తాడేపల్లి: ప్రజాగ్రహ సభ అంటూ బీజేపీ ఏర్పాటు చేసిన సభ ...పెద్ద ప్రహసనంగా మారిందని రాష్ట్ర రవాణా, సమాచార, పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక ఎజెండా లేదని, చంద్రబాబు అజెండానే వారు పాటిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఎజెండా, సిద్ధాంతం, ప్రజా సమస్యలు, ప్రజావసరాల పట్ల దృష్టిపెట్టే ఆలోచన లేకుండా ఎక్కడ నుంచో పిలుపు వస్తుంది? ఇక్కడ సభ పెడతామంటారు. దానికో పేరు పెడతారు? ఎవరు ఎవరి మీద ఆగ్రహంగా ఉన్నారని ప్రశ్నించారు? భారతీయ జనతా పార్టీలో కొత్తగా టీడీపీ నుంచి వచ్చి, అక్కడ తీర్థం తీసుకున్నవారికి మాత్రమే వైయస్సార్ సీపీ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఆగ్రహం ఉన్నారు అంటే బాగుండేది. ప్రజలకు ఎందుకు ఆగ్రహం? ఎవరి మీద ఉండాలి ఆగ్రహం మీ మీదా?.. మా మీదా...? అంటూ నిలదీశారు. మంగళవారం వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్‌గారు సీఎం అయ్యాక బయట తిరగడం లేదు అంటున్నారే? మరి ప్రధానిగారు రోజూ అదే పనిమీద ఉంటున్నారా? ప్రధానిమంత్రి రోడ్డు మీదకు రావాలంటే ఎన్నికలు రావాలి. ఓట్లు కోసమే ఆయన రోడ్డుమీదకు వస్తారు. ఎవరు గురించి ఎవరు మాట్లాడతారు...? చంద్రబాబు ఎజెండా తప్పితే మీకంటూ ఒక ఎజెండా ఉందా? కొంతకాలంగా మోదీగారు భారతదేశంలో తప్పితే బయటే ఎక్కువ కనిపిస్తున్నారు కదా? బ్రాందీ బుడ్డి రేట్లు గురించి కాదు.. పెట్రో ధరలు తగ్గించండి బ్రాందీ బుడ్డి రేట్లు పెంచడం సిగ్గుచేటు అని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏపీలో బీజేపీ ప్రభుత్వం రాగానే రూ.75కే బ్రాందీ బుడ్డి ఇస్తారట. ఇది వారి గొప్ప ఎజెండా. ఎంత ముచ్చటగా ఉందంటే .. ఏమాత్రం సిగ్గుపడకుండా ఆనందంగా, తన్మయంతో చెబుతున్నారు. బీజేపీ నాయకులారా... బ్రాందీ బుడ్డి రేట్లు పెంచినందుకు కాదు మీరు మాట్లాడాల్సింది. దేశలో డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నందుకు మాట్లాడాలి. దానికి బాధపడండి. ఈరోజు జరుగుతున్న మీ తంతులో డీజిల్ రేట్లు ఏ సంవత్సరంలో ఎంతున్నాయి? ఇవాళ ఉంత ఉన్నాయో చెప్పండి? మీ సభలో 2014లో డీజిల్, పెట్రోల్ రేటు ఎంత ఉందో గురించి మాట్లాడండి. దేశంలో రూ.116కి పెట్రోల్‌ను, వందకు డీజిల్‌ను తీసుకువెళ్లింది మీరు కాదా? దాని గురించి మాట్లాడటం చేతకాక బ్రాందీరేట్లు పెరిగిపోయాయని బాధపడతారా? పెట్రోల్, డీజిల్ మీరు వాడటం లేదా? పెరిగిన ఎరువుల రేట్లు గురించి ఏనాడైనా బాధపడ్డారా? 2014లో ఎరువుల బస్తా రూ.800 ఉంటే ఇవాళ రూ.1700 చిల్లరకు వెళ్లింది. ఏడేళ్లలో డబుల్ కన్నా ఎక్కువగా ఎరువుల ధరలు పెంచేశారు. దానికి బాధలేదా మీకు? ఎరువులతో మీరు చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారమా..? - రైతుల ధాన్యం కొనబోమని, కొనటానికి సవాలక్ష ఆంక్షలు మీరు పెడతారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి కదా వాటి గురించి బాధపడండి. దేశంలో ఏ పంట ఎంత లభ్యత ఉంది? దేనికి కొరత ఉంది? అనేది కేంద్రం బాధ్యత కాదా? ధరల నియంత్రణ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదా? రాష్ట్ర ప్రభుత్వం కేవలం బ్లాక్ మార్కెటింగ్‌ను కంట్రోల్ చేయగలదు. రైతు వ్యతిరేక ప్రభుత్వం మీది.. