పార్టీ వేరు, ప్రభుత్వం వేరు

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

రెండు ప్రభుత్వాల మధ్య ఎప్పటికీ సత్సంబంధాలు ఉంటాయి

 అవినీతి ఎక్కడ జరిగిందో అమిత్‌షా, నడ్డా చెప్పలేకపోయారు

బాబు ట్రాప్‌లో పడాల్సిన అవసరం బీజేపీకి ఉంటుందా?

విశాఖకు కచ్చితంగా పరిపాలన రాజధానిని తరలిస్తాం

తాడేపల్లి: పార్టీ వేరు, ప్రభుత్వం వేరని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అమిత్‌షా, నడ్డా వ్యాఖ్యలను విజయసాయిరెడ్డి ఖండించారు. కేంద్రానికి రాష్ట్రం, రాష్ట్రానికి కేంద్రం సహకారం ఉంటుందని, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అన్నారు.  రెండు ప్రభుత్వాల మధ్య ఎప్పటికీ సత్సంబంధాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి ఎక్కడ జరిగిందో కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా చెప్పలేకపోయారన్నారు. కేంద్రం ఇచ్చే నిధులకు ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నారు కదా? వాళ్ల ఆడిటింగ్‌లో ఎక్కడైనా అవినీతి జరిగిందని గుర్తించారా అని ప్రశ్నించారు. అవినీతి అని సాధారణంగా ఆరోపణలు చేశారని తెలిపారు.  రాష్ట్రానికి బీజేపీ ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ రద్దుపై ప్రకటన చేయలేదన్నారు.  విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని గుర్తు చేశారు.

ఏ పార్టీతోనూ వైయస్‌ఆర్‌సీపీ పొత్తు పెట్టుకోదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ నేత చంద్రబాబు ట్రాప్‌లో అమిత్‌షా పడతారా? అని ప్రశ్నించారు. బాబు ట్రాప్‌లో పడాల్సిన అవసరం బీజేపీకి ఉంటుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటాయని చెప్పారు. 

విశాఖకు కచ్చితంగా పరిపాలన రాజధానిని తరలిస్తామని మరోసారి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రెండేళ్ల కిందటే పరిపాలన రాజధానికి కావాల్సిన ఆఫీసులు గుర్తించామని చెప్పారు. చంద్రబాబు ప్యాకేజీతో సంబంధం లేకుండా రూ.10,400 కోట్ల రెవెన్యూ లోటు సాధించామని వివరించారు. కేబినెట్‌ ఆమోదం తర్వాత పోలవరానికి నిధులు వస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల్లోపు ప్రతి కార్యకర్తను సంతృప్తి పరుస్తామని  విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు మినీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని, నవంబర్‌లో ఇతర రాష్ట్రాల హామీలను కాపీ కొట్టి చంద్రబాబు పార్ట్‌–2 మేనిఫెస్టో ఇస్తారేమో అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

 

Back to Top