విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎవరి సిఫారసులు, పైరవీలు లేకుండా ప్రతి సంక్షేమ పథకం ప్రజల గుమ్మం ముందుకే వచ్చి చేరుతుందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ముచ్చటించి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోర్టులో కేసులు పరిష్కారం అయిన వెంటనే అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని చెప్పారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలంటూ దిక్కుమాలిన కమిటీలు వేసి సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే దోచుకుతిన్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల గుమ్మం ముందుకే సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.