డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే తనపై తప్పుడు కథనాలు

ఎల్లోమీడియా ఫేక్ న్యూస్‌పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌

తిరుపతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అండతో ఎల్లో మీడియా తనపై తప్పుడు కథనాలు రాస్తోందని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  మరోసారి మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. పులిచెర్ల మండలంలో అటవీ భూములను తాము కబ్జా చేసినట్లు ఈనాడు ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకొని..
ఎల్లో మీడియాను అ‍డ్డం పెట్టుకుని వ్యక్తిత్వం హననానికి పాల్పడుతున్నారని, ఇందులో భాగంగానే తప్పుడు కథనాలు రాయిస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. 2001లోనే ఆ భూమిని కొనుగోలు చేశామని, అప్పట్నుంచి ఆ భూమిలో సాగు చేస్తున్నామన్నారు.  ఒక్క ఎకరం అయినా కబ్జా చేసినట్లు నిరూపించగలరా? అని సవాల్‌ చేశారు. పూర్తి చట్టబద్ధంగా తాము 2001లో కొనుగోలు చేసిన భూములపై పచ్చి అబద్ధాలతో కథనాన్ని ప్రచురించడం వెనుక సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఉన్నాయని ధ్వజమెత్తారు.  నిత్యం చంద్రబాబుకు బాకా ఊదుతూ పచ్చనేతల సేవలో తరించిపోయే ఈనాడు, ఈటీవీ ద్వారా మాపై పలుసార్లు పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలను ప్రచురించారు. వీటిపై ఇప్పటికే చిత్తూరు న్యాయస్థానంలో ఎల్లో మీడియాపై రూ.50 లక్షలకు పరువు నష్టం దావా వేశామ‌న్నారు. 

Back to Top