ప్రజల బాగు కోసం పరితపిస్తున్న సీఎం వైయ‌స్‌ జగన్‌

అవకాశవాద ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పండి

 ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి

 అనంతపురం :  సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. నగరంలోని 50వ డివిజన్‌ పరిధిలో ఉన్న రైల్వే గేట్‌ నుంచి తిక్కరంగయ్య స్వామి గుడి వరకు రూ.80 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే అనంతతో పాటు ఎంపీ రంగయ్య, మేయర్‌ మహమ్మద్‌ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కరరెడ్డి, వాసంతి సాహిత్య, నగర పాలక సంస్థ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ కాలుష్య కోరల్లోంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు కార్పొరేషన్‌ పాలక వర్గం, అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చెప్పారు. ఆరు బయలు స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. రైల్వేగేట్‌ వద్ద ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పదికాలల పాటు ఉండేలా సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు.  నగరంలో ఎక్కడా గుంతలు లేకుండా రోడ్లు వేయిస్తామన్నారు. గతంలోనే కొన్ని పనులు మంజూరైనా కరోనా వల్ల ఆలస్యం అయ్యాయని, మరో మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల బాగోగుల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలని తెలిపారు. నగరంలో రోడ్లు వేస్తుంటే అడ్డుపడే పరిస్థితులు కూడా కల్పిస్తున్నారని మండిపడ్డారు. సాధారణ ఎన్నికల్లో, కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గురుశేఖర్‌బాబు, టీవీ చంద్రమోహన్, రాజేశ్వరి, అనిల్‌కుమార్‌రెడ్డి, కమల్‌ భూషణ్, మునిశేఖర్, నగర పాలక సంస్థ అధికారులు, వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top