టీడీపీ భూకుంభకోణం బట్టబయలు

ప్రభుత్వానికి నివేదిక అందజేసిన మంత్రివర్గ ఉపసంఘం

రాజధాని ప్రకటనకు ముందే 4,075 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా నివేదిక

టీడీపీ అవినీతిపై లోకాయుక్తా లేదా సీబీఐ లేదా సీఐడీతో విచారణ

అమరావతి: మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో అమరావతిలో వేలకోట్ల అవినీతి జరిగినట్టు తేలింది. అమరావతి వేదికగా రాజధాని పేరుతో గత చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిన కుంభకోణం బయటకొచ్చింది. రాజధానిలో జరిగిన అవినీతిపై సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం కేబినెట్‌ భేటీలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని బహిర్గతం చేసింది. ఆధారాలతో సహా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను బట్టబయలు చేసింది. 2014 డిసెంబర్‌ 30 రాజధాని ప్రకటన కంటే ముందు టీడీపీ నేతలు 4,075 ఎకరాల భూములను కొనుగోలు చేసినట్టు మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో పేర్కొంది. 

చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ సంస్థ, లింగమనేని, వేమూరి హరిప్రసాద్‌ల పేర్లతో భారీగా భూకొనుగోలు చేసినట్టు వివరాలతో కూడిన నివేదికను మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సమర్పించింది. గత ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, పరిటాల సునీతతో సహా టీడీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలందరి భూకుంభకోణాలను కమిటీ బట్టబయలు చేసింది. 900 ఎకరాల అసైన్డ్‌ భూములను ఎస్సీ, ఎస్టీల నుంచి టీడీపీ నేతలు బెదిరించి కొనుగోలు చేసినట్టు కూడా కమిటీ నివేదికలో తేలింది. తెల్ల రేషన్‌ కార్డు దారులు కూడా కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసినట్టు స్పష్టం చేసింది.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కోసమే క్యాపిటల్‌ రీజన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఆర్‌డీఏ) పరిధిని గత చంద్రబాబు ప్రభుత్వం అనేక మార్లు మార్చినట్టు ఆధారాలు గుర్తించిన మంత్రివర్గ ఉపసంఘం, దానిని ప్రభుత్వానికి వివరించింది. కాగా రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబుకు వాటాలు ఉన్న కంపెనీలు, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన భూములపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని విచారణ జరిపిస్తామని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. న్యాయ నిపుణుల సలహా మేరకు లోకయుక్తా, సీబీఐ లేదా సీబీ సీఐడీతో విచారణ జరిపిస్తామన్నారు.  

Back to Top