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అని ఏ రైతును అడిగినా చెబుతాడు. వ్యవసాయంలో మొదలుపెట్టే సాగు నుంచి పంట అమ్ముకునేవరకూ రైతు గ్రామం బయటకు రాకుండా మా ప్రభుత్వం రైతుకు అన్ని సౌకర్యాలు కల్పించింది. రాష్ట్రంలోని రైతులంతా జగన్‌గారి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం అంటున్నారు. అదే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని దేశమంతా కోడైకూస్తోంది. దీనికి సమధానం చెప్పండి. - రైతు వ్యతిరేక చట్టాలుగా వ్యవసాయ చట్టాలను తయారు చేస్తే.. వాటిని రద్దు చేయాలని రైతులు నెలలుపాటు రోడ్లమీద ఉద్యమాలు చేస్తుంటే యూపీ, పంజాబ్‌లోనో ఎన్నికలు వస్తున్నాయంటే ఆ చట్టాన్ని వెనక్కి తీసుకున్నామని చెబుతారు. మళ్లీ త్వరలో ఆ చట్టం పెడతామని కేంద్రంలోని వ్యవసాయ మంత్రే అంటారు? దీనిపై మీకు బాధలేదా? - జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం మహిళా సాధికారిత ప్రభుత్వం అని ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలం. మీరు చెప్పగలరా? మహిళల అభ్యున్నతి కోసం మీరు ఏం చేశారు? రైతు సాధికారత కోసం ఈ రాష్ట్రంలో జగన్ గారి ప్రభుత్వం చేస్తున్నవాటిని నేర్చుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మంత్రులు, అధికారులు వస్తున్నారు. మరి మీరు ఏం చేశారో ఆ సభలో చెప్పండి. కేంద్రం అప్పులు రూ. 135 లక్షల కోట్ల మాటేమిటి..? బీజేపీలోని మేధావులుగా చెప్పుకునే వారు కొందరు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నదని మాట్లాడుతున్నారు. మరి, కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం అప్పులు చేయడం లేదా... ? ఏపీ ప్రభుత్వం తెచ్చిన ప్రతి పైసా అప్పుకు లెక్క ఉంది. ప్రతి రూపాయి ఎక్కడకు వెళ్లిందో మేం లెక్క చూపించగలం. ప్రభుత్వం తెచ్చే అప్పు రాష్ట్ర జీఎస్‌డీపీలో మూడు శాతం మించితే గోలగోల చేస్తున్నారు. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ మార్గదర్శకాలకు లోబడే ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. - భారతదేశం జీడీపీలో 21శాతానికి పైబడి అప్పున్న పరిస్థితి. దీనికి కారణం ఎవరు? దేశాన్ని ఆ స్థితికి తీసుకువెళ్లింది ఎవరో చెప్పాలి? దేశంలో అప్పు రూ. 135 లక్షల కోట్ల పైమాటే. 2014లో 62 లక్షల కోట్లు ఉంటే... ఇవాళ రూ. 135 లక్షల కోట్లకు పెరిగింది అంటే, గడిచిన ఏడేళ్లలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెచ్చిన అప్పు ఏకంగా రూ. 