అశోక్‌గజపతిరాజు  అధర్మకర్త..

 వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి

 ఎల్లోమీడియా బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం మానుకోవాలి

విశాఖ‌: సింహాచలం భూముల కుంభకోణాలకు కర్త, కర్మ, క్రియ అన్నీ టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు అని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దానికి ఆయన ధర్మకర్త కానేకాడు. అధర్మకర్త అని వ్యాఖ్యానించారు. ఈ విషయం ఆయనకు బాగా తెలుసు అన్నారు. ఈఓ న్యాయ సలహాలు తీసుకుని చర్యలకు దిగితే వెంటనే కోర్టుకు పరిగెత్తకుండా ఉంటానని, చంద్రబాబు మాదిరిగా స్టేలు తెచ్చుకోనని ఆయన హామీ ఇస్తారా? అంటూ నిల‌దీశారు. ఆంధ్రజ్యోతి పత్రిక గత నెల 30వ తేదీన ’భూ దందాలో పెద్దలు’ శీర్షిక పేరుతో వాస్తవాలను వక్రీకరించి కథనాన్ని రాసి వైయస్ఆర్‌సీపీ నేతలపై బురద జల్లే ప్రయత్నం చేసిందని విజ‌య‌సాయిరెడ్డి ఖండించారు. ఈ మేర‌కు గురువారం విజ‌య‌సాయిరెడ్డి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

వాస్తవాలు:
సర్వే నెం: 275 భూమికి సంబంధించిన వివాదం మొత్తం తెలుగుదేశం హయాంలోనే జరిగింది. దేవస్థాన ఆక్రమిత భూములను క్రమబద్ధీకరిస్తామని 1998లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి అది వివాదాస్పదంగా ఉంది. అలాగే ఆ భూమి మార్పిడి వ్యవహారాలు కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవాలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా  అశోక్‌గజపతిరాజు ఉన్న సమయంలో జరిగాయి. కాగా, ఇప్పుడు దీనిపై న్యాయ సలహాలు తీసుకోవాలని ఈఓకు లేఖ రాయడం విడ్డురంగా ఉంది.
    
