సీఎం జగనన్నకు రుణపడి ఉంటాం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
 

వైయస్‌ఆర్‌ జిల్లా: స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన చేసి దేశ చిత్రపటంలో జమ్మలమడుగుకు స్థానం కల్పించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ ప్రాంత ప్రజలంతా రుణపడి ఉంటారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కలకు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారన్నారు. సున్నపురాళ్లపల్లెలో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్టీల్‌ ప్లాంట్‌కు జమ్మలమడుగులో 3200 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగిందన్నారు. జిల్లాల్లో ఫ్యాక్షన్‌ భూతాన్ని తరిమేయాలి.. మన తాలూకా మార్పు రావాలి.. ప్రాంత పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని గతంలో దివంగత మహానేత బ్రహ్మిణి స్టీల్‌ ప్లాంట్‌ తీసుకువచ్చారన్నారు. ఆ తరువాత వైయస్‌ఆర్‌ మరణాంతరం ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని, రాష్ట్ర విభజన తరువాత ఏపీకి స్టీల్‌ ప్లాంట్‌ ఇస్తామని కేంద్రం ప్రకటించిందన్నారు. కానీ, 2014లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాలుగున్నరేళ్లు ఉత్తుత్తి దీక్షలు, ధర్నాలు చేశాడని, ఆరు నెలల ముందు శంకుస్థాపన అంటూ డ్రామాలు చేశాడన్నారు.

2019 ఎన్నికల సభలో జమ్మలమడుగులోనే కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మిస్తామని వైయస్‌ జగన్‌ ప్రకటించారని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారన్నారు. మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉండడం వైయస్‌ కుటుంబ లక్షణమన్నారు. అన్ని వసతులు సమకూర్చిన తరువాతే సీఎం వైయస్‌ జగన్‌ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ పూర్తయితే 20 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. 

Back to Top