73 లక్షల కోట్లు. దాంట్లో రూ.4 లక్షల 27 వేల 925 కోట్లు విదేశీ రుణం. మీరు ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి మాట్లాడతారా? ఎంతో క్రమశిక్షణతో, ఆర్థిక చట్టాలను అతిక్రమించకుండా, పేద ప్రజల సంక్షేమం కోసం మేం రుణాలు చేస్తున్నాం. ఏం అధికారం ఉందని.. దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో ఉండే పార్టీని జాతీయ పార్టీ అంటారు. అటువంటి పార్టీకో విధానం ఉంటుంది. విచిత్రంగా, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇదెక్కడ విచిత్రం.. ? ప్రాంతీయ పార్టీ కూటమిలో జాతీయ పార్టీ అయిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఉండటం విడ్డూరంగా ఉంది. మరి బీజేపీని ఏమనాలి? జాతీయ పార్టీ అనాలా? ఉప ప్రాంతీయ పార్టీ అనాలా? ఏతావాతా ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు పెద్దమనుషులకు లీజ్‌కు ఇచ్చేశారా?, టీడీపీ నుంచి కొత్తగా వచ్చిన సుజనా చౌదరి, సీఎం రమేష్‌కు ఏపీ బీజేపీని లీజుకు ఇచ్చారా? లేదా? వాళ్ళే ఖర్చులు అంతా భరిస్తారు? వాళ్లు ఏం చెబితే అది తీర్మానాలు చేసి, వాళ్లు చెప్పినట్లు పార్టీని నడుపుతారా..? - పైకి మాత్రం జాతీయ పార్టీ అంటారు. మీ పాలసీని మాత్రం సుజనా చౌదరి, సీఎం రమేష్ లు డిసైడ్ చేస్తారా..? ఏ స్థాయిలో వీళ్లు డిసైడ్ చేయకపోతే, ఏపీలో బీజేపీని లీజుకు తీసుకోకపోతే, మితిమీరిన ఆ దమ్ము వారికి లేకుంటే అమిత్ షా చెప్పాల్సిన మాటలు వీళ్లు చెబుతారా? ఏపీలో పోలీస్ వ్యవస్థను సునిశితంగా టెలీస్కోప్ లో పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడ నుంచి అధికారులను రీకాల్ చేస్తారట? - ఏం అధికారం ఉందని, ఏ హోదాతో మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని లీజ్‌కు తీసుకున్నామనే దమ్ము, ధైర్యంతోనే కదా ఈ భాష వారు ఉపయోగిస్తున్నారు. అమరావతి స్కాం క్యాపిటల్ అన్నది మీరే కదా...? భారతీయ జనతా పార్టీ నాయకులే 2019 వరకూ అమరావతిని స్కామ్ క్యాపిటల్ అని మాట్లాడారు. ఇవాళ అదే స్కామ్ క్యాపిటల్‌ను తాము కాపాడతామని, పోరాడతామని మాట్లాడతారు. ఏం కాపాడతారు? ఏం పోరాడతారు? - ఆంధ్రప్రదేశ్‌కు చెంబుడు నీళ్లు, చిప్పడు మట్టి తమ మొహాన కొట్టారని చంద్రబాబు నాయుడు అన్నా... మీరు తుడుచుకుని వెళ్లిపోతారు. స్కామ్ క్యాపిటల్ అన్న మీరే... అమరావతిని బాగు చేస్తామని చెబుతున్నారు, ఏం చేస్తారో, ఎందుకు అలా అన్నారో చెప్పాల్సింది ఏపీ బీజేపీ నేతలే. - అమరావతిపై జగన్ మోహన్ రెడ్డిగారు గురించి మాట్లాడుతున్న మీరు.. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఏమి తిప్పిందో చెప్పండి? ఒక్క మడమేంటి మీరు వంట్లో తిప్పనిదేమైనా ఉందా? ఎన్నికలకు ముందు పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అని ప్రధాని మోడీనే చెప్పారు. దానిమీద ఈడీతో విచారణ చేయించవచ్చు కదా? బొంబాయిలో దొరికితే వదిలేస్తున్నారు కదా మీరు? ఎవరు లాలూచీ చేశారు? ఎవరు సరిపెట్టారు ఇవన్నీ...? - పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబుకు ఏటీఎం అని మోదీగారు అన్నారా.. లేదా? మరి ఆ పేటీఎం మీద ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు? విచారణ జరిపించాలి కదా? ప్రజాగ్రహ సభ అని పెట్టిన మీరు రాష్ట్ర విభజన హామీలను ఏమి అమలు చేశారు? ఎంతవరకూ అమలు అయ్యాయో చెప్పాలి కదా.. - పోలవరం ప్రాజెక్ట్‌ను తామే కడుతున్నామని బీజేపీ నాయకుడు