మానవ మనుగడకు అడవులే అత్యంత కీలకం

అడవుల సంరక్షణకు సీఎం వైయస్ జగన్ అత్యంత ప్రాధాన్యత

ప్రస్తుతం 23 శాతం ఉన్న అటవీ విస్తీర్ణంను 33 శాతంకు పెంచాలనేదే లక్ష్యం

రాష్ట్రానికి ఎర్రచందనం ఒక అపూర్వమైన వరం

ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఉక్కుపాదంతో అణివేస్తున్నాం

రాష్ట్రంలో పులులు, ఏనుగుల సంఖ్య పెరగడం శుభపరిణామం

కొత్త సాంకేతికతతో వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలి

ఒక్క ఎకరం అటవీభూమి కూడా అన్యాక్రాంతం కాకూడదు

ఇకపై ప్రతి ఏటా ఇటువంటి రాష్ట్రస్థాయి సదస్సులు

అటవీశాఖ రాష్ట్రస్థాయి కాన్ఫ‌రెన్స్‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విజయవాడ: రాష్ట్రంలో అడవుల సంరక్షణకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, శాస్త్రసాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 23 శాతం ఉన్న అడవుల విస్తీర్ణంను 33 శాతంకు పెంచాలని గత ఆగస్టు 5వ తేదీన జగనన్న పచ్చతోరణం ప్రారంభం సందర్భంగా సీఎం వైయస్ జగన్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. విజయవాడలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సెమినార్ ముగింపు కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... అటవీ అధికారును కార్యోన్ముఖులను చేస్తూ, మార్గదర్శకం చేసే ఇటువంటి సెమినార్లు ప్రతి ఏడాది జరగాలని అన్నారు. కరోనా వల్ల సెమినార్లకు కొంత ఇబ్బంది ఏర్పడిందని, ఇకపై ప్రతి ఏటా ఈ సెమినార్లు నిర్వహిస్తామని తెలిపారు. 

మానవాళి మనుగడకు అడవులు అత్యంత కీలకమని అన్నారు. ఇతర దేశాల్లో ప్రభుత్వాలు అడవుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. మనదేశంలోనూ అటవీప్రాంత పరిరక్షణకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. మన రాష్ట్రంలోనూ అటవీ విస్తీర్ణం పెంచేందుకు అధికారులు చిత్తశుద్దితో కృషి చేయాలని కోరారు. 

మన రాష్ట్రంలో అపూర్వమైన ఎర్రచందనం వృక్షాలు విస్తారంగా ఉన్నాయని అన్నారు. విలువైన ఎర్రచందనం చెట్లను స్మగ్లర్ల బారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఆనాడు స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు కీలక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎర్ర చందనం విస్తరించిన 24 డివిజన్ లకు 1+4 పోలీస్ ఫోర్స్ ను నియమించడం, నూతనంగా 300 కొత్త వాహనాలను అటవీ సిబ్బందికి సమకూర్చానని తెలిపారు. దానివల్లే ఎర్రచందనంపై నిఘా పెరగడం ప్రారంభమైందని తెలిపారు. 

ఎర్రచందనాన్ని ఆదాయవనరుగా మార్చుకుని స్మగ్లర్లు ఎంతకైనా తెగించి మరీ అక్రమ రవాణా చేస్తున్నారని, దీనిని ఉక్కుపాదంతో అణచివేయాలని కోరారు. ఎర్రచందనం రాష్ట్ర సరిహద్దులు దాటి విదేశాలకు ఎగుమతి అయ్యే పరిస్థితిని పూర్తిగా అరికట్టాలని అన్నారు. అలాగే తిరుపతిలో ఏర్పాటు చేసిన బయోట్రిమ్ ద్వారా పట్టాభూముల్లో ఎర్రచందనం మొక్కల పెంపకంను ప్రోత్సహించాలని కోరారు. నర్సరీలను ఏర్పాటు చేసి ఎర్రచందనం మొక్కలను పెంచేలా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. 

రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ నిషేదంపై సీఎం వైయస్ జగన్ సీరియస్ గా ఉన్నారని అన్నారు. ఇప్పటికే ఫ్లెక్సీ బోర్డ్ లను నిషేదించారని, క్లాత్ బోర్డ్ లు మాత్రమే వాడాలని ఆదేశించారని గుర్తు చేశారు. తిరుమలలో ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేదించారని అన్నారు. శ్రీశైలం లోనూ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, వాటిని రీసైక్లింగ్ కు బయటకు పంపుతున్నారని అన్నారు. పర్యావరణానికి మేలు చేసే ఇటువంటి చర్యలను ప్రోత్సహించాలని, గతంలోనూ తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ కింద పెద్ద ఎత్తున అవెన్యూ ప్లాంటేషన్ చేయించానని గుర్తు చేశారు. మైనింగ్ తో అడవులకు నష్టం జరగకుండా మైనింగ్ వ్యవధి ముగిసే లోపు గనుల యజమానులతో అడవుల అభివృద్ధికి ప్రత్యేక సెక్యూరిటీ డిపాజిట్ ను సేకరిస్తున్నామని తెలిపారు. 

వన్యప్రాణుల సంరక్షణ, పరిరక్షణలో రాష్ట్రం ముందు వరసలో ఉందని అన్నారు. దేశంలోనే అతిపెద్ద విస్తీర్ణంతో ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యంలో 75 పులులు ఉన్నాయి. శ్రీకాకుళం, శేషాచలం, కౌండీన్య రిజర్వ్ ఫారెస్ట్ లో ఏనుగుల సంతతి పెరుగుతోందని తెలిపారు. మన రాష్ట్రంలో 3 జాతీయ అటవీ పార్క్ లు, 11 అభయారణ్యాలను వన్యప్రాణి విభాగం ద్వారా పర్యవేక్షిస్తున్నామని అన్నారు.  ఇటీవల కాలంలో ఏనుగులు జనావాసాల మీదకు వస్తున్నాయని, వాటిని అటవీ ప్రాంతాలకు పంపేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్క్షానంపై దృష్టి సారించాలని కోరారు. 

రాష్ట్రంలో 28 నగరవనాలు నిర్మించడం జరిగిందని,  అలాగే పచ్చర్ల, బైర్లూటి, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో ఎకో-టూరిజంను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అటవీశాఖను బలోపేతం చేసేందుకు 32 ప్రాదేశిక, 12 సామాజిక అటవీ విభాగాలను, 14 ఫంక్షనల్, స్పెషల్ విభాగాలుగా పునర్ వ్యవస్థీకరించామని తెలిపారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం ద్వారా అటవీ భూముల సరిహద్దులను నిర్ధిష్టంగా గుర్తిస్తున్నామని, ఎక్కడైనా ఆక్రమణలు జరిగితే వాటిని గుర్తించేందుకు రెవెన్యూ-అటవీశాఖల సంయుక్త సర్వే కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అటవీశాఖ అధికారులు సీరియస్ గా తీసుకోవాలని కోరారు. అటవీభూములను కాపాడుకునేందుకు అందరికంటే ముందంజలో ఉండి పనిచేస్తున్న తిరుపతి సిపిఎఫ్ నాగేశ్వరరావు, చిత్తూరు డిఎఫ్ఓలను అభినందించారు. 

సీఎం వైయస్ జగన్ అడవుల అభివృద్ది, పర్యావరణ సమతూల్యతను కాపాడేందుకు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, అందుకోసం బాధ్యతాయుతంగా భవిష్యత్ తరాలకు ప్రకృతి ప్రసాదించే వరాలు అందేలా చూడాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. 

తాజా వీడియోలు

Back to Top