దొంగ ఓట్ల చరిత్ర చంద్రబాబుదే

దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చంద్రబాబు తీరు

విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కుప్పం: దొంగ ఓట్ల చరిత్ర చంద్రబాబుది.. దొంగ ఓట్లతోనే కుప్పంలో చంద్రబాబు గెలుస్తూ వచ్చాడని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని కుప్పం రూరల్‌ మండలంలో మూడో రోజు పల్లె బాట కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. మొత్తం 8 గ్రామ పంచాయతీల పరిధిలో పర్యటించి ప్రజలతో మమేకమవుతూ వైయస్‌ జగన్‌ ప్రభుత్వ సంక్షేమ పాలన గురించి వివరించారు. మంత్రి పెద్దిరెడ్డి వెంట ఎమ్మెల్సీ కే.ఆర్‌.జే. భరత్, ఎంపీ ఎన్‌ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఉన్నారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్‌ వ్యవస్థలను నెలకొల్పి పారదర్శకమైన పాలనను సీఎం వైయస్‌ జగన్‌ అందిస్తున్నారని చెప్పారు. దళారీలు లేకుండా సంక్షేమ సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేస్తున్నారన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందించి వారికి ఇళ్లు నిర్మిస్తున్నారని చెప్పారు. 

పేద ప్రజలకు మంచి జరుగుతుంటే చూసి తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వంపై బురదజల్లుతున్నాడని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. దొంగ ఓట్ల చరిత్ర చంద్రబాబుదేనని, 2019కి ముందు రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు నమోదు చేయించాడన్నారు. ఇప్పుడు చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. కుప్పంలో ఇప్పటికీ దొంగ ఓట్లు ఉన్నాయని, దొంగ ఓట్లను తొలగించి ఎన్నికల కమిషన్‌ ప్రక్షాళన చేస్తోందన్నారు. 
 

Back to Top