విశాఖ: ఈ నెల విశాఖలో ప్రధాని నరేంద్రమోదీ, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిల పర్యటలను విజయవంతం చేద్దామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు పిలుపునిచ్చారు. ప్రధాని సభకు సంబంధించిన ఏర్పాట్లపై విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో విజయసాయిరెడ్డి, వై .వి .సుబ్బారెడ్డి, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, దాటిశెట్టి రాజా తదితరులు పొల్గొన్నారు. .ఈ సందర్భంగా సమన్వయ కమిటీ సభ్యులు, జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు.. సభ విజయవంతం అవడానికి పలు సూచనలు, ప్రణాళికలు అందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రధాని 11న విశాఖ చేరుకుని రాత్రి ఇక్కడే బస చేస్తారని, 12న ఉదయం బహిరంగ సభలో మాట్లాడతారని తెలిపారు. ఈ సందర్భంగా రూ.12 వేల కోట్ల విలువైన కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం అంతా సంతోషించా ల్సిన విషయమన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తనతోపాటు పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాస్, మరికొందరితో కమిటీని నియమించారని తెలిపారు. రూ.10,472 కోట్ల పనులకు శ్రీకారం ఈ నెల 12న రూ.10,472 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, రాయపూర్–విశాఖపట్నం 6 లేన్ల రహదారి, కాన్వెంట్ జంక్షన్–షీలానగర్ పోర్టు రోడ్డు అభివృద్ధి, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, గెయిల్‌కు సంబంధించి శ్రీకాకుళం–అంగుళ్ పైప్‌లైన్ ఏర్పాటు, నరసన్నపేట–ఇచ్ఛాపురం రోడ్డు అభివృద్ధి, ఓఎన్‌జీసీ ఆఫ్‌షోర్ కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు.