టారు కదా..అది ఎవరు కట్టారు? 
అమరావతిలో సచివాలయం, హైకోర్టు బిల్డింగు ఎవరు కట్టారు...మంగళగిరిలో మీ పార్టీ కొంప ఎవరు కట్టారు..? అసెంబ్లీ ఎవరు కట్టారు..? 
చంద్రబాబు, లోకేశ్‌ తలదాచుకుంటున్న కరకట్ట కొంప ఎవరిది..? 
మీదా, మీ అమ్మగారిదా..మీ భార్యగారిదా? హెరిటేజ్‌ కంపెనీదా? 
ప్రభుత్వానిదా..లింగమనేని రమేష్‌దా..? 
ప్రభుత్వానిదని చంద్రబాబు అమ్మవారి సాక్షిగా 2017లో కంమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో చెప్పాడు. 
లింగమనేని రమేష్‌ ప్రభుత్వానికి ఇచ్చాడు..దాన్ని ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ క్వార్టర్‌గా నేను వాడుకుంటన్నాను అన్నాడు. 
లింగమనేని రమేష్‌ రాష్ట్రం విడగొట్టిన దృష్ట్యా దేశభక్తి భావంతో నేను చంద్రబాబుకు ఇచ్చాను అంటాడు. 
చంద్రబాబు చెప్పినట్లు ఆ కరకొట్ట కొంప నిజంగా ప్రభుత్వానిది అయితే మీరు ఓడిపోగానే ప్రభుత్వానికి ఇచ్చేయాలి కదా? 
ఎవడబ్బ సొమ్మని తండ్రీ కొడుకులు ఇప్పటికీ దాంట్లోనే కులుకుతున్నారు..?
ఇంటికి అద్దె కడుతున్నట్లు మీ అమ్మగారు ఎందుకు చూపిస్తున్నారు..? 
ఇంటి పన్ను లింగమనేని రమేష్‌ పేరుపై ఎందుకు కడుతున్నారు..? 
ఆ కరకట్ట కొంప ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కాంలో చంద్రబాబు నొక్కేసిన కొంప కాదా? 
హెరిటేజ్, ఫ్యూచర్‌ గ్రూప్‌ కలయిక నల్లధనాన్ని తెల్లగా మార్చే బాగోతం అని అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిలో ఇంతవరకూ నిజం చెప్పలేదు. 

