తాడేపల్లి: 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. ఆ అనుభవంతో పచ్చి అబద్ధాలను ప్రచారం చేసుకుంటున్నాడని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు. విశాఖలో జరిగిన సభలో ప్రధాని మోడీ అసలు చంద్రబాబు ప్రస్తావనే తీసుకురాలేదన్నారు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబే ఉద్దరించినట్టు తన జేబు పత్రికల్లో అబద్ధాలు రాయించుకున్నాడని మండిపడ్డారు. నిజానికి డ్వాక్రా సంఘాల మహిళలను నమ్మించి మోసం చేసిన ఘనుడు చంద్రబాబేనని, రుణమాఫీ పేరుతో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను నట్టేట ముంచాడని మంత్రి ఉషాశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఉషాశ్రీ చరణ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉషాశ్రీ చరణ్ ఏం మాట్లాడారంటే.. డ్వాక్రా సంఘాలను తానే కనిపెట్టినట్టుగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు. డ్వాక్రా సంఘాలు మన దేశంలో 1982లో నిర్మించారు. ఈ లెక్కన తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎప్పుడు పుట్టి, ఎప్పుడు అధికారంలోకి వచ్చిందో ప్రజలు ఆలోచించాలి. టీడీపీ పుట్టకముందే డ్వాక్రా సంఘాలు పుట్టాయి. చంద్రబాబు ఏ విధంగా డ్వాక్రా సంఘాలను తనకు ఆపాదించుకుంటున్నాడో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. 40 ఏళ్ల అనుభవం, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ఇలా పచ్చి అబద్ధాలు చెబితే ప్రజలు ఏమనుకుంటారనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలకు మేలు చేయాలని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పావలా వడ్డీకి శ్రీకారం చుట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక సున్నావడ్డీ మొదలుపెట్టారు. చంద్రబాబు 2014–19 వరకు ఐదేళ్లలో డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.14 వేల కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు. 2016లో సున్నావడ్డీని పూర్తిగా నిలిపేశాడు. డ్వాక్రా సంఘాల గ్రూపులు ఏ, బీ గ్రేడ్‌లలో ఉండే సంఘాలు బాబు పాలనలో సీ, డీ గ్రేడ్ వరకు పడిపోయాయి. తన సుదీర్ఘమైన పాదయాత్రలో డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు నేనున్నానని వైయస్ జగన్ మాటిచ్చారు. నాలుగు దఫాలుగా న్యాయం చేస్తానని చెప్పారు. రూ.25 వేల కోట్ల పైచిలుకు ఉన్న అప్పును నేను నాలుగు విడతల్లో అందిస్తానని వైయస్ జగన్ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.12,750 కోట్లు అందజేశారు. ఈరోజు రాష్ట్రంలో 7.97 లక్షల పొదుపు సంఘాల్లోని 76.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు దాదాపు రూ.12,750 కోట్లు ఇప్పటికే అందించడం జరిగింది. అదే విధంగా బడ్జెట్‌లో మహిళా సంక్షేమానికి సింహభాగం కేటాయించారు. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందించారు. దాంట్లో 21 శాతం ఇళ్లను కూడా నిర్మిస్తున్నారు. టీడీపీ, జనసేనకు అజెండా లేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ముందుకెళ్తున్నారు. జగనన్న కాలనీలపై దుష్ప్రచారం చేయాలని చూశారు.. కానీ, లబ్ధిపొందిన మహిళలు టీడీపీ, జనసేన నేతలను తరిమికొట్టిన పరిస్థితి చూశాం. మహిళా సాధికారతకు సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేశారు. రిజర్వేషన్ 33 శాతం, 50 శాతం కావాలని మిగతా రాష్ట్రాల్లో మహిళలు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు. కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరూ ఉద్యమం చేయలేదు, డిమాండ్ చేయలేదు. పెద్ద మనసుతో అక్కచెల్లెమ్మలను సీఎం వైయస్ జగన్ ఆదుకుంటున్నారు. నామినేటెడ్ పోస్టులు, పనుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. ప్రతీ రంగంలో మహిళలకు తోడుగా నిలుస్తున్నారు. 13 జెడ్పీ చైర్మన్ పదవుల్లో 7 మహిళలకు, 26 వైస్ చైర్‌పర్సన్ పోస్టుల్లో 15 మహిళలకే, 12 మేయర్–14 డిప్యూటీ మేయర్ పోస్టుల్లో 18 మహిళలకే, మున్సిపాలిటీల్లో 53 శాతం మహిళలకే, సర్పంచ్ పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీ పదవుల్లో 54 శాతం, ఎంపీపీ పోస్టుల్లో 53 శాతం, జెడ్పీటీసీల్లో 53 శాతం, వలంటీర్స్‌లో కూడా 53 శాతం మహిళలకే ఇచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్‌ది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా తొలిసారిగా మహిళను నియమించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి డిప్యూటీ సీఎంగా పుష్పశ్రీవాణిని నియమించారు. హోంమంత్రిగా ఎస్సీ మహిళను (గతంలో సుచరిత, ప్రస్తుతం వనిత) నియమించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా తొలిసారిగా మహిళను నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మహిళను నియమించిన ఘనత కూడా సీఎం వైయస్ జగన్‌ది. మహిళ రక్షణ కోసం దిశ యాప్‌ను తీసుకొచ్చిన ఘనత కూడా సీఎం వైయస్ జగన్‌దే’ అని మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు.