కిరాయికి రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి పవన్‌

పవన్‌ వ్యాఖ్యలకు చిరంజీవి విచారం వ్యక్తం చేశారు

ఆ పొరపాటుతో ఇండస్ట్రీకి సంబంధం లేదని నిర్మాతలు చెప్పారు

ఆన్‌లైన్ టికెటింగ్ కొత్త‌గా మా ప్ర‌భుత్వం పెట్టింది కాదు

నిర్మాతలు మాట్లాడిన ప్రతి మాటను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా

సినీ నిర్మాతల బృందంతో భేటీ అనంతరం సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం: కిరాయికి రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని, రాజకీయ పార్టీని టెంట్‌హౌస్‌లా అద్దెకు ఇస్తున్నాడని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడిన మాటలపై విచారం వ్యక్తం చేస్తున్నామని, ఆ పిచ్చి వాగుడుకు, మాకు సంబంధం లేదని చెప్పడానికి, ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నామని చెప్పడానికి సినీ నిర్మాతలు వచ్చారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆడియో ఫంక్షన్‌లో జరిగిన పొరపాటుకు మెగాస్టార్‌ చిరంజీవి కూడా విచారం వ్యక్తం చేశారని, తనతో ఫోన్‌లో మాట్లాడారని, ఆ పొరపాటుకు ఇండస్ట్రీకి, సినీ పెద్దలకు సంబంధం లేదని, ఊటీలో షూటింగ్‌లో ఉన్నాను.. వచ్చిన తరువాత మాట్లాడుతానని చిరంజీవి అన్నారని మంత్రి పేర్ని నాని గుర్తుచేశారు. చిరంజీవితో పాటు చాలా మంది సినీ పెద్దలు ఫోన్‌లో మాట్లాడారని చెప్పారు. మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల బృందం భేటీ అయ్యారు. భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని విలేకరులతో మాట్లాడారు. 

ఆన్‌లైన్‌ టికెటింగ్‌కు అనుకూలంగా ఉన్నామని నిర్మాతలు చెప్పారన్నారు. 2004–05 సంవత్సరం నుంచే ఇండస్ట్రీ అంతా ఆన్‌లైన్‌ టికెటింగ్‌ కోసం అనుకూలంగా ఉందని,  బుక్‌ మై షో, పేటీఎం, జస్ట్‌ టికెట్‌ పేరుతో ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్‌ అమ్ముతున్నారని, ఇప్పటికే చాలా మందికి తెలియదన్నారు. దాదాపు థియేటర్లలో 60 నుంచి 90 పర్సంట్, కొన్ని చోట్ల 100 శాతం రకరకాలుగా ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ నడుస్తుందన్నారు. ఆన్‌లైన్‌ విధానాన్ని కొత్తగా ఆంధ్రప్రదేశ ప్రభుత్వం పెట్టలేదని,  ఇండస్ట్రీ మీద ప్రభుత్వాలకు ఉన్న అనుమానాలు పోవడానికి గానీ, నిర్దిష్టమైన విధానం ఉంటే తప్పితే ఇండస్ట్రీకి మంచిది కాదని గతంలో విజయవాడలో జరిగిన మీటింగ్‌లో చెప్పామని మంత్రి గుర్తుచేశారు.  

కరోనా ఏపీలో తగ్గుముఖంలో ఉంది కాబట్టి ఆక్యుపెన్సీని 50 శాతం నుంచి 100 శాతం పెంచమని, టికెట్‌ రేట్‌లో కూడా ఒకసారి రివ్యూ చేయండి అని విజయవాడలో జరిగిన మీటింగ్‌లోనే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కోరారని గుర్తుచేశారు. థియేటర్‌లో విద్యుత్‌ చార్జీలు గ్రామాలైనా, పట్టణాలైనా ఒకేరకంగా ఉంటాయని, దాని మీద ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారన్నారు. టికెట్‌ రేట్‌ తక్కువగా ఉంటే కొంత ఇబ్బందిపడతాం. కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ పెరుగుతుందని గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. 

‘‘సినిమా ఇండస్ట్రీకి మేలు చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని అనుకున్న తరుణంలో ఒక సినిమా నటుడు.. మాతో మాట్లాడకుండానే, ఎవరూ ఏమీ చెప్పకుండానే.. అపార్ధం చేసుకొని కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడారు. దానికి అందరం బాధపడ్డాం. మేము ఆ నటుడు చెప్పిన అభిప్రాయంలో లేము. ప్రభుత్వం మీద సానుకూలంగా ఉన్నాం. ఆ నటుడి మాటలకు, ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదు. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నాం’’ అని నిర్మాత బృందం, చాలా మంది సినీ పెద్దలు చెప్పారని మంత్రి పేర్ని నాని అన్నారు. 

ఆన్‌లైన్‌ టికెటింగ్‌ కోసం ఇన్‌పుట్స్‌ తీసుకొని, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్‌ కష్టాలు, టెక్నీషియన్స్‌ ఇబ్బందులు ప్రస్తుతం ఇండస్ట్రీ ఎలా ఉందనేది నిర్మాత బృందం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారన్నారు. నిర్మాతలు మాట్లాడిన ప్రతి మాటను.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగిందన్నారు. పవన్‌ కల్యాణ్‌ మాట్లాడిన మాటలపై చాలా మంది సినీ పెద్దలు విచారం వ్యక్తం చేశారన్నారు. చాలా మంది తనతో ఫోన్‌లో మాట్లాడారని, ఆ పొరపాటుతో తాము ఏకీభవించమని చెప్పారని గుర్తుచేశారు. తప్పకుండా మేము కూడా ఒక వ్యక్తి మాట్లాడిన మాటలను ఇండస్ట్రీ మాటలుగా తీసుకోవడం లేదని భరోసా కల్పించామని మంత్రి పేర్ని నాని చెప్పారు. వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడుతామని, వాస్తవాలు మాట్లాడాలని వారిని కూడా రిక్వస్ట్‌ చేశానన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. 
 

Back to Top