న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నీతి ఆయోగ్ వైస్‌ఛైర్మన్ రాజీవ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం వైయస్ జగన్.. గురువారం సాయంత్రం రాజీవ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. గంటకుపైగా కొనసాగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్, పేదలకు ఇళ్ల నిర్మాణాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర నిధులు, సహకారంపై సీఎం జగన్ చర్చించారు. అనంతరం సీఎం వైయస్ జగన్ పాలనలోని ఏపీ అభివృద్ధిని రాజీవ్‌కుమార్ కొనియాడుతూ ట్వీట్ చేశారు. ‘పలు రంగాల్లో ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోంది. 2020-21 సుస్థిర అభివృద్ధి రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. ఏపీ వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవశ్యకతను సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, లక్ష్యాలను సీఎం వైయస్ జగన్ వివరించారు’ అని ఆయన ట్వీట్ చేశారు.