ఒకరు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం కడుతుంటే దానికి అయ్యే ఖర్చును కేంద్రం ఆరకొరగా, అది కూడా ఏడిపించి ఇస్తున్నారు సరే. మరి డ్యామ్ కట్టాక గేట్లు మూసివేసి, నీళ్లు వదలాలి అంటే మునిగే ఊళ్లకు, జనాలకు డబ్బులు ఇవ్వరా? పోలవరం పునరావాస ప్యాకేజీ నిధులను మంజూరు చేయమని చెప్పండి. బీజేపీ సభలో పోలవరం ప్రాజెక్ట్‌లో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి డబ్బులు ఇవ్వమని కేంద్రంపై గట్టిగా మాట్లాడండి. అసలు మాట్లాడటం చేతవచ్చా మీకు? దానిమీద మాట్లాడగలరా? మాట్లాడతారో, లేదో చూద్దాం. - ప్రాజెక్ట్ కడితే సరిపోదుకదా. దానిలో నీళ్లు ఉండాలంటే గేట్లు మూయాలి కదా. దానివల్ల ఊళ్లు మునిగిపోతే ఆ గ్రామాల్లో ఉన్నవారికి పరిహారం ఇవ్వాలి కదా. దానికి డబ్బులు ఎవరు ఇస్తారు?అది విభజన చట్టంలో హామీకదా. దానికోసం మీరు గొంతు ఎత్తి మాట్లాడరా? - బ్రాందీ బుడ్డి రేటు తగ్గించాలని మాత్రమే మాట్లాడతారా? బ్రాందీ బుడ్డి మీద ఉన్న మమకారం రాష్ట్ర ప్రజల సమస్య పరిష్కారం మీద లేదా అని అడుగుతున్నాం. మీకు చేతనైతే ఢిల్లీ వెళ్లి ఆ ప్యాకేజిని తీసుకురావాలని అడుగుతున్నాం. - బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు పెడతామని చెప్పారు కదా? రెండున్నరేళ్లు దాటిపోతుంది కదా? దీని మీద కూడా మాట్లాడండి. ఎవరికో ఆగ్రహం అన్నారు కదా? ప్రజలకు కాదు మీకు ఆగ్రహం మాత్రమే. దీనిమీద కూడా మాట్లాడండి. కర్నూలులో హైకోర్టు పెట్టాలని ప్రధానమంత్రిగారిని, అమిత్ షా గారిని అడుగుతారో లేదో చూస్తాం. టీడీపీ ప్రేరేపిత భావజాలం వ్యక్తపరిచే సభ ఇది నూటికి నూరుపాళ్లు తెలుగుదేశం అంటే నరనరానా జీర్ణించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని లీజుకు తీసుకున్న ఇద్దరు రాజకీయ నాయకుల ప్రేరేపిత... టీడీపీ భావజాలం వ్యక్తపరిచే సభ తప్పితే మరొకటి కాదు. ఆఖరికి బీజేపీ సభకు జనం రాకుంటే.. వారిని పంపించే బాధ్యత కూడా చంద్రబాబు తీసుకున్నారు. - ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సీపీఐ, జనసేన... ఏ పార్టీ అయినా జెండాలు వేరు కానీ... ఆ జెండాల కర్ర మాత్రం పసుపు పచ్చ కర్రే. ఆ జెండాను ఎగురవేసే ప్రయత్నం చేస్తున్నది, నిలబెట్టే ప్రయత్నం చేసేది నూటికి నూరుపాళ్లు చంద్రబాబు నాయుడు అనేది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. - సాధారణంగా బీజేపీ, కాంగ్రెస్ లు భిన్న ధృవాలు. ఒకే వేదిక మీదకు రావు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వీళ్ళంతా ఒకటే అంటున్నారు. తిరుపతి సభలోనే ఇది అందరం చూశాం. బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన అందరూ ఆలింగనం చేసుకుంటున్నారు. - చంద్రబాబు పెద్ద మ్యానిప్లేటర్ అని మోదీగారు ఎప్పుడో సర్టిఫికేట్ ఇచ్చారు. బాబు నయవంచనకు మారుపేరు అని ఎన్టీఆర్‌గారు కూడా సర్టిఫికెట్ ఇచ్చారు. బ్రాందీ బుడ్డిపై ఉన్న మమకారం... బ్రాందీబుడ్డి రేట్లు పెరిగిపోతున్నాయని బీజేపీ నాయకులు బాధపడుతున్నారే కానీ... రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లలో