ఆర్టీసీ చరిత్రలో ఇదే మొదటిసారి

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

ఆర్టీసీ కార్మికులను చంద్రబాబు పట్టించుకోలేదు

సీఎం వైయస్‌ జగన్‌కు ఆర్టీసీ కార్మికుల కష్టాలు పూర్తిగా తెలుసు

బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1572 కోట్లు కేటాయింపు

మూడు నెలల్లో ఆర్టీసీ విలీనానికి చర్యలు

విజయవాడ: ఆర్టీసీ చరిత్రలో గతంలో ఎన్నడు లేని విధంగా వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మొదటి బడ్జెట్‌లో రూ.1572 కోట్ల నిధులు కేటాయించిందని, ఇన్ని నిధులు కేటాయించడం ఇదే మొదటిసారి అని వైయస్‌ఆర్‌ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్షులు, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీకి నిధులు కేటాయించడం పట్ల ఆయన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి కేబినెట్‌ మీటింగ్‌లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొనడం హర్షించదగ్గ విషయమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.  యూనియన్లు ఎప్పటి నుంచే డిమాండు చేస్తున్నారని, ఆర్టీసీపైన వైయస్‌ జగన్‌కు ఒక అవగాహన ఉందన్నారు. 2015లో తిరుపతి నిర్వహించిన వైయస్‌ఆర్‌ ఆర్టీసీ యూనియన్‌ రెండో మహాసభలోనే ఆర్టీసీని విలీనం చేస్తామని వైయస్‌ జగన్‌ చెప్పినట్లు తెలిపారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే విషయాన్ని డిమాండు చేసినా చంద్రబాబు అప్పట్లో పట్టించుకోలేదన్నారు. దాదాపు రూ.700 కోట్ల అరియర్స్‌ ఉన్నాయని, టీడీపీ ఈ నిధులు ఇవ్వలేకపోయిందన్నారు. బడ్జెట్‌లో ఏపీఎస్‌ఆర్‌టీసీకి రూ.1572 కోట్లు కేటాయించడం చరిత్రలో  ఇదే ప్రథమం అన్నారు. పాదయాత్రలో నేను విన్నాను..నేను ఉన్నానని చెప్పిన మాటను నిజం చేసే విధంగా ఆర్టీసీని విలీనం చేస్తామని మొదటి కేబినెట్‌లోనే ప్రకటించడం సంతోషకరమన్నారు. మూడు నెలల కాలవ్యవధిలోనే అధ్యాయన కమిటీ నివేదిక అందజేస్తుందని, ఆ నివేదిక ఆధారంగా ఆర్టీసీని విలీనం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి వేతనాలు, ఇంక్రీమెంట్లు వస్తున్నాయో..అవన్నీ కూడా ఆర్టీసీ కార్మికులకు వర్తిస్తాయన్నారు. ఆర్టీసీ కార్మికులకు మంచి జరుగుతుందని చెప్పారు. గతంలో చంద్రబాబు ఆర్టీసీని కోమలోకి తీసుకెళ్లారని, గత తొమ్మిదేళ్ల పాలనలో ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించగా, ఆ తరువాత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కాపాడారన్నారు. కార్మికులను మహానేత రెగ్యులర్‌ చేశారన్నారు. ఆయన కుమారుడిగా వైయస్‌ జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తూ విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. ఈ బడ్జెట్లో రూ.1572 కోట్లు కేటాయించడంతో ఆర్టీసీ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఆర్టీసీని నిధులు కేటాయించినందుకు సీఎంకు అభినందనలు తెలిపారు.  

 

Back to Top