తిరుపతిలో భారీ మెజార్టీతో గెలుస్తాం

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా

నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలో తిరుపతి ఉప ఎన్నిక వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తికి మద్దతుగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్య, మేరుగ నాగార్జున, పార్టీ నేతలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి డాక్టర్‌ గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. 

అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉందన్నారు. డిపాజిట్లు రావని తెలిసే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బహిష్కరణ డ్రామా ఆడుతున్నారన్నారు. నామినేషన్లు, ఉప సంహరణ అయిపోయి.. పోలింగ్‌కు 5 రోజులు ఉండగా బహిష్కరణ ఏంటీ.. అని చంద్రబాబును ప్రశ్నించారు. బహిష్కరణ అంటూనే వారికి బలం ఉన్న చోట్ల టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారన్నారు. మొదటి నుంచీ చంద్రబాబుది రెండుకళ్ల సిద్ధాంతం, రెండు నాల్కల ధోరణే అని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. 
 

Back to Top