తాడేపల్లి: రాజధాని రైతుల పేరుతో టీడీపీ గుండాలు దాడులకు తెగబడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. తన కారును అడ్డుకొని రాజధాని పరిధిలో లేని టీడీపీ గుండాలు దాడికి యత్నించారని, ఈ దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేలపై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. ఐటీ దాడుల నుంచి తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రూ.200 కోట్లతో హైదరాబాద్‌లో ఎలా కట్టారో చెప్పాలని ఆమె డిమాండు చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఓ యాత్ర ప్రారంభించారు. ఇది ప్రజా చైతన్య యాత్ర కాదు..ప్రజలు ఛీకొట్టిన పిచ్చోడి యాత్ర. ఇదే ప్రజలందరూ అనుకుంటున్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన మోసాలకు ఆయన్ను 2019 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారు. ప్రజలకు అండగా ఉంటూ..తన తండ్రి వైయస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు. జీవితాంతం వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని ప్రజలు నమ్మారు కాబట్టే..151 సీట్లతో అద్భుతమైన విజయాన్ని అందించారు. ఇది జీర్ణించుకోలేక చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. ఈ రోజు ఎస్ఆర్ఎం, సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన ఇండస్ట్రీస్ అకడమీక్ సమ్మిట్‌కు నమ్ము ముఖ్య అతిథిగా పిలిచారు. పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు ఒక వేదికపై వచ్చి రెండు రోజుల పాటు సమీక్షించి, రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం తీసుకురావాలని, పరిశ్రమలతోనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది కాబట్టి కొత్త పరిశ్రమలు ఎలా తీసుకురావాలన్న దానిపై చర్చిస్తుంటే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నిన్నటి నుంచే టీడీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో నాపై దాడి మొదలుపెట్టారు. రాజధాని పరిధిలోని పెద్ద పరివి గ్రామం వద్ద నన్ను ఆపి, కదలకుండా కారును అడ్డుకున్నారు. రాజధాని రైతులకు న్యాయం చేయాలని భూతులు తిట్టిస్తున్నారు. రాజధాని రైతులు తిట్టాలనుకుంటే అది చంద్రబాబు, ఆయన కేబినెట్లోని అప్పటి మంత్రులనే తప్ప..మమ్మల్ని కాదు. మాయమాటలు చెప్పి మీ భూములు దోచుకొని, 2018 కల్లా రాజధాని కట్టేస్తానని మాట ఇచ్చి తప్పిన చంద్రబాబు..ఈ ప్రాంతంలో కనీసం ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. కనీసం తాగడానికి నీళ్లు లేక అసెంబ్లీ, సెక్రటేరియట్లో అవస్థలు పడుతున్నారు. మొన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ గుండాలు దాడి చేశారు. నిన్న దళిత ఎంపీ నందిగం సురేష్, నిన్న ఎమ్మార్వోపై దాడి చేశారు. ఈ రోజు నాపై దాడి చేశారు. ఏమి సందేశం ఇవ్వాలని ఇలా చేస్తున్నారు. ఇలా దాడులు చేస్తే కొత్తగా ఏ పరిశ్రమలు వస్తాయి. కొత్తగా ఎలాంటి విద్యా సంస్థలు వస్తాయి?. చంద్రబాబు మాటలు విని మీ చేతితో కన్ను పొడుచుకోవడం నిజం కాదా?. ఇక్కడ శాసన సభ కూడా ఉండకూడదని అనుకుంటున్నారా? తప్పు చేసిన చంద్రబాబు, పత్తిపాటి పుల్లారావు, నారాయణలను నిలదీయకుండా మాపై దాడులు చేస్తున్నారంటే..