విద్య అందని ద్రాక్షగా మారిపోతోంది. స్కూల్ ఫీజులు లక్షల్లోకి వెళ్లిపోయాయి. ఇంటర్ కాలేజీ ఫీజులు లక్షల్లో కట్టించుకుంటున్నారు. సామాన్య మానవుడికి చదువు ప్రభుత్వ పాఠశాలల్లో తప్పితే బయట అందని ద్రాక్షే అని వీరు ఒక్కమాట మాట్లాడటం కూడా చేయరు. రేట్లు పెంచేశారంటూ బ్రాందీ బుడ్డీ మీద మాత్రం మమకారరమా..? - అడ్డగోలుగా పెంచేసిన కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులను నియంత్రించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ప్రయత్నిస్తుంటే పేదలకు ఒక్కమాటైనా అనుకూలంగా మాట్లాడుతున్నారా? మీ తంతులో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు చదువును వ్యాపారం చేస్తున్నారు, లాభాపేక్ష లేకుండా విద్యా అభివృద్ధికి పనిచేసేలా, సామాన్యలకు అందుబాటులో ఉండేలా ఫీజులు తగ్గించాలని మీ సభలో మాట్లాడండి. మేము కూడా చప్పట్లు కొడతాం. బ్రాందీ బుడ్డి రేట్లు పెరిగిపోయాయని, సినిమా టికెట్ల రేట్లు తగ్గిపోయాయనే మీ బాధ. మీకు కావల్సిందల్లా బ్రాందీ బుడ్డి రేట్లు తగ్గించాలి... సినిమా టికెట్ల రేట్లు పెంచకూడదన్నదేనా. ఎవరి కోసం మాట్లాడతారు మీరు? ప్రజల గురించి ఆలోచించరా? మాట్లాడరా? - జగన్ గారి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఒక పాలసీ తెస్తే.. దాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు ఏం మాట్లాడితే.. బీజేపీ నేతలు కూడా అదే మాట్లాడతారు. పేదవాళ్లకు మేలు జరిగేలా, వారిలో ఆత్మస్థైర్యం నింపే ఓటీఎస్ పథకం మీద కూడా బాబు ఏది మాట్లాడితే వీళ్లు అదే ఫాలో అవుతారు. వీళ్లకో స్టాండ్, పాలసీ అనేదే లేదా? ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు రావణాసురుడు లాంటివాడు అయితే ఆయనకు ఉన్న తలల్లో బీజేపీది ఒక తల అయితే, సీపీఐ, జనసేన, కాంగ్రెస్ పార్టీ ఒకొక్క తల అయితే... ఇలా మిగతావాటిని కూడా పేర్చుకుంటూ వెళ్లే దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వ్యక్తి. రాజకీయ రావణాసుడులాంటి చంద్రబాబుకు ఉన్న తలల్లో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా ఒక తలే. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయాన్ని సునిశితంగా, ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మాట్లాడారు. ఏంటి దుర్మార్గం. విజభన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని మీరు మాట్లాడరా? ఏపీకి అయిదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అప్పట్లో రాజ్యసభలో వెంకయ్యనాయుడు మాట్లాడారని ఆయనకు సన్మానాలు కూడా మీరు చేశారే? మోదీగారు తిరుపతిలో వెంకన్నపాదాల సాక్షిగా హోదా పాట పాడారు. అయిదు కావాలా? ఆరు కావాలా? ఏడు కావాలా? పది కావాలా? అని, మరి మీకు ఏమైంది..? మనకేమో మొండిచేయి చూపించి... బిహార్ విషయంలో పరిశీలిస్తామని చెబుతారా? మరి నీతి ఆయోగ్ చైర్మన్‌తో మాట్లాడించింది బీజేపీ కాదా? ఆంధ్రప్రదేశ్ గురించి మీరు ఒక్కరోజు అయినా మాట్లాడారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ డ్రామాలు చూడలేకపోతున్నారు. 