బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం

ఇప్పటికే కొంత‌మంది డ‌యేరియా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు 

ఏమైనా సమస్యలు ఉంటే 8341396104కు ఫోన్‌ చేయొచ్చు 

బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం

గుంటూరు: డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. 24/7 వైద్యులను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్‌ 8341396104కు ఫోన్‌ చేయొచ్చని సూచించారు. గుంటూరు కలెక్టరేట్‌లో మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, నగర కమిషనర్‌ కీర్తి చేకూరి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఏకుల కిరణ్‌కుమార్‌తో కలిసి మంత్రి విడ‌ద‌ల ర‌జిని మీడియాతో మాట్లాడారు. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డయేరియా వచ్చిందని.. గుంటూరు నగరంలో పది ప్రాంతాల్లో అది తలెత్తిందని గుర్తుచేశారు. నాడు 2,400 మంది డయేరియాతో బాధపడ్డారని.. అందులో 24 మంది మృతి చెందారని తెలిపారు. 

శనివారం గుంటూరుతోపాటు ఇతర ప్రాంతాల నుంచి 32 మంది వాంతులు, విరేచ­నాలతో జీజీహెచ్‌కు వచ్చా­ర­న్నారు. వీరందరికి వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. దీంతో ఏడుగురు డిశ్చార్జ్‌ అయ్యారని, మిగతావారు సోమవారం నాటికి డిశ్చార్జ్‌ అవుతారని వివరించారు. ఘటనపై జిల్లా కలెక్టర్, నగర కమిషనర్‌ పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారని తెలిపారు. బాధితుల నుంచి శాంపిల్స్‌ తీసుకుని పరీక్షలకు పంపించామన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  

డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటా సర్వే చేయిస్తున్నామని మంత్రి విడదల రజిని వెల్లడించారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యులు వెంటనే వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో తాగునీటిని రోస్టర్‌ విధానంలో సరఫరా చేస్తున్నారని తెలిపారు. శారదా కాలనీలో మూడు షిఫ్ట్‌లలో వైద్యులు, ఐదుగురు సిబ్బందిని 24/7 అందుబాటులో ఉంచామన్నారు. కాగా, ఇటీవల కృష్ణానదిలోకి పులిచింతల నుంచి కొత్త నీరు వస్తోందని ప్రజలకు 15 రోజుల కిందటే కమిషనర్‌ తెలియజేశారన్నారు. కుళాయిల నుంచి వచ్చే తాగునీటిని వేడి చేసుకుని తాగాలని సూచించామ‌న్నారు. 

తాజా వీడియోలు

Back to Top