సత్తా లేకే.. పొత్తుల కోసం చంద్రబాబు పాకులాట

పవన్‌ ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో ప్రజలకైనా స్పష్టత ఇవ్వాలి

బాబు, పవన్‌ తోడుదొంగలని ప్రజలందరికీ తెలుసు

విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సచివాలయం: ఒంటరిగా పోటీ చేసే సత్తాలేదు కాబట్టే పొత్తుల కోసం చంద్రబాబు పాకులాడుతున్నాడని, అన్ని పార్టీలతో పొత్తుపెట్టుకోవాలని బాబుకు సూచిస్తున్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు, పవన్‌ తోడు దొంగలని ప్రజలందరికీ తెలుసు అని, పవన్‌ ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో ప్రజలకైనా స్పష్టత ఇవ్వాలన్నారు. విజయవాడలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మీద ప్రజలకు విశ్వాసం లేదన్నారు. అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడన్నారు. 

చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని వచ్చినా.. వైయస్‌ఆర్‌ సీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని 2019 కంటే గొప్ప మెజార్టీతో అధికారంలోకి వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ప్రజల్లో ఎనలేని అభిమానం ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఏ విధంగా సేవలందిస్తున్నారో.. సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. 2024 ఫలితాలు చూసైనా చంద్రబాబు రాజకీయాల నుంచి వైదొలుగుతాడని భావిస్తున్నానన్నారు. 

పవన్‌ కల్యాణ్‌ చాలా పెద్ద నాయకుడు అని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్న పవన్‌.. చంద్రబాబుతో కూడా పొత్తుపెట్టుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని మాట్లాడుతున్నాడని, ముగ్గురు కలిసి పోటీ చేస్తారా..? లేక బీజేపీని వదిలి టీడీపీతో కలిసి పోటీ చేస్తాడా..? అనేది ప్రజలకు పవన్‌ కల్యాణ్‌ క్లారిటీ ఇవ్వాలన్నారు. చంద్రబాబు, పవన్‌ ఒకరికొకరు తోడు దొంగల మాదిరిగా పనిచేస్తున్నారని ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైందన్నారు. 
 

Back to Top