 కన్నతండ్రి జైళ్లో ఉంటే 21 రోజులుగా ఢిల్లీలో కులుకు తున్నది ఎవరు..?: 
జగన్మోహన్‌రెడ్డి గారు, విజయసాయి రెడ్డి వాయిదాలు అడుగుతున్నారు కానీ..ఈ పోటు గాడు వాయిదాలు అడగడట. 
కన్నతండ్రి జైళ్లో ఉంటే 21 రోజులుగా ఢిల్లీలో కులుతున్నది ఎవరు..? 
ఏం పని ఢిల్లీలో.? ఆయనేమన్నా లాయరా?
గవర్నమెంట్‌ ఆర్డర్‌నే సరిగ్గా పలకడం రాని నువ్వు ప్లీడర్లకు సలహా ఇస్తావా? 
మీ పాత అడ్వకేట్‌ జనరల్, హైకోర్టు మాజీ పీపీ ఇద్దరూ సంచులు మోసుకుంటూ ఢిల్లీలో తిరుగుతున్నారు కదా? 
వాళ్ల కన్నా ఎక్కువ నీకు తెలుసా? వాళ్లకన్నా ఎక్కువ పండితుడివా..? దేనికి నువ్వు ఢిల్లీలో ఉన్నావో సమాధానం చెప్పు. 
లోకేశ్‌ రాత్రి పూట పాదయాత్ర అంటూ నడుచుకుంటూ ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికి అంత పెద్ద నామినేటెడ్‌ పదవి ఇస్తానన్నాడు. 
అలా అయితే మీ నాన్న గారికి పెద్ద పదవి అక్కర్లేదా? ఆయను జైల్లో వేయగానే బయటకు తేవాలని ఎందుకు తిరుగుతున్నావు..? 
జగన్‌ రెడ్డికి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేశ్‌ తీసుకుంటాడు అన్నాడు. 
కొడాలి నానితో ఉచ్చ పోయించే బాధ్యత ఈ లోకేశ్‌ తీసుకుంటాడు అన్నాడు. 
అంత పోటుగాడివి అయితే.. ఏ14 ముద్దాయి అనగానే ముందస్తు బెయిల్‌ కోసం ఎందుకు దరఖాస్తు చేశావు? 
లోకేశ్‌ అనే అతను మైకాసురుడు. మైక్‌ కనిపిస్తే ప్రగల్భాలు పలుకుతాడు. 
సాక్షాత్తు ఉత్తరకుమారుడు. మీ కార్యకర్తలు కూడా నవ్వు కుంటున్నారు. 
నీవి ఉత్తర కుమార ప్రగల్భాలేనని, జగన్‌కి భయం పరిచయం చేయడం కాదు.. జగనే మనోడిని గజగజలాడిస్తున్నాడు అనుకుంటున్నారు. 
నన్ను అరెస్టు చేయవద్దంటూ ఇక్కడ అడుక్కోవడం ఎందుకు..? 
కార్యకర్తలను రెచ్చగొడుతున్నావు కదా..విమానంలో సరాసరి రాజమండ్రిలో దిగేసి పరుగెత్తుకుంటూ జైళ్లోకి వెళ్లొచ్చు కదా? 

 నీ మాటలు విని పేలిన వ్యక్తి ఇప్పుడు రోజాగారి కాళ్లు పట్టుకుంటున్నాడు: 
నీ మాటలు విని యర్రన్నాయుడు వియ్యంకుడు పచ్చి బూతులు తిట్టి ఇప్పుడు రోజాగారి కాళ్లు పట్టుకుంటున్నాడు. 
ఎమ్మెల్యే సీటు ఇచ్చేస్తారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు..పాపం ఆ సీటు జనసేనకు ఇచ్చేస్తారట. 
నాకు పెద్ద పదవి ఇచ్చేస్తారని భావించి ప్రగల్భాలు పలికాడు..లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ దరఖాస్తు చూడగానే ఆయనకు గుండె జారిపోయింది. 
ఇప్పుడు రోజాగారి కాళ్లకు నమస్కారం..అన్యాయంగా మాట్లాడాను అంటూ కాళ్లబేరానికి వచ్చాడు. 
లోకేశ్‌ డబ్బా కబుర్లు చూసి రెచ్చిపోయిన వారి పరిస్థితి ఇలా అయిపోయింది. 

