నైపుణ్యాభివృద్ధితో ఉజ్వల భవిష్యత్‌

 యువతపైనే దేశ ప్రగతి ఆధారం

 త్వరలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాలలు

 ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ
 
 జాబ్‌ మేళాలో ఎమ్మెల్యే అనంత స్పష్టీకరణ

అనంతపురం : నైపుణ్యాభివృద్ధితోనే యువతకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహించారు. అనంతతో పాటు ఎంపీ రంగయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రగతి యువతపైనే ఆధార పడి ఉందన్నారు. వెనుకబడిన అనంతపురం జిల్లాలో 23 కంపెనీల ప్రతినిధులు తరలివచ్చి జాబ్‌మేళా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగాలు రాని వారెవరూ నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. కంపెనీలకు ఎలాంటి అవసరాలు ఉంటాయో అలాంటి వాటిలో తర్ఫీదు తీసుకుంటే ఉద్యోగాలు తప్పకుండా లభిస్తాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రత్యేకంగా స్కిల్‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాల్లోనూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం తెచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌దని అన్నారు. అనంతపురం జిల్లా కేంద్రం చుట్టూ వివిధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా యువతకు శిక్షణ ఇచ్చేలా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జాబ్‌మేళాలో ఉద్యోగాలు సాధించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు.

Back to Top