చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. ఎన్నికల కమిషనర్ ఒక పార్టీకి మేలు చేసేందుకు రాష్ట్రాభివృద్ధిని విస్మరించారని, ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. కరోనా సాకు చూపి స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేశారు. మళ్లీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమని కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేస్తూ ఆర్డర్స్ వేశారు. దేనికి కూడా పొంతన లేదు. ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ తన హక్కులను, విధులను దుర్వినియోగం చేశారు. విచక్షణ అనే పదాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికలు వాయిదా వేయడం దేశంలోనే ఇలాంటి నిర్ణయం మొదటిది. అధికారులతో, ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేశారు. చంద్రబాబుతో రమేష్‌కుమార్‌కు ఉన్న సంబంధాల రీత్యా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు రాసిన స్ట్రీప్ట్‌ను రమేష్ చదివారు. వైయస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. గ్రామ ముంగిట్లో పరిపాలన సాగుతుంది. ఇలాంటి సమయంలో ఎన్నికలు వాయిదా వేయడం బాధాకరం. అమరావతిలో కొందరు వ్యక్తులు టెంట్ వేసుకొని ఉద్యమం చేస్తున్నారు. టీడీపీ ఫెయిడ్ ఆర్టిస్టులతో ఈ ఉద్యమం నడుస్తోంది. అక్కడ లేని కరోనా మరెక్కడా లేదు. ఎన్నికల వాయిదా వెనుక రాజకీయ కోణం ఉంది. టీడీపీ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. సూటిగా ఒక్కటే అడుగుతున్నాను.. మేం అడ్డుకుంటే రాష్ట్రంలో 18 వేల మంది టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేసే వారా?. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలు ఇవాళ సంతృప్తిగా ఉన్నారు. అందుకే టీడీపీ తరఫున పోటి చేసేందుకు ముందుకు రావడం లేదు. ఏదో జరిగిపోతుందని ఎల్లోమీడియాలో కథనాలు రాస్తున్నారు. మా నియోజకవర్గంలో టీడీపీ నేతలే అధికంగా నామినేషన్లు వేశారు. మాజీ ఎమ్మెల్సీ కొందరితో బలవంతంగా నామినేషన్లు వేయించారు. బురఖాలు వేయించి నామినేషన్లు వేయించారు. ఆర్వో, పోలీసులను భయాభ్రాంతులకు గురి చేశారు. టీడీపీ నేతలే అనేక ప్రాంతాల్లో గొడవలు చేశారు. ప్రజలను రెచ్చగొట్టారు. అధికారంలో ఉన్న మేం సామరస్యంగా వ్యవహరించాం. మా నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాకు ఎప్పుడు చెబుతుంటారని..ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పార్టీలకు, కులాలకు అతీతంగా అందించాలని మాకు చెబుతుంటారు. వైయస్ జగన్ పాలనను పక్క రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి నిధులు రావు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. అందుకే ప్రజలు చంద్రబాబుకు గుణపాఠం చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను టీడీపీ సమర్ధించకుండా బురద జల్లే కార్యక్రమాలు చేపడుతోంది. ఎన్నికల్లో ఏకగ్రీవంగా వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఎన్నిక కావడంతో రాజకీయ భవిష్యత్ ఉండదని కమిషనర్‌ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు ఎన్నికలు వాయిదా వేయించారు. ప్రజాస్వామ్యంలో ఇదొక బ్లాక్ డేగా పరిగణిస్తున్నామని ఎమ్మెల్యే శ్రీనివాసులు పేర్కొన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రితో కలిసి పని చేయాలన్నారు. ఎన్నికలు యధావిధిగా నిర్వహించి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కొరముట్ల శ్రీనివాసులు కోరారు.