 మీ అక్రమ సంపాదనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమా?: 
ఢిల్లీలో కూర్చుని సొల్లు కబుర్లు చెబుతున్న లోకేశ్‌కి చాలెంజ్‌ చేస్తున్నా. 
చంద్రబాబు అవినీతి పరుడు కాదు...సచ్ఛీలుడు అని మీరు, మీ తల్లి, భార్య, మామ నమ్మితే సిట్టింగ్‌ జడ్జితో మీ ఆస్తులపై విచారణకు సిద్ధమా? 
1995లో ఎన్టీఆర్‌ను కుట్రలతో, కుయుక్తులతో వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున నాటి నుండి నేటి వరకూ చంద్రబాబు ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో మీరు విచారణకు సిద్ధమా? 
1997లో రెడ్యానాయక్‌ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే తెచ్చుకున్నారు. 
1998లో వైఎస్సార్‌ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే. 
1999లో షబ్బీర్‌ అలీ, 1999లో డీఎల్‌ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. 
1999, 2000, 2001 వైఎస్సార్‌ గారు తిరిగి దావా వేస్తే స్టే. 
2003లో కృష్ణకుమార్‌ గౌడ్‌ కేసు వేస్తే స్టే. 
2003లో కన్నా లక్ష్మీనారాయణ పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్‌ పెట్టాడని దావా వేస్తే స్టే. 2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. 
2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు వేశాడు. ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ..దాంట్లోనూ స్టే. 
2005లో లోకేశ్‌ అమ్మమ్మ, చంద్రబాబు అత్తగారైన లక్ష్మీపార్వతి హైకోర్టులో అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే. 
2005 శ్రీహరి, అశోక్‌ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే. 
2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే. 
విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? వీటిపై విచారణ జరిగితే మీకు యావజ్జీవ శిక్ష తప్పదని తెలిసి స్టేలు తెచ్చుకున్నారు. 
చంద్రబాబు అన్నం తిని బతకడం లేదు..స్టేలు తిని బతుకుతున్నాడు. 
ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం పొంది జనం వద్ద కొట్టేసిన ప్రజాధనాన్ని వెనక్కి కట్టేస్తే దేవుడు చల్లగా మిమ్మల్ని చూస్తాడని హితవు. 
లేదా చాలెంజ్‌ స్వీకరిస్తూ.. సిట్టింగ్‌ జడ్జితో 1995 నుంచి ఇప్పటి వరకూ మీ ఆస్తులపై విచారణకు సిద్ధం కండి. 

 వైయ‌స్ జ‌గ‌న్  ఎందుకు వద్దు..?: 
వైయ‌స్ జగన్‌ గారు ఎందుకు వద్దు అంటున్నారు..మరి ఎవరు కావాలి పవన్‌ కల్యాణ్‌? 
పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అవుతాడా? జగన్‌ వద్దు అంటున్నారు సరే..ఎవరు ముఖ్యమంత్రి అవుతారు..? 
జగన్‌ను ఎవరి కోసం తోసేద్దామనుకుంటున్నారు..? చంద్రబాబు కోసమా..? 
2014లో ఇదే పవన్‌ కల్యాణ్‌ మీరు చంద్రబాబుకు ఓటేయండి అన్నాడు. 
చంద్రబాబు తప్పు చేస్తే నేను బెత్తం తీసుకుని కొడతానని అన్నాడు. 
అదే వ్యక్తి 2019లో చంద్రబాబు వెధవ, లుచ్చా..ప్రజల డబ్బు దొబ్బేశాడని ఊరూరా ప్రచారం చేశాడు. 
అటువంటి పాపాలు చేసిన చంద్రబాబును ఏ రకంగా మీరు ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నారు..?
ఎందుకోసం..ఎవరి కోసం ఈ కూలీతనం..? ఎవరి బాగుకోసం..? 
జగన్‌ గారు వద్దు...2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు ఏ పరిపాలన ఇచ్చాడో అదే పరిపాలన ఇస్తాం అని చెప్పాలి కదా. 
కల్లుకొచ్చి ముంత దాయడం ఎందుకు..? డొంకతిరుగుడు ఎందుకు? 
పాపం చంద్రబాబు కోసం పవన్‌ కల్యాణ్‌ అష్టకష్టాలు పడుతున్నాడు. 
ఒక పక్క ఓజీ షూటింగ్‌...మళ్లీ ఇక్కడకు వచ్చి చంద్రబాబు సేవ..మళ్లీ వెళ్లి హరీష్‌ శంకర్‌ సినిమా..పాపం తట్టుకోలేకపోతున్నాడు. 
20 సీట్లు తీసుకుని, ఇద్దరు ముగ్గురు మంత్రులు, రెండు రాజ్యసభలు తీసుకునేదానికి ఈ హడావుడి. 
దీని కోసమే జగన్‌ వద్దు..చంద్రబాబు ముద్దు అంటున్నాడు పవన్. 

