అమరావతి: ఎమ్మెల్యేగా గెలవలేని నారా లోకేష్‌కు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. విశాఖలో చంద్రబాబును అడ్డుకున్నది ఉత్తరాంధ్ర ప్రజలేనని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబుకు స్వాగతం పలుకుతారా అని ప్రశ్నించారు. విశాఖలో రౌడీలు అడ్డుకున్నారని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే ఆర్కే రోజా సవాలు విసిరారు. సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదన్నారు. గతంలో తాను మహిళా సదస్సుకు వెళ్తే ఎయిర్ పోర్టులోనే అడ్డుకుని రోజంతా తిప్పి తిప్పి హైదరాబాద్ పంపించారని, ఆ రోజు కనిపించని రాజ్యాంగం టీడీపీ నేతలకు ఈ రోజు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక ప్రాంతానికి అన్యాయం చేస్తూ..వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే చంద్రబాబుకు ఏవిధంగా స్వాగతం పలుకుతారని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన పెద్ద మనిషికి ఆ మాత్రం కామన్‌సెన్స్ కూడా లేదా అని ప్రశ్నించారు.