తాడేపల్లి: విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వ్యతిరేకిస్తూ చంద్రబాబు నోటి దూలతో చేసిన ప్రకటనతో ఆగ్రహంతో ఉత్తరాంధ్ర ప్రజలు బాబు పర్యటనను అడ్డుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకున్న చంద్రబాబు రాయలసీమకు వెళ్లినా.. చివరకు కుప్పం నియోజకవర్గం వెళ్లినా విశాఖ సీన్ రిపీట్ అవుతుందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. 40 ఏళ్ల చంద్రబాబు అనుభవం మూడు గ్రామాలకు పరిమితమైందన్నారు. చంద్రబాబు తన రాజకీయ సమాధిని తానే కట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. అమరావతి బహుజన ప్రాంతంగా ఉండాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సీఎం వైయస్ జగన్ 1251 ఎకరాలు కేటాయిస్తే దాన్ని కూడా చంద్రబాబు వ్యతిరేకిస్తున్నాడని, నిరుపేదలకు స్థలాలు ఇస్తే ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ చరిత్రకారుడిగా నిలిచిపోతాడన్నారు.
తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌బాబు మాట్లాడుతూ.. ‘హక్కులను కాలరాయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కలిసి రౌడీలను పెట్టించి దాడి చేయించారు. దళిత ఎంపీ నందిగం సురేష్‌పై అమరావతి పరిరక్షణ సమితి అనే పేరుతో తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు చేతుల్లో కారం పట్టుకొని ఎంపీని అవమానించిన తీరు ప్రజలు మర్చిపోరు. ఎమ్మెల్యేలు విడుదల రజిని, రోజాపై దాడి జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు పదే పదే రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాశారు.
రాజధాని ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సుమారు 54 వేల మందికి ఇళ్ల స్థలాల కోసం 1251 ఎకరాలు కేటాయిసతే.. ఆహ్వానించాల్సింది పోయి.. జనాభాలో సమతూల్యత లోపించిందని ప్రచారం చేస్తున్నాడు. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండకూడదా.. ఇదేనా నీ రాజనీతి, నీ అనుభవం. రాజధాని ప్రాంత భూములను అన్నీ బినామీ కంపెనీలకు కట్టబెట్టాడు. లోకేష్‌కు ముడుపులు చెల్లించిన ఎల్ అండ్ టీ కంపెనీకి ఎకరం రూ.1.5 లక్షలకు ఇచ్చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రూ. 4 కోట్లకు ఎకరా కేటాయించారు. రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములు సింగపూర్ కంపెనీకి తాకట్టుపెట్టి అభివృద్ధి పేరుతో చంద్రబాబు, లోకేష్ చేసిన డ్రామాలు ఇంకా ఆ రైతులకు అర్థం అయ్యిందో లేదో..?
40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు మూడు గ్రామాలకు పరిమితమై తన సమాధిని తానే కట్టుకున్నాడు. సీఎం వైయస్ జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు తీసుకువచ్చారు. అంటరాని తనాన్ని, కులతత్వాన్ని రెచ్చగొట్టి పెంచిపోషించింది చంద్రబాబే. దళిత సమాజం మీద అనేకసార్లు కించపరిచాడు.
విశాఖపట్నం టూరును అడ్డుకుంది.. ప్రతి పార్టీ వారు చంద్రబాబును వ్యతిరేకించారు. గంటా శ్రీనివాసరావు బహిరంగంగానే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకు వస్తే ఆహ్వానించారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే గంటాను ఎందుకు సస్పెండ్ చేయలేదు. పరిపాలన రాజధాని వస్తే అభివృద్ధి చెందుతామని ఆశపడిన ఉత్తరాంధ్ర ప్రజలపై నీళ్లు చల్లుతున్న చంద్రబాబును ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో అడ్డుకున్నారు. ఇదే పరిస్థితి కుప్పంలో కూడా త్వరలో జరుగుతుంది.
చంద్రబాబుది దొంగల ముఠా పరిపాలన, రియలెస్టేట్ పరిపాలన. ప్రజలకు మేలు చేసే విషయంలో చంద్రబాబు, వైయస్ జగన్‌కు ఉన్న తేడా నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా.. కానీ ఈ ప్రభుత్వం న్యాయపరమైన ప్రభుత్వం. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుంది. 21 మంది ఎమ్మెల్యేలతో మిగిలిపోయిన తోక పార్టీని, ప్రజల చేత తిరస్కరించబడిన చంద్రబాబుపై ధర్నాలు చేయాల్సిన అవసరం వైయస్‌ఆర్ సీపీకి పట్టలేదు. చంద్రబాబు తనని తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు.