పేదల‌ ఇళ్లను సమాధులనటానికి నోరెలా వచ్చింది..?

చంద్ర‌బాబుపై మంత్రి మేరుగు నాగార్జున ధ్వ‌జం

పేదల పట్ల మదమెక్కి మాట్లాడుతున్న బాబు రాజకీయాలకు అనర్హుడు

క్లాస్‌వార్‌లో వైయ‌స్ జగన్‌ది పేదలపక్షం.. చంద్ర‌బాబుది పెత్తందార్ల పక్షం

పెత్తందార్ల భావజాలంతో విర్రవీగుతున్న చంద్ర‌బాబును పేదలు నిలదీయాలి

బాబు బతుకంతా పేదల్ని అణగదొక్కడమే.. అందుకే బడుగులకు వ్యతిరేకిగా మిగిలాడు

స‌చివాల‌యం: పేదవాళ్లకు ప్రభుత్వం ఇచ్చే భూమిని సమాధులతో పోల్చడానికి చంద్ర‌బాబుకు నోరెలా వచ్చింది..?  అహంకారం, పెత్తందారీ మదం నెత్తికెక్కిందా..? అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వ‌జ‌మెత్తారు. పేద‌ల ప‌ట్ల మ‌ద‌మెక్కి మాట్లాడుతున్న చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కు అన‌ర్హుడు అని మండిప‌డ్డారు. పేదలు కట్టుకునే ఇళ్లు సమాధులైతే.. పేదల కాలనీలు స్మశానాలైతే చంద్రబాబు ఈ రాష్ట్రంలో పేదలు నివసించే ప్రాంతాల్లోకి వెళ్లి ఇదే విధంగా నోరుమెదపగలడా..? అని ప్రశ్నించారు.  చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి మేరుగు నాగార్జున మండిప‌డ్డారు. స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశం ఆయ‌న మాట్లాడారు.  

మంత్రి మేరుగు నాగార్జున ఇంకా ఏం మాట్లాడారంటే..
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఆయన ఆలోచన సరళి పేదలను అణగదొక్కుతూ, వారిని అవహేళన చేస్తూనే సాగింది. రాజకీయాల్లో కులప్రస్తావన తెచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సందర్భానుసారం తూలనాడి వారిని మానసికంగా, సామాజికంగా కుంగదీసిన నాయకుడు చంద్రబాబు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో ఉండి పేదల పట్ల ఇలాంటి నీచమైన మనస్తత్వం ఉన్న చంద్రబాబు అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజకీయాలకు అవసరమా..? అని  ప్రశ్నిస్తున్నాను. ఓట్లు అవసరానికి మాత్రమే పేదల్ని వాడుకోవాలని.. వారి అవసరాల్ని తీర్చడంలో మాత్రం దూరంగా ఉంచాలనే ఆలోచన సరళి గల చంద్రబాబు రాజకీయాలకే అనర్హుడుగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నాను. 

పేదలకు ఇళ్ల స్థలాలివ్వరాదని కోర్టులకెక్కడమేంటి..?
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక పేదలకు సంబంధించి ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబం ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఆమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు లేని నిరుపేదలకు 30 లక్షలకు పైగా మా ప్రభుత్వం ఇళ్లు ఇస్తున్నప్పుడు చంద్రబాబుకు కన్నుకుట్టింది. పేదవారికి ఎట్టిపరిస్థితుల్లో నివాసానికి ఇల్లు ఉండరాదని కంకణం కట్టుకున్న విధంగా చంద్రబాబు తన పెత్తందార్లతో కేసులు వేయించి, కోర్టులకెక్కి మోకాళ్లు అడ్డుపెట్టించాడు. చివరికి  రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే ఇక్కడ డెమోగ్రఫిక్ ఇం బ్యాలెన్స్‌ వస్తుందంటూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటీషన్లు వేయించాడు. ఆఖరికి సుప్రీంకోర్టు రెండ్రోజుల కిందట్నే బాబు అండ్‌ కో టీమ్‌కు మొట్టికాయలు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాజ్యాంగ బద్ధంగా పేదలకు ఇళ్లు కల్పించడమనేది ప్రభుత్వ బాధ్యత అని.. ఈ విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందని స్వయంగా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.  