    దాదాపు 30 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి అడివివరం రెవెన్యూ పరిధి సర్వే నెం: 275 భూమిలో లేఅవుట్‌ వేయడం జరిగింది. ఆ లేఅవుట్‌లో కొంత మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. దేవస్థానం ఆక్రమిత భూములను క్రమబద్ధీకరిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. క్రమబద్ధీకరణ కోసం ఆగస్టు 19, 2000 సంవత్సరంలో జీఓ నెం:578 జారీ చేయగా, 12 మంది కొనుగోలుదారులు ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ సర్టిఫికెట్స్‌ (ఎల్‌ఆర్‌సీ) కోసం ధరఖాస్తు చేసుకున్నారు.
    ఆ తర్వాత అప్పటి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్, శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధికారులు, రెవెన్యూ అధికారులు సర్వే నెం: 275 స్థలాన్ని పరిశీలించి, ఏప్రిల్‌ 30, 2002 న మ్యాపులతో సహా ఒక నివేదికను సమర్పించారు. ఆ నివేదికను రెవెన్యూ అధికారులు పరిశీలించి దరఖాస్తు చేసుకున్న 12 మందికి జీవో నెం:578 ప్రకారం ఎల్‌ఆర్‌సీలు జారీ  చేశారు.
    అనంతరం ఎల్‌ఆర్‌సీలు పొందిన 12 మంది, వారి నుంచి ప్లాట్ల కొనుగోలుదారులు సింహాచలం దేవస్థానం ఈఓకు ఒక లేఖ రాశారు. తాము కొన్న ప్లాట్లకు రహదారి లేదని, సీతమ్మధార 80 అడుగుల రోడ్డుకు అనుసంధానం లేదని ఆ లేఖలో వారు ప్రస్తావించారు. అలాగే పోర్టు ట్రస్ట్‌కు చెందిన భూమిలో రహదారి నిర్మాణం కోసం తమకు అభ్యంతరం లేదంటూ ఎన్‌ఓసీ ఇవ్వాలంటూ, ఆ లేఖలో వారు దేవస్థానం ఈఓను కోరారు. దీని కోసం వారు లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.12 లక్షలు దేవస్థానం ఖాతాలో డిపాజిట్‌ చేశారు.
    ఆ తర్వాత ఇక్కడ రోడ్డు వేసుకునేందుకు పోర్టు ట్రస్ట్‌ ఛైర్మన్‌కు లేఖ రాసేందుకు అనుమతి ఇవ్వాలని దేవస్థానం ఈవో మార్చి 19, 2012న రాష్ట్ర దేవాదాయ కమిషనర్‌కు లేఖ రాయడం జరిగింది. మరోవైపు గతంలో ఎల్‌ఆర్‌సీ పొందని మరో 13 మంది తమ ప్లాట్లను కూడా క్రమబద్థీకరించాలంటూ దేవస్థానం ఈఓకు వినతి పత్రం ఇచ్చారు. అయితే వారు దేవస్థానం ఖాతాలో ఏ మొత్తాన్ని డిపాజిట్‌ చేయలేదు.
    ఇదిలా ఉండగానే, ఎల్‌ఆర్‌సీలు పొందిన 12 మంది, ఎల్‌ఆర్‌సీల కోసం వినతి పత్రం ఇచ్చిన 13 మంది కలిసి, దేవాదాయ శాఖ అధికారులు ఇబ్బంది పెట్టకుండా 2009లో కోర్టులో ఇంటీరియమ్‌ ఇంజక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు అదే ఏడాది సెప్టెంబరు 3వ తేదీన, అంటే 3/9/2009న ఇంటీరియమ్‌ ఇంజక్షన్‌ పిటిషన్‌ను అనుమతించింది.
    ఇక తమ ప్లాట్లు వరుస క్రమంలో లేనందున, రోడ్ల నిర్మాణం కానందున, అందరికి ఒకే విధంగా ఉండేలా ల్యాండ్‌ ఎక్సే్చంజ్‌ (భూమి బదలాయింపు)కు అనుమతి ఇవ్వాలని ఎల్‌ఆర్‌సీలు పొందిన 12 మంది మే 20, 2016న దేవస్థానం ఈఓను అభ్యర్థించారు. దానికి సంబంధించిన మ్యాపులను కూడా అందించారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) నుంచి అనుమతులు వచ్చేలా చూడాలని వారు ఆ లేఖలో ఈఓను కోరారు. తమ  అభ్యర్థన ఆమోదిస్తే, 2009లో కోర్టు తమకు ఇచ్చిన ఇంటీరియమ్‌ ఇంజక్షన్‌ ఆర్డర్‌ను రద్దు చేసుకుంటామని కూడా వారు ఆ లేఖలో ఈఓకు తెలియజేశారు.
    ఆ తర్వాత దేవస్థానం భూములను పర్యవేక్షించే అధికారులు ఆ  భూములు తనిఖీ చేసి నివేదిక ఇస్తూ, అందులో ప్లాట్ల కొనుగోలుదారుల అభ్యర్థనకు సానుకూలంగా సిఫార్సు చేశారు.
    అనంతరం సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌ ముందుకు ఆ నివేదికను అధికారులు తీసుకొచ్చారు. మే 26, 2016న సింహాచలం దేవస్ధాన  వంశ పారంపర్య ధర్మకర్త, ట్రస్టు బోర్డు చైర్మన్‌ ఆశోక్‌గజపతిరాజు కూడా భూ బదలాయింపునకు ఆమోదం తెలిపారు. దేవస్థాన భూమి పరిరక్షణకు ఇది అనుకూలంగా ఉంటుందంటూ ఆయన భూబదలాయింపును అంగీకరించారు.
    ఆ తర్వాత మార్పులతో కూడిన నివేదికను ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, దేవాదాయ కమిషనర్ల ఆమోదం కోసం దేవస్థానం అధికారులు పంపించగా, ఫిబ్రవరీ 22, 2017న ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రత్యేక మెమో ద్వారా భూబదలాయింపునకు అభ్యర్థించిన భూమి 2,928.77 చ.గజాలు, దానికి బదులుగా 2,919.20 చ.గజాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
    వీటన్నింటి నేపథ్యంలో ఒక బిల్డర్, ప్లాట్ల యజమానుల నుంచి ఆ ప్లాట్లను అభివృద్ధి చేయడం కోసం అగ్రిమెంట్‌ చేసుకోవడం, జోన్‌ పరిధి మార్పు చేసి నిర్మాణాల కొరకు జీవీఎంసీకి ఆన్‌లైన్‌లో విజ్ఞప్తి చేయడం, జీవీఎంసీ అధికారులు సకాలంలో స్పందించనందువల్ల.. అనుమతి పొందినట్లు భావించడం, తదితర విషయాలు పత్రికల్లో రావడంపై సకాలంలో  విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
    సర్వే నెం: 275 దేవస్ధాన ఆక్రమిత భూములు 22(అ) కింద ఉన్నాయని తెలిసి కూడ అప్పటి ప్రభుత్వం ఏ విధంగా ఎల్‌ఆర్‌సీ ఇచ్చిందన్నది అశ్చర్యానికి గురి చేస్తుంది.
    వాస్తవాలు ఇలా ఉంటే.. అంతా అతని హయాంలోనే జరిగితే, సింహాచలం దేవస్థానం ఫౌండర్‌ ట్రస్టీగా ఉన్న ఆశోక్‌గజపతిరాజు ఇప్పుడు ఆ వ్యవహారంపై న్యాయ సలహా తీసుకోవాలంటూ.. ఆలయ ఈఓకు లేఖ రాయడం వాస్తవాలను వక్రీకరించడం కాదా?.

తాజా వీడియోలు

Back to Top