తిరుపతి ఉప ఎన్నిక మాకు రెఫరెండ‌మే... తప్పకుండా గెలుస్తాం

ప‌శు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు ప్రచార అంశాలు లేవు

ఈ 22 నెలల్లో ఏమేం చేశామన్నది చెబుతూ ఓట్లు అడుగుతున్నాం

పనబాక లక్ష్మి గెలిస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలు తగ్గిస్తారా?

ఆమె ఎంపీగా పోటీ చేస్తున్నారా? లేక ప్రధాని పదవికి పోటీనా?

సూటిగా ప్రశ్నించిన మంత్రి శ్రీ సీదిరి అప్పలరాజు 

నెల్లూరు:  తిరుప‌తి ఉప ఎన్నిక వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెఫ‌రెండ‌మేన‌ని..త‌ప్ప‌క మా పార్టీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ గురుమూర్తి గెలుస్తార‌ని మంత్రి సీదిరి అప్పలరాజు స్ప‌ష్టం చేశారు.  తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సరళి గమనిస్తే టీడీపీ, బీజేపీ–జనసేన పార్టీల ప్రచారానికి అంశాలు ఏం లేవు. ఏ అంశంతో ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారో క్లారిటీ లేదు. లోకేష్‌ వృద్ధుల దగ్గరకు వెళ్ళి సైకిల్‌కు ఓటేయండి, మీ పెన్షన్‌ పెంచుతామంటారు. పనబాక లక్ష్మిని గెలిపిస్తే గ్యాస్, డీజిల్, పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామంటారు. అసలు ఆమె ఎంపీగా పోటీ చేస్తున్నారా? లేక ప్రధాని పదవికి పోటీ చేస్తున్నారా? అని సూటిగా ప్ర‌శ్నించారు. నెల్లూరులో మంత్రి మీడియాతో మాట్లాడారు.

– లోకేష్‌ ఏం మాట్లాడుతున్నారో కనీసం ఆయనకైనా అర్ధమవుతోందా?. మా అభ్యర్ధి డాక్టర్‌ గురుమూర్తిని కించపరిస్తూ, వృత్తిని అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నారు. వృత్తిలో భాగంగా ఫిజియో«థెరపిస్ట్‌ కాళ్లు, చేతులు, తల పట్టుకుంటారు. దాన్ని కూడా అవమానపరుస్తున్నారంటే అసలు ఆయనకు డాక్టర్లు అంటే గౌరవం ఉందా?. జగన్‌ గారి కాళ్ళు పట్టుకున్నందుకు బహుమానం అన్నారు. మరి నేను ఒక డాక్టర్‌గా చంద్రబాబు చర్మవ్యాధి గురించి, ఆయన మానసిక స్ధితి గురించి, లోకేష్‌ మందబుద్ది గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది?. గౌరవప్రదమైన వృత్తిని హేళన చేయడం తగదు. ఇది బాధాకరం. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి.

– చంద్రబాబు వకీల్‌సాబ్‌ సినిమా ఏదో జాతీయ సమస్య అయినట్లు, దేశ సమస్య అయినట్లు మాట్లాడుతున్నారు. ఇది కక్ష సాధింపు చర్య అంటున్నారు. ప్రచారం చేయడానికి వేరే అంశాలు, సమస్యలు ఏం లేవా? సినిమా టికెట్‌ రేట్ల గురించి మాట్లాడతారా?. హాయిగా సినిమా ప్రచారం చేసుకోండి. ఎవరు కాదన్నారు?.

– తిరుపతి సభలో మాట్లాడిన పవన్‌కళ్యాణ్, వైయస్సార్‌సీపీ ఎంపీలు బీజేపీని నిలదీయడం లేదన్నారు. ఈ ఎన్నికలో బీజేపీని గెలిపిస్తే పోరాటం చేస్తామంన్నారు. మరి అదే వేదిక మీద బీజేపీ పెద్దలను పవన్‌కళ్యాణ్‌  ఎందుకు అడగలేదు? రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? హోదా ఎందుకు ఇవ్వలేదు? విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఎందుకు అమ్మేస్తున్నారు? అని ఆ పార్టీ పెద్దలను నిలదీయలేదు. కానీ ప్రజలను మాత్రం రెచ్చగొడతారు.

– బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏపీపై ప్రేమ ఉంటే పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హమీలు నెరవేర్చి ఓట్లు అడగాలి. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? కేంద్రం పెంచుతున్న ఎరువుల ధరలు, పెట్రోల్, డీజిల్‌ రేట్ల గురించి కాకుండా వకీల్‌సాబ్‌ సినిమా గురించి, గురుమూర్తి వృత్తి గురించి చిల్లరగా మాట్లాడుతున్నారు.

