ప్రకాశం: పర్చూరు వైయస్ఆర్‌సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు కొల్లా గంగాభవాని (56) గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి గుండెపోటు రావడంతో ఇంటి వద్దనే తుదిశ్వాస విడిచినట్లు భర్త మాజీ జెడ్పీటీసీ కొల్లా సుభాష్‌బాబు తెలిపారు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె నాగులపాలెం సర్పంచ్‌గా పనిచేశారు. భర్త కొల్లా సుభాష్‌బాబు సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశారు. మామ కొల్లా రామయ్య పర్చూరు తొలి ఎమ్మెల్యేగా పనిచేశారు. కొల్లా సుభాష్‌బాబుకి స్వాతంత్య్ర సమరయోధులు మాజీ మంత్రి దివి కొండయ్య చౌదరి స్వయానా బావ కావడంతో వీరి కుటుంబానికి రాజకీయంగా ప్రాధాన్యత ఉంది. ఆమె మృతి పలువురు రాజకీయ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు నాయకులు విచారం వ్యక్తం చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మృతదేహాన్ని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్, నియోజకవర్గ నాయకులు రావి రామనాథంబాబు సందర్శించి నివాళులర్పించారు.