శ్రీ‌కాకుళం జిల్లా అభివృద్ధికి మ‌రింత ఊతం పోర్టు నిర్మాణం 

శ్రీ‌కాకుళం:  జిల్లా అభివృద్ధికి ఊతం ఇచ్చేందుకు వీలుగా భావ‌న‌పాడు పోర్టు నిర్మాణం చేప‌ట్టనున్నామ‌ని రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. ఆనందమయి ఫంక్ష‌న్ హాల్ లో ఈ నెల 19న భావ‌న‌పాడు పోర్టు ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసేందుకు, అలానే  గొట్టా బ్యారేజ్ వ‌ద్ద ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి సంంధించిన ప‌నుల ప్రారంభోత్స‌వానికి జిల్లాకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి రానున్న నేప‌థ్యంలో అందుకు త‌గ్గ ఏర్పాట్ల గురించి సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ధ‌ర్మాన‌ ప్రసాదరావు మాట్లాడుతూ.. భావనపాడు పోర్టు కి ఉన్న సౌకర్యాలు ఏమిటంటే.. 2.5 కిలోమీటర్ల దూరంలో ఎన్.హెచ్.16 రోడ్ కనెక్టివిటీ ఉంది అని, ఏడు కిలోమీటర్ల దూరంలో చెన్నై -  కోల్ క‌తా రైలు మార్గం అందుబాటులో ఉందని చెప్పారు. అలానే విశాఖపట్నం న‌గ‌రానికి కేవలం 80 నాటికల్ మెయిల్స్ దూరంలో ఈశాన్య దిశగా ఉంద‌ని అన్నారు. ఈ పోర్టు వలన జిల్లాలోని సామాజిక ఆర్థిక పరిస్థితులు ప్రభావితం అవుతాయని చెప్పారు. పోర్టు వలన పౌర సముదాయాలు సమకూరుతాయన్నారు. డైరెక్ట్ ,ఇన్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వలన ప్రజలకు ఆదాయం పెరిగి, కొనుగోలు శక్తి  పెరుగుతుంద‌న్నారు.  ఉద్యోగాలు వచ్చి ఆదాయం పెరగడం వలన ఆర్థిక స్వాలంబన లభిస్తుంది అని చెప్పారు. 

అభివృద్ధి లేదు లేదు అని ప‌దే ప‌దే విప‌క్షాల ప్ర‌చారం చేస్తున్నాయ‌ని, దీనిని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన  ప్ర‌తి ఒక్క‌రూ తిప్పికొట్టాల‌ని పిలుపు ఇచ్చారు. ఇవాళ మ‌నం మాట్లాడ‌క‌పోతే త‌ప్పు చేసినవార‌మ‌వుతామ‌ని అన్నారు. ఇప్ప‌టికే జిల్లాలో ఇచ్ఛాపురం మొద‌లుకుని ర‌ణ స్థ‌లం వ‌ర‌కూ వివిధ రూపాల్లో అభివృద్ధి జ‌రుగుతోంద‌ని అన్నారు. ఇచ్ఛాపురంలో డ‌యాల‌సిస్ యూనిట్ల ఏర్పాటు, ప‌లాస‌లో కిడ్నీ ప‌రిశోధ‌న కేంద్రం ఏర్పాటు, అలానే టెక్క‌లిలో ఆఫ్  షోర్ రిజ‌ర్వాయ‌ర్ ప‌నుల పూర్తికి నిధుల కేటాయింపు, పాత‌ప‌ట్నం ప‌రిధిలో గొట్టా బ్యారేజీ వ‌ద్ద 19 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ఎత్తి పోతల ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేసిన వైనం.. ఇవ‌న్నీ కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని అన్నారు. ఇవేవీ గ‌తంలో లేవ‌ని కానీ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక నాగావ‌ళితో పాటు వంశ‌ధార నీటిని సద్వినియోగం చేసుకోవాల‌న్న స‌దుద్దేశంలో సాగునీటి ప‌నుల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి రాక నేప‌థ్యంలో సంబంధిత షెడ్యూల్ ప్ర‌కారం వివిధ అభివృద్ధి ప‌నుల శంకుస్థాప‌న‌ల‌కు పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు త‌ర‌లి రావాలని కోరారు. ప్రాంతీయ అస‌మానత‌లు నివారిస్తూ ఇవాళ అభివృద్ధి ప‌నుల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని చెప్పారు.

భావ‌న‌పాడు పోర్టు నిర్మాణంతో జిల్లా స‌మ‌గ్ర అభివృద్ధి సాధ్యం అవుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. విప‌క్షాల ఆరోప‌ణ‌లు కానీ విష ప్ర‌చారాన్ని కానీ తిప్పి కొట్టాలని ఆయ‌న పిలుపు నిచ్చారు. భావ‌న పాడుతో పాటే వంశ‌ధార ఫేజ్ 2 కు ఆనుకుని గొట్టా బ్యారేజ్ వ‌ద్ద ఏర్పాటుచేయ‌నున్న ఎత్తిపోత‌ల ప‌థ‌కం ద్వారా ఉద్దానం వ‌ర‌కూ నీరు అందిస్తామ‌ని, ఉప‌రిత‌ల జ‌లాలు అందించ‌డం ద్వారా ఉద్దానం  కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌కు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని చెప్పారు.
గ‌తంలో ఒడిశాతో త‌గాదాలు ఉన్నాయి అని నేర‌డి బ్యారేజీ ప‌నులు ముందుకు పోలేదని, ఇందుకు ప్ర‌త్యామ్నాయంగా ఆయుక‌ట్టు స్థిరీక‌ర‌ణ‌కు తాము చేప‌డుతున్న ఎత్తిపోత‌ల ప‌థ‌కం అన్న‌ది స‌ద్వినియోగం అయితే రెండున్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాల‌కు మేలు జ‌రుగుతుంద‌ని తెలిపారు. అలానే మిగ‌తా అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి కూడా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిత్త‌శుద్ధితోనే ఉన్నారు అని, ఆయ‌న‌కు ఉత్త‌రాంధ్ర అభివృద్ధి పై చిత్త‌శుద్ధి ఉంద‌ని అన్నారు. స‌మావేశంలో మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, సీదిరి అప్ప‌ల‌రాజు, స్పీక‌ర్ త‌మ్మినేని సీతారం, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Back to Top