రోడ్ల సెక్టార్‌లో అతిపెద్ద ఈఏపీకి ప్రభుత్వం శ్రీకారం

రెండు మెగా ప్రాజెక్టులకు ఆర్‌అండ్‌బీ, న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ మధ్య ఎంఓయూ

ఒక్కో ప్రాజెక్టు వ్యయం రూ.3200 కోట్లు

3.104 కి.మీ రహదారుల విస్తరణ, 479 బ్రిడ్జిల పునర్నిర్మాణం

మొదటి విడత రూ.2,978 కోట్లతో 1,243 కి.మీ రహదారుల‌ విస్తరణ

రహదారుల నిర్మాణం నాణ్యతగా ఉండాలి

ఉన్నతాధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో రహదారులకు మహర్దశ పట్టనుంది. రోడ్‌ సెక్టార్‌లో అతిపెద్ద ఈఏపీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకుల మధ్య రుణం ఒప్పందం కుదిరింది. రెండు మెగా ప్రాజెక్టుకు ఆర్‌ అండ్‌ బీ, న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ప్రతినిధులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. రూ.6400 కోట్లుతో (ఒక్కో ప్రాజెక్టు వ్యయం రూ.3,200 కోట్లు) ఏపీ మండల్‌ కనెక్టివిటీ, రూరల్‌ కనెక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు (ఏపీఎంసీఆర్‌సీఐపీ), ఏపీ రోడ్స్‌ అండ్‌ బ్రిడ్జెస్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్ట్‌లను చేపట్టనున్నారు.

ఇందులో న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వాటా 70 శాతం కాగా, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వాటాదారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు డబుల్‌ లేన్‌ కనెక్టివిటీతో పాటు, మండల కేంద్రాల నుంచి పక్కనే ఉన్న మరో మండల కేంద్రాలకు కూడా కనెక్టివిటీ ఉండేలా రోడ్లను నిర్మించనున్నారు.  ఈ మేరకు 3,104 కిలోమీటర్ల రహదారుల విస్తరణ, నిర్మాణం, 479 బ్రిడ్జిల పునర్నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి విడత పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. మొదటి విడతలో భాగంగా రూ.2,978కోట్లతో 1,243 కిలోమీటర్ల రహదారి విస్తరణ చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులోనూ రివర్స్‌టెండరింగ్‌ ద్వారా రూ.85.43 కోట్లను ప్రభుత్వం ఆదా చేసింది. మొదటి విడత పనులు ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టనున్నారు. రెండో విడత పనులకు అధికారులు డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నారు. 

ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శంక‌ర్ నారాయ‌ణ‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్‌ దాస్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. రోడ్లు, భవనాల శాఖ ఎక్సటర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్‌ (ఈఏపి) వివరాలను సీఎంకు తెలియ‌జేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రహదారుల నిర్మాణం నాణ్యతగా ఉండాలని, పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. టెండర్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించినందుకు అధికారులను సీఎం అభినందించారు. 

Back to Top