ఆర్టీసీ కార్మికుల కల నెరవేరబోతుంది

రవాణా శాఖ మంత్రి పేర్ని నాని
 

తాడేపల్లి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ రవాణా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి అధ్యక్షతన సీఎం వైయస్‌ జగన్‌ కమిటీని నియమించారని చెప్పారు. ఆ కమిటీ చైర్మన్‌ ఆంజనేయరెడ్డి సీఎం వైయస్‌ జగన్‌కు నివేదిక అందజేసిందన్నారు. నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ముఖ్యమంత్రి ఆమోదించారని మంత్రి నాని స్పష్టం చేశారు. ప్రభుత్వం దానిపై రేపు నిర్ణయం కూడా తీసుకుంటుందని వివరించారు. 

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు అనే డిపార్టు్టమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆ డిపార్టుమెంట్‌లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవడం జరుగుతుందన్నారు. మిగిలిన విధి విధానాలన్నీ త్వరలో ఖరారవుతాయన్నారు. దశాబ్దాలుగా ఉద్యోగ భద్రత లేకుండా ఆర్టీసీలో కార్మికులు పనిచేస్తున్నారని, సుదీర్ఘకాలంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల కల నెరవేరబోతుందని మంత్రి నాని చెప్పారు. ప్రతి సంవత్సరం ఆర్టీసీ మీద ఉన్న జీతభత్యాల భారం సుమారు రూ. 3,300 నుంచి రూ. 3,500 కోట్లు ఉందని, దాన్ని వైయస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకోబోతుందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన చేస్తున్నారన్నారు.

Back to Top