విజయవాడ: కష్టపడి చదువుకున్న వాళ్లే ఎదుటివారి కష్టాలు తీర్చగలరని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల శిక్షణ తరగతులను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌లు, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు సోమవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నైపుణ్యం ఉన్న వాళ్లే సచివాలయ వ్యవస్థకు అవసరం అని నమ్మి పరీక్షల ద్వారా ఉద్యోగులను నియమించామని తెలిపారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎంతో ఓర్పు ఉండాలని సూచించారు. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వంలో కీలకమైన ఉద్యోగాలన్నారు. బాధ్యతగా పనిచేయాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన సచివాలయాలలో సెక్రటరీలుగా అందరూ బాధ్యతగా పని చేయాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. సచివాలయ వ్యవస్థను గ్రామాలకు, పట్టణాలలోని వార్డులకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో నిర్ణయించారన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఐదు బ్యాచ్‌లుగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. బ్యాచ్‌కు రెండు వందల నుంచి నాలుగు వందల మంది ఉంటారన్నారు. వివిధ శాఖల నుంచి రిటైర్డ్ కమిషనర్లను, మెప్మా పీడీలను ట్రైనర్లుగా నియమించామని తెలిపారు. కార్పొరేషన్ల జోనల్ కమిషనర్లను పీడీలుగా ఏర్పాటు చేశామన్నారు. సచివాలయ బాధ్యతలను వార్డు సెక్రటరీలు అందరూ తెలుసుకోవాలన్నారు. Read Also: సీఎం వైయస్ జగన్ రైతు పక్షపాతి