మోడీ కంటే చంద్రబాబు ఎందుకు తీపి..?:
2019లో చంద్రబాబు రోత, జుగుప్ప అన్నావు కదా..ఇప్పుడు ఎందుకు ముద్దయ్యాడు...? 
ప్రజలు అమాయకులు కాదు..పాత రోజులు కావు..ఇవాళ అన్నీ ప్రజలు కనిపెట్టేస్తున్నారు. 
చిన్న చిన్న సూక్ష్మమైన విషయాలను కూడా ప్రజలు గమనిస్తున్నారు. 
నువ్వు 2014లో ఏం మాట్లాడావు..2019లో ఏం మాట్లాడావో ప్రజలు గమనించరా? 
2014లో మోడీకి ఓటేయండి అన్నావ్‌...ఆ తర్వాత పాచిపోయిన లడ్డూలు అన్నావు. 
ఈ రోజు మోడీ కన్నా చంద్రబాబు ఎందుకు తీపి..? 
లోకేశ్‌ గజదొంగ అన్నావు..నీ కొడుకు నీకు తెలిసే అవినీతి చేస్తున్నాడా అన్నావు..
ఇప్పుడు దొరికిన గజదొంగ కోసం నేలమీద పొర్లాడుతావ్‌..జైలు కెళ్లి కలిసి పోటీ చేస్తున్నాం అంటున్నావు. 
వావి వరసలు, బంధాలు ఏమీ లేవు..బీజేపీతో బంధంలో ఉంటూనే టీడీపీతో కలిసి పోటీ చేస్తాను అంటున్నాడు. 
పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తి చంద్రబాబుకు అధికారం అందించే లక్ష్యంతో పనిచేసే ఒక రాజకీయ నాయకుడు. 

 ఆ నియోజకవర్గాల్లోనే ఎందుకు..కాపుల ఓట్ల కోసమా?:
కృష్ణాజిల్లాలో అవనిగడ్డ, బందరు, పెడన, కైకలూరు వెళ్తాడట..ఈ నాలుగే ఎందుకు..? 
కుల రహిత సమాజం మా ఆశయం అంటూ ఆ నియోజకవర్గాలకే పవన్ ఎందుకు వెళుతున్నాడో ప్రజలకు తెలుసు. 
కాపులు ఎక్కడ ఎక్కువుంటే అక్కడికే వెళ్లి మీటింగులు పెడుతున్నాడు. 
ఏం కమ్మ వారు, బీసీలు అధికంగా ఉన్న చోటకు ఎందుకు వెళ్లడం లేదు..? 
కాపులు అమాయకులా..? ప్రజలు అమాయకులా..? మమ్మల్ని అందర్నీ తీసుకెళ్లి తాకట్టు పెడతాడని కాపులకి తెలిదనుకుంటున్నావా..? 
నేను చంద్రబాబు కోసమే పనిచేస్తున్నానని చెప్పే ధైర్యం కూడా ఆయన వద్ద లేదు. 
అవినీతి రహిత సమాజం అంటాడు...దొరికిన దొంగ కోసం రోడ్లపై పొర్లాడతాడు. 
మేమూ ఆ దొంగ కలిసి పోటీ చేస్తాం అని బయటకు వచ్చి చెప్తావు. 
వారాహి యాత్రలో జనం తగ్గుతారని అనుమానం వచ్చి ఉంటుంది..అందుకే రెండు పార్టీలు కలిసి వెళ్తున్నాయి అనుకుంటా. 
ఇప్పటి వరకూ టీడీపీ కలిసి రాలేదు కదా..ఇప్పుడే ఎందుకు వస్తున్నారు..? 
చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కంటే ప్రజలు చాలా తెలివైన వారు. వాళ్లకి అన్నీ తెలుసు. 