– బీజేపీ వారు మతాల గురించి, విగ్రహాల రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు, అచ్చెన్నాయుడు ఇలాకాలో ఆయన సొంత మనుషులు గుళ్ళో విగ్రహాన్ని రోడ్డు మీద పడేశారు, సీసీ ఫుటేజ్‌ కూడా ఉంది. ఆ దోషులను ప్రభుత్వం జైలుకు పంపింది. దీని మీద ఏ నాయకుడైనా మాట్లాడారా? బీజేపీ ప్రోద్భలంతోనే ఇవన్నీ జరుగుతున్నాయా? లేదా మీరంతా కూడబలుక్కుని ఇదంతా చేస్తున్నారని ప్రజలు నమ్ముతున్నారు.

– మా 22 నెలల పాలనకు రెఫరెండంగా భావించి మేం ఎన్నికలకు వెళ్తున్నాం. మా సీనియర్‌ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సవాల్‌ చేశారు. కానీ దానికి ఎవరూ సమాధానం చెప్పలేదు. తిరుపతి ఉప ఎన్నికలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతే మా ఎంపీలందరితో రాజీనామా చేయిస్తామని, మరి టీడీపీ అభ్యర్థి ఓడిపోతే, ఆ పార్టీ ఎంపీలు, చంద్రబాబుతో జత కట్టి తిరుగుతున్న రఘురామకృష్ణంరాజుతో సహా రాజీనామా చేస్తారా? అని శ్రీ పెద్దిరెడ్డి గారు సవాల్‌ చేస్తే, టీడీపీ వారు నోరు మెదపడం లేదు.

– బహిరంగ సభ నిర్వహిస్తే కోవిడ్‌ వ్యాప్తి చెందుతుందన్న నిపుణుల సూచన మేరకే సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తిరుపతిలో ప్రచార సభ రద్దు చేసుకుని, తిరుపతి ఓటర్లకు లేఖ రాశారు. అయితే దానిపైనా టీడీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇప్పటివరకూ ఓడిపోతారనే భయంతో సీఎం ప్రచారానికి వస్తున్నారన్న వారంతా ఇప్పుడు రావడం లేదని తెలియడంతో మరో కొత్త ప్రచారం మొదలుపెట్టారు. లోకేష్‌ విసిరిన సవాల్‌ స్వీకరించలేక సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ రావడం లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అంటున్నారు. మీకు ఏమైనా అవగాహన ఉండే మాట్లాడుతున్నారా?. 

– 22 నెలల పాలనలో 12 నెలలు కోవిడ్‌ తినేసింది. మిగిలిన 10 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాం. 44 లక్షల తల్లులకు అమ్మ ఒడి, 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం చేశాం. 88 లక్షల అక్కచెల్లెమ్మలకు ఆసరా ఇచ్చాం. 25 లక్షల మంది అక్కలకు చేయూత ఇచ్చామని ధైర్యంగా చెప్పగలుగుతాం. నాడు–నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు సమూలంగా మారుస్తున్నాం. ఆరోగ్యశ్రీ, 104, 108 సమూలంగా మార్చుకోగలిగామని ప్రజలకు చెబుతాం. పెంచిన పెన్షన్‌ల గురించి చెప్పగలం. 31 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామని చెప్పి ఓట్లు అడగగలం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ది చేకూర్చిన ఘనత మా ప్రభుత్వానిది. మేం చేసిన మంచి పనులు చెప్పి ఓట్లు అడిగే దమ్ము, ధైర్యం మాకు ఉన్నాయి.

– కానీ విపక్షాలు చిల్లర విషయాల మీద రాజకీయాలు చేస్తూ ఓట్లు అడుగుతున్నాయి. కానీ విభజన హమీలు, స్టీల్‌ప్లాంట్, ప్రత్యేక హోదా గురించి మాట్లాడి ఓట్లు అడగండి. టీడీపీ, బీజేపీ–జనసేన మధ్య తెరవెనుక ఒప్పందం ఉంది. ఏ పార్టీని ఎవరూ విమర్శించరు. కేవలం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేస్తారు, ఇది ప్రజలకు అర్ధమయ్యే ఇటీవలి స్థానిక ఎన్నికల్లో అన్ని పార్టీలను పూర్తిగా పక్కన పెట్టారు.

– ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి డాక్టర్‌ గురుమూర్తిని గెలిపించి తద్వారా ఈ ప్రభుత్వం చేసిన మంచి పనులకు కృతజ్ఞతగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు, ఎంపీ సీటును ఇవ్వండి. వైయస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి.

చిత్త‌శుద్ధితో పోరాడుతున్నాం..
    ‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో ముందు స్పందించిన పార్టీ మాది.   ముఖ్యమంత్రి గారు ప్రధానికి లేఖ రాశారు. ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా చిత్తశుద్దితో పోరాడుతున్నారు. కానీ బీజేపీ వారిని ఎందుకు అడగడం లేదు? మీరు కూడా బీజేపీ వారిని ప్రశ్నించండి. ఏపీకి ఇచ్చిన హమీలు ఎందుకు నెరవేర్చడం లేదని? ఇదే పవన్‌కళ్యాణ్‌ పాచిపోయిన లడ్లు అన్నారు. మరి ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదు. పాచిపోయిన లడ్లు ఇప్పుడు బాగున్నాయా?’ అని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ప్ర‌శ్నించారు.

 

తాజా వీడియోలు

Back to Top