39మంది బలిదానాలతో ఏర్పడ్డ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెగనమ్ముతామంటే మీరు మాట్లాడారా? మీ నోటికి తాళాలు ఎందుకు పడ్డాయో ఏపీ బీజేపీ శాఖ చెప్పాలి? మీ పార్టనర్ అని చెప్పే ఆ వ్యక్తి చంద్రబాబు కోసం డమ్మీ, దొంగ సభలు పెడతాడు. జగన్ మోహన్ రెడ్డిగారు, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కేంద్రానికి లేఖలు రాశారా అని సమాచార హక్కు చట్టం కింద ఓ విలేకరి అడిగితే... జగన్‌గారు, చంద్రబాబు లేఖలు రాశారు.. వారికి సమాధానం ఇచ్చేశాం. పవన్ కల్యాణ్ లేఖ రాయలేదని చెప్పారు. మరి ఇదే పవన్ కల్యాణ్ మంగళగిరి మీటింగ్‌లో చాలా చాలా చెప్పారు కదా మరి ఏమైంది? లేఖ రాస్తే కదా కనిపించడానికి? పవన్ ది అంతా మోసం, దగానే కదా..? అతి హేయంగా, దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆక్షాంక్షలను ఇంత కిరాతకంగా మీ రాజకీయాల కోసం చీల్చి చెండాడవద్దని... ఏపీ బీజేపీకి సూచిస్తున్నాం. మీకు నోరుంటే... మాట్లాడలనుకుంటే మీరు పెట్టింది నిజంగా ప్రజాగ్రహ సభ అయితే అందులో పెరిగిన డీజిల్, పెట్రోల్, యూరియా రేట్లు గురించి, అలాగే నిత్యావసర వస్తువుల ధరల గురించి, ప్రత్యేక హోదా గురించి, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయవద్దని మట్లాడండి. అంతేకానీ మీ రాజకీయాల కోసం ఊకదంపుడు ఉపన్యాసాలతో జగన్ మోహన్ రెడ్డిగారి మీద విషం చిమ్మేటువంటి మాటల వల్ల, చంద్రబాబు మాట్లాడమన్నదల్లా, సుజనా చౌదరి, సీఎం రమేష్ లతో చీటీలు రాసి పంపిస్తే... వాటిని మాట్లాడితే మీ పరువే బజారున పడుతుంది. బ్లాక్‌మెయిల్ చేసింది ఎవరు? భారతీయ జనతా పార్టీది.. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు నడిపేవారిని నడిరోడ్డుపై నిలబట్టే లెక్కేగనుక అయితే చంద్రబాబు నాయుడును ఎందుకు వదిలేశారు? ఆయనను ఎందుకని బజారులో పెట్టలేదు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి, కేంద్రంలో అధికారం అనుభవించి, కేవలం ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు బ్లాక్‌మెయిల్ చేసింది ఎవరు? అటువంటి బాబును ఏం చేశారు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతల మాటలకు అర్థాలే వేరయా... - బీజేపీ, టీడీపీలు డ్రామాలు ఆడుతున్నాయి. పిల్లిమొగ్గలు వేయడం, పూటకు ఒక మాట మాట్లాడటం చంద్రబాబు నైజం. గడిచిన రెండున్నరేళ్లుగా చంద్రబాబు నాయుడు స్టేట్‌మెంట్లు, టీడీపీ నాయకుల ప్రసంగాలు చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. తెలుగుదేశం, చంద్రబాబుకు మక్కీకి మక్కీ అన్నట్టు భారతీయ జనతా పార్టీ నేతలు పొల్లుపోకుండా, భావంలో కూడా తేడా లేకుండా అదే మాట్లాడతారు. చంద్రబాబు ఏం మాట్లాడితే సీపీఐ రామకృష్ణ, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నేతలు, పవన్ కల్యాణ్ మాట్లాడతారు. సినిమా డైలాగ్‌లాగా ‘భాష ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు’గా చంద్రబాబు మాట్లాడగానే టపాటపా ఆ పార్టీల నాయకులు అవే మాట్లాడతారని పేర్ని నాని వ్యాఖ్యానించారు.