ఇది కచ్చితంగా టీడీపీ గుండాల పనే. రైతుల ముసుగులో దాడులు చేస్తున్నారు. ధర్నాలు చేసే సమయంలో మహిళా రిపోర్టర్‌పై దాడి చేశారు. ఇవాళ సంబంధం లేకుండా మహిళా ఎమ్మెల్యేపై దాడి చేస్తున్నారు. సీఎం వైయస్ జగన్ ఈ రోజు రైతు కూలీలకు ప్రతి నెల రూ.2500 ఇచ్చే పరిహారాన్ని రూ.5 వేలకు పెంచారు. రైతులకు ఇచ్చే కౌలును పదేళ్ల నుంచి 15 సంవత్సరాలకు పెంచారు. దళిత రైతులకు డెవలప్మెంట్ ప్లాట్లు ఇస్తామని మాట ఇచ్చారు. సీఆర్డీఏ తీసుకువచ్చి పచ్చని భూములు ఉన్న పొలాలను నాశనం చేస్తూ..మీ జీవితాలను నాశనం చేశారు. సీఆర్డీఏ అర్థం మార్చి చంద్రబాబు రియల్ ఎస్టేట్ దోపిడీగా మార్చారు. 4 వేల ఎకరాలకు పైగా దోచుకున్నది వాస్తవం కాదా?. ఈ భూములు చంద్రబాబు, లోకేష్, పత్తిపాటి పుల్లారావు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, పరిటాల కుటుంబం, జీవీ ఆంజనేయులు, కోడెల కుటుంబ సభ్యులవి కాదా?. చంద్రబాబు ఆరోజు ప్రజా రాజధాని, సామాజిక రాజధాని కడతానని, తన సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని కట్టి, అందులో తాత్కాలిక భవనాలు నిర్మించి, ఈ రోజు సామాజిక చానల్స్‌తో ఆ సామాజిక వర్గాలను రెచ్చగొడుతున్నారు. చంద్రబాబును నమ్ముకున్న ఎన్టీ రామారావు గతి ఏమైందో మీకు తెలుసు అని ఎమ్మెల్యే రోజా రాజధాని రైతులకు సూచించారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబును మూడుసార్లు ముఖ్యమంత్రిని చేసిన కుప్పం ప్రజలు, చిత్తూరు వాసులు ఎంత నష్టపోయారో మీరు చూశారు. మా జిల్లాకు చంద్రబాబు నీరు ఇవ్వలేదు. కానీ మేం బాధపడలేదు. మీకు నీళ్లు ఉన్నాయని ఎప్పుడు అసూయపడలేదు. కానీ మీరెందుకు అసూయ పడుతున్నారు?. చంద్రబాబు రూ.2.50 లక్షల కోట్ల అప్పులభారం వేశారు. మళ్లీ లక్షన్నర కోట్లు పెట్టి 4 గ్రామాల కోసం అభివృద్ధి చేయాలని కోరడం న్యాయమా?. వైయస్ జగన్ ఓ తండ్రి లాగా 13 జిల్లాలు బాగుండాలని మూడు రాజధానులు తీసుకువస్తున్నారు. ఇందులో ఎవరిపై కక్ష లేదు. కుట్ర లేదు. ప్రజా చైతన్య యాత్రలు, రాజధాని రైతుల పేరుతో జరుగుతున్న దాడులన్నీ కూడా చంద్రబాబు, ఆయన కుమారుడు చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకే. మొన్నటికి మొన్న చంద్రబాబు పీఏ శ్రీనివాసరావుపై నిర్వహించిన ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్లకు పైగా దోచుకున్నట్లు స్పష్టమైంది. ఈడీ, సీఐడీ విచారణలో దొంగలు పట్టుబడి జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. చంద్రబాబును హెచ్చరిస్తున్నాం. ఇలాగే దాడులు చేస్తూ పోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చంద్రబాబు చేసిన అన్యాయానికి ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఆయన చైతన్య యాత్ర ఇంచు కూడా కదలకుండా నిలదీసే పరిస్థితి వస్తుంది. ఆ నాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడి ఆయన పదవే లాక్కుని తాను ధర్మపోరాటం చేశానంటే నమ్మడానికి అప్పటి లాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. అందరికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో ఇన్‌స్టంట్‌గా తెలుస్తుంది. చంద్రబాబు..