అసెంబ్లీ: రాజధాని పేరుతో చంద్రబాబు రైతు వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణను మనస్పూర్తిగా సమర్ధిస్తున్నానని ఆయన ప్రకటించారు. అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లుపై ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ రోజు సభలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టిన బిల్లులను మనస్పూర్తిగా మద్దతిస్తున్నాను. ఈ బిల్లు రాష్ట్రాభివృద్ధికి ప్రవేశపెట్టారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. ఈ రోజు బుగ్గన రాజేంద్రనాథ్ ఇన్‌సైడర్ ట్రేడింగ్ గురించి సభలో సాక్షాధారాలు సభలో ఉంచారు. ఇదే విషయాన్ని ఐదేళ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సంపూర్ణంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సభలో చెప్పారు. అప్పటి సీఎం చంద్రబాబు, స్పీకర్ ప్రతిపక్ష నేత గొంతును నొక్కారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డారు. రాజధానిలో తాడికోండ, మంగళగిరి ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో 29 గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తానని చంద్రబాబు చెప్పిన రోజు సంతోషించాను. కానీ వాస్తవాలు తెలుసుకునే సరికి మేం మోసపోయాం. విభజన చట్టం ప్రకారం రాజధాని స్థల ఎంపిక నుంచి నిర్మాణం వరకు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. ఆ రోజు శివరామకృష్ణ కమిటీ 13 జిల్లాలు విస్తృతంగా పర్యటించి తమ అభిప్రాయాలు చెప్పినా కూడా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న మీడియాతో అవాస్తవాలు చెబుతున్నారు. రాజధానికి 33 వేల ఎకరాలు కావాలంటే అప్పట్లో వైయస్ జగన్ సమర్ధిస్తూనే ప్రభుత్వ భూమి కావాలన్నారు. సామాన్యులు రాజధానిలో ఉండాలంటే భూమి అందుబాటులో ఉండాలన్నారు. ఆ రోజు వైయస్ జగన్ చెప్పింది వక్రీకరిస్తున్నారు. రాజధాని ముసుగులో చంద్రబాబు ఇన్‌సైడర్ ట్రేడింగ్ ప్రజలకు తెలిసిపోయింది. రాజధాని ప్రాంతంలో కంటిమీద కునుకు లేకుండా, కౌలు రైతులను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ఈ ప్రాంతంలో మూడు నుంచి ఐదు పంటలు పండుతాయి. నీటి ఊడలు ఉన్నాయి. పర్యావరణ విషయంలో మరోవైపు చట్టాలు కూడా స్పష్టంగా చెబుతున్నా కూడా చంద్రబాబు తన అభ్యున్నతి కోసం చట్టాలను తుంగలోకి తొక్కుతూ..గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును పట్టించుకోలేదు. రాజధాని అంటే అందరిది కావాలి. ఇక్కడ రైతులు, కౌలు రైతులు నష్టపోయారు. కూలీలు భార్య,భర్తలు ఇద్దరూ కలిసి నెలకు కనీసం రూ.20 నుంచి 25 వేలు సంపాదించుకునేవారు. వారందరూ కూడా ఎస్సీ, ఎస్టీ నిరుపేద కుటుంబాలే. ఇంత భూమిని కాజేసిన చంద్రబాబు నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌భూమి తీసుకునే సమయంలో వారి అనుమతి కూడా తీసుకోలేదు. చంద్రబాబు దళిత ద్రోహి. అందరి అనుమతితోనే రాజధాని నిర్మాణం, వికేంద్రీకరణకు సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ నివేదికలు చదువుతున్న దళిత ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌ను చంద్రబాబు చులకనగా మాట్లాడారు. రైతులకు పదేళ్ల నుంచి 15 ఏళ్లకు కౌలు పెంచుతామని మంత్రి చెప్పారు. కౌలు రైతుల అభ్యున్నతి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం గొప్ప విషయం. వికేంద్రీకరణకు చాలా మంది రైతులు అనుకూలంగా ఉన్నారు. సీఎం వైయస్ జగన్ చెబితే చేస్తారన్నది రాజధాని రైతుల ప్రగాఢ విశ్వాసం. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు న్యాయం జరుగుతుంది. రాజధాని పేరుతో చంద్రబాబు డ్రామా చేసినా మంగళగిరి, తాడికోండలో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. చంద్రబాబు చెప్పినట్లు అభివృద్ధి జరిగివుంటే టీడీపీ ఎందుకు ఓడింది?. ప్రాంత ప్రజలకు చంద్రబాబు గురించి బాగా తెలుసు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి యోచిస్తున్నారు.