28 లక్షల మందికి ఇళ్లు

జనవరిలో నిర్మాణాలు ప్రారంభం

ఉగాది నాటికి ఇళ్ల స్థ‌లాల‌ పంపిణీ

హౌసింగ్ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు

సచివాలయం: రాష్ట్రంలో 28 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు చర్యలు వేగవంతం చేశామని హౌసింగ్ శాఖ‌ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ఆయన సచివాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి 25 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ధేశించారని.. 21 లక్షల మంది ఇళ్ల స్థలాలకి, 7 లక్షల మంది ఇళ్లకి అర్హులున్నారని తేలిందని చెప్పారు. త్వరిత గతిన ఇళ్లస్థలాలు ఇచ్చి.. ఇళ్లు కట్టివ్వాలని ముఖ్యమంత్రి గట్టిగా చెప్పారని మంత్రి తెలిపారు. ఈ విషయంపై కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని చెప్పారు. కేంద్రం ఇప్పటికే 12 లక్షల ఇళ్లు శాంక్షన్‌ చేసిందన్నారు. కేంద్రం వాటా కింద రూ.11,302 కోట్లు ఇచ్చేందుకు కూడా సుముఖంగా ఉందని తెలిపారు. రాష్ట్ర వాటా రూ.4,742 కోట్లు కేటాయింపులు జరిగాయన్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో ఒక సెంటు భూమిలో ఇండిపెండెంట్‌ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు.
రూ.2లక్షల కోట్ల సంపద సృష్టి..
28 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్ల సంపద సష్టి జరుగుతుందని మంత్రి రంగనాధరాజు అన్నారు. ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. భూమి లేని చోట్ల రైతులను ఒప్పించి పూలింగ్‌ చేస్తామని మంత్రి తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టే ఏ నిర్ణయమూ ప్రభుత్వం తీసుకోదని ఆయన అన్నారు.

Back to Top