మీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నాం

అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి 

 పారదర్శకంగా సంక్షేమ పథకాల అమలు

 నగరానికి దీటుగా పంచాయతీల అభివృద్ధి

 కరోనా సమయంలోనూ ఆగని సంక్షేమ పథకాలు

 నేరుగా నగదు బదిలీతో ప్రజలకు అండగా నిలిచాం

 పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం

 గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల దోపిడీ

అనంతపురం :‘‘వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని ప్రజలు విశ్వసించార‌ని ఎమ్మెల్యే అనంత వెంక‌ట రామిరెడ్డి అన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా రెండేళ్లుగా పరిపాలన సాగిస్తున్నామ‌ని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు. మాటిస్తే చేయాలన్నది ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నైజం’’ అని తెలిపారు. రాజీవ్‌ కాలనీ పంచాయతీలోని టీచర్‌ రామయ్య కాలనీలో మంగళవారం పేదలకు ఇంటి పట్టాలను ఎమ్మెల్యే అనంత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా కేంద్రానికి ఎంతో మంది పొట్టకూటి కోసం, పిల్లల చదువు కోసం వలస వచ్చారని తెలిపారు. చాలా మందికి సొంతిళ్లు లేవని, అలాంటి వారి సొంతింటి కలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. ఎక్కడా లేని విధంగా అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో 28 వేల మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశామన్నారు. నగరానికి దీటుగా పంచాయతీలను అభివృద్థి పథంలో తీసుకెళ్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. గతంలోనే టీచర్‌ రామయ్య కాలనీలో ఇంటి పట్టాలు ఇవ్వాలని తలచినా సమైక్య ఉద్యమం కారణంగా రెండేళ్లు పాలన స్తంభించిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. పట్టాలు లేని కారణంగా కాలనీలో రోడ్లు వేసే విషయంలోనూ కొందరు అధికారులు అడ్డు చెప్పారని, కానీ తాను ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్లు వేయించినట్లు చెప్పారు. పట్టాల కోసం వామపక్షాలు చేసిన పోరాటంలో తాము కూడా భాగస్వాములయిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఇళ్లు లేదన్న మాట ఉండకూడదన్నదే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 30 లక్షల మందికి పైగా పేదలకు పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం రూ.1.80 లక్షలు ప్రభుత్వం ఇస్తోందని, పావలా వడ్డీకి సైతం రుణాలు అందించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమకు కావాల్సిన రీతిలో ఇళ్లు కట్టించుకునే సౌకర్యం కల్పించామన్నారు. బహిరంగ మార్కెట్‌లో సిమెంట్‌ బస్తా ధర రూ.385 ఉంటే తాము రూ.241కే అందిస్తున్నామని తెలిపారు. ఇసుక కూడా రూ.2500 నుంచి రూ.3000 వరకే అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని, ఎలాంటి అడ్డంకులు వచ్చినా ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అవుతున్నాయని, ఇలాగే కొనసాగితే మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి అవుతారన్న అక్కసుతో తెలుగుదేశం పార్టీ నేతలు కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. పేదల పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియంలో చదువు చెప్పిస్తామంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు ఆగలేదని గుర్తు చేశారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు బదిలీ చేసిన చరిత్ర సీఎం  వైయ‌స్ జగన్‌దని అన్నారు. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు దోపిడీ చేశాయని విమర్శించారు. ప్రజలకు మంచి చేస్తుంటే ఓర్వలేని నాయకులు, పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీచర్‌ రామయ్య కాలనీల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top