 చంద్రబాబేం మొదటి వాడు కాదు..ఎందరో విచారణ ఎదుర్కొన్నారు: 
ముఖ్యమంత్రిగా పని చేసిన తర్వాత నేరారోపణలతో జైళ్లోకి వెళ్లిన వాళ్లలో చంద్రబాబు మొదటి వాడేం కాదు.
ములాయంసింగ్‌ యాదవ్, లాలూ ప్రసాద్‌ యాదవ్, పీవీ నరసింహరావు, సోనియాగాంధీ, ఇందిరాగాంధీ, మధు కోడా లాంటి అనేక మంది అక్రమాస్తుల కేసులు, అవినీతి కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. 
వీరంతా చట్టప్రకారం ఆ కేసులు ఎదుర్కొంటున్నారు తప్పితే వీళ్ల లాగా మోత మోగించమనలేదు. 
పీవీ నరసింహరావుపై యూరియా కేసు వచ్చినప్పుడు ఎవరూ డప్పులు కొట్టమని చెప్పలేదు. 
కోర్టులో కేసుల్ని ఎదుర్కొని తద్వారా జయించాలని ప్రయత్నం చేశారు. 
ఈ టంకు టమార విద్యలు, డూప్లికేట్‌ ఉద్యమాలు చేయలేదు. 
విచిత్రమేంటంటే ఈ దొంగ నిరసనలు చేసే వారికి ఎవరికీ ఇక్కడ ఓటు, ఆస్తి ఉండదు. 
బతికేదంతా బెంగుళూరు, హైదరాబాద్, డల్లాస్, న్యూజెర్సీ, కెనడాలోనే బతుకుతూ పళ్ళాలు ఇక్కడ కొడతారు. 
అసలు ఏపీలో ప్రజల డబ్బు ఎత్తేశాడంటే వీళ్లంతా ఎందుకు పళ్ళాలు కొడుతున్నారు..? 
మనోడని కొడుతున్నారా..మనోడు ఏది చేసినా పర్లేదా? 
మనోడైతే ఎక్కడి పడితే అక్కడ బరితెగించి ఈ కొట్టుడేంటి? 

 ఇప్పుడేగా లవ్‌ లెటర్‌ ఇచ్చారు..తర్వాత జరగాల్సినవన్నీ జరుగుతాయి: 
పాపం పండినప్పుడు అన్నీ ఒక్కసారే పండుతాయి. మీకైనా, నాకైనా, చంద్రబాబుకైనా, లోకేశ్‌కైనా అన్నీ ఒక్కసారి పండుతాయి. 
దొరకలేదని సంతోషపడితే ఎలా..అన్నీ జరుగుతాయి. 
లోకేశ్‌కి సీఐడి వాళ్లు లవ్‌ లెటర్‌ ఇచ్చారా? 4వ తేదీన డేటింగ్‌కు రమ్మన్నారా? 
డేటింగ్‌ నచ్చితే..తర్వాత వెడ్‌ లాక్‌..ఆ తర్వాత హనీమూన్‌ ఉంటుంది. 
లవ్‌ లెటర్‌ తీసుకున్నోడికి మిగతావి అన్నీ ఉంటాయని తెలియదా? 

 ఎన్టీఆర్‌ జరిగినట్లు కేసీఆర్‌కూ అళ్లుడి పోటు తప్పదేమో..?: 
హరీష్‌రావు చంద్రబాబును అరెస్ట్‌ చేయడం చాలా తప్పు అన్నాడా? 
హరీష్‌ రావు కేసీఆర్‌కి అల్లుడు..చంద్రబాబు రామారావుకి అల్లుడు. 
ఈ అల్లులిద్దరూ కలిసి మామలను ఏం చేస్తారో తెలియదా? 
ఎన్టీఆర్‌కి ఏం జరిగిందో కేసీఆర్‌కు బహుశా అదే జరుగుతుందేమో..! 
ఈ అల్లుళ్ల గిల్లుళ్లు మనకు తెలియదా..? 
ఎన్టీఆర్‌ అమాయకుడు కాబట్టి అలా జరిగిందేమో.. కానీ కేసీఆర్‌ వద్ద హరీష్‌రావు గిల్లుళ్లు సాగవేమో? 

Back to Top