నీవు, నీ చానల్స్ ఆడే డ్రామాలు కట్టిపెట్టు. లేదంటే తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరిస్తున్నా. చంద్రబాబు హైదరాబాద్‌లో కట్టుకున్న ఇంటికి ఒక్కరిని కూడా రానివ్వలేదు. ఈ రోజు ఆయన ఇంటికి వెళ్లి వీడియో తీస్తే దాని విలువ ఎంతో తెలుస్తుంది. వాచీ లేదు..ఉంగరం లేదని చెప్పుకునే చంద్రబాబు రూ.200 కోట్లతో హైదరాబాద్‌లో ఇళ్లు ఎలా కట్టారు. ఇంతవరకు చంద్రబాబు కుటుంబం ప్రకటించిన ఆస్తుల్లో ఆ ఇల్లు లేదు. ఎవరికీ తెలియకుండా ఆ ఇంటికి ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు.ఎప్పుడో ఆయన పుట్టినప్పుడు ఉన్న రేట్లతో ప్రకటనలు చేస్తున్నారు. కానీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తులు మాత్రం భవిష్యత్తులో మరో 30 ఏళ్లకు వచ్చే రేట్లు చెబుతారు. కాబట్టి అఫిడవిట్ తీసి చూస్తే తెలిసిపోతుంది. దానికి ఏటా ఆస్తులు ప్రకటించాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం ఎమ్మెల్యేల ఆస్తులను అసెంబ్లీలో లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఎంపీలు పార్లమెంట్‌కు చెబుతారు. అవన్నీ కూడా ఒరిజినల్. అందులో ఒక్క తప్పు ఉన్నా కూడా ఎమ్మెల్యే పదవి రద్దు అవుతుంది. ఇంకా పాత రోజుల మాదిరిగా మనుషులను మభ్యపెట్టాలనుకుంటే అది కుదరదు చంద్రబాబు. రాజధాని రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించి, ఎల్లోమీడియాలో గ్రాఫిక్స్ చూపించి మోసం చేసింది తెలుసుకున్నారు కాబట్టే నీ సొంత కుమారుడు లోకేష్‌ను మంగళగిరిలో చిత్తుగా ఓడించారు. తాడికొండలో మా పార్టీ ఎమ్మెల్యే గెలిచింది. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో వేల ఎకరాలు దోచేసి, వేల కోట్లు ఇతర ప్రాంతాలకు తరలించింది రాజధాని రైతులకు తెలిసిపోయింది. అందుకే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పారు. చంద్రబాబు నాలుగు గ్రామాల గురించి ఆలోచిస్తున్నారు. వైయస్ జగన్ 13 జిల్లాలు, 4 కోట్ల ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అందరి అభివృద్ధి గురించి ఆకాంక్షించాలి కానీ. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అందరి జీవితాలను నాశనం చేయాలనుకుంటే ఎవరూ ఒప్పుకోరు.హైదరాబాద్ నుంచి ఎలాగైతే కట్టుబట్టలతో వచ్చామో..అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదనే సీఎం వైయస్ జగన్ మూడు రాజధానులు తీసుకువచ్చారు. ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. దీన్ని ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు. ఇందుకు నిదర్శనం నిన్న కర్నూలుకు వైయస్ జగన్ వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైజాగ్ వెళ్తే ఎలా బ్రహ్మరథం పడుతారో మనం చూడబోతున్నాం. చంద్రబాబు ఇప్పటికైనా తన కుళ్లు రాజకీయాలు, కుట్ర మార్క్ పనికిమాలిన రాజకీయాలు చేస్తే మాత్రం ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆర్కే రోజా హెచ్చరించారు.