పేదలకిచ్చే ఇంటి స్థలాన్ని సమాధి అంటావా..?
పేదలకు ఇంటి జాగా ఇవ్వడంపై స్వయంగా సుప్రీంకోర్టు మొట్టికాయలేసినా కూడా... చంద్రబాబు పెత్తందారీ ఫ్యూడలిజం మనస్తత్వంలో ఎక్కడా మార్పు రాలేదు. సుప్రీం తీర్పుపైన, పేదలకు మా ప్రభుత్వం ఇళ్లు ఇవ్వడంపైనా తన ఎల్లో గ్యాంగ్ తో ఏదోరకంగా మాట్లాడిస్తూనే ఉన్నాడు. ఆయన కూడా ఏమాత్రం సిగ్గూ, ఎగ్గు లేకుండా పేదల పట్ల ఆయన వ్యతిరేక భావజాలాన్ని తెలియజేస్తూనే ఉన్నాడు. చివరికి నిన్న పెందుర్తి సభలో బాబు అహంకారం వెర్రితలలేసింది. పేదవాళ్లకు ప్రభుత్వం ఇచ్చే భూమిని సమాధులతో పోల్చాడు ఈ చంద్రబాబు. ఈ మాట మాట్లాడటానికి ఆయనకు నోరెలా వచ్చింది.. ఏంటి, నీ అహంకారం..? మీ పెత్తందారీ మదం నెత్తికెక్కిందా..?  అని అడుగుతున్నాను.
 
పేదల పల్లెల్లో బాబు నోరుమెదపగలడా..?
చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఉన్నతవర్గాల్లోని పేదవారికి అందాల్సిన హక్కులు, సదుపాయాల పట్ల అప్పటి ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి. బాబు ముఖ్యమంత్రిగా ఉండి,  ఎస్సీ, ఎస్టీలను ఉద్దేశించి, దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా..? అని కించపరిచినట్లు మాట్లాడాడు. ఈరోజు పేదవాళ్లకు ఇళ్లు ఇవ్వాల్నా..? అని బాబు అంటున్నాడు. ఆయన మదం వెర్రితలలేసి పేదోడి ఇంటి స్థలాలను సమాధులతో పోల్చుతున్నాడు. పేదలు కట్టుకునే ఇళ్లు సమాధులైతే.. పేదల కాలనీలు స్మశానాలైతే చంద్రబాబు ఈ రాష్ట్రంలో పేదలు నివసించే ప్రాంతాల్లోకి వెళ్లి ఇదే విధంగా నోరుమెదపగలడా..? అని ప్రశ్నిస్తున్నాను. 

బాబుది సామాజిక రుగ్మత
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా పేదలకు సెంటు భూమి అయినా ఇంటి స్థలం కేటాయించాడా..? అని సూటిగా అడుగుతున్నాను. ఆయన హయాంలో వామపక్షాలు, ఇతర ప్రజాసంఘాలు కలిసి పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలంటూ వీధిపోరాటాలు చేసింది మనమందరం చూశాం కదా..? 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో అర్హులైన పేదలకు ఎంతమందికి ఇళ్లు ఇచ్చాడో చంద్రబాబు సమాధానం చెప్పగలడా..? పేదవాడు ఇల్లు లేకుండా ఉండకూడదని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతి పేదవాడికి నివాసం ఏర్పాటు చేస్తుంటే,  చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట.. ?. చంద్రబాబుకు సామాజిక రుగ్మత ఉంది. అందుకే, పేదల ఇళ్లపై రకరకాలుగా మాట్లాడుతూ మాట్లాడిస్తున్నాడు. అసలు, పేదల పట్ల బాబు ఆలోచన ఏంటి అని ప్రశ్నిస్తున్నాను. ఆయనొక దళితద్రోహి, బీసీ ద్రోహి, మైనార్టీ వ్యతిరేకి, బహుజనుల మోసగాడు.. మొత్తానికి బాబు పేదలకు వ్యతిరేకి అనేది నిరూపించుకున్నాడు. 

పేదల వాటాను బాబు పందికొక్కులు మేశాయి 
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పేదలకు, అణగారిన వర్గాలకు ఏ మేలు చేయలేకపోయాడు. బాబు పరిపాలనలో బాగుపడేదంతా ఆయన వర్గీయులే తప్ప సామాన్యులు కాదు. బాబు పాలనలో ప్రతి అడుగూ పేదలను అణగదొక్కడమే. పేదల్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయల్ని కాజేశాడు. బాబు హయాంలో అగ్రవర్ణాలు, పెత్తందార్లు కలిసి రాజ్యాంగబద్ధంగా పేదలకు రావాల్సిన వాటా ధనాన్ని అన్యాక్రాంతంగా పందికొక్కుల్లాగా తిన్నారు. ఆయన రాజకీయ జీవితమే పేదోళ్లను కొట్టి పెత్తందార్ల కడుపునింపే మనస్తత్త్వంతో సాగింది. 

క్లాస్‌వార్‌లో వైయ‌స్‌ జగన్‌ పేదలపక్షం
ఈరోజు రాష్ట్రంలో పేదలు, పెత్తందార్ల మధ్య క్లాస్‌వార్‌ నడుస్తుందనేది ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పింది అక్షరసత్యం. చాన్నాళ్ల తర్వాత మరలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆదుకునే నాయకుడు వైయ‌స్‌ జగన్‌ రూపంలో దొరికితే.. ఆయన మాకు అన్నిరకాలుగా సాయం అందిస్తుంటే, దాని మీద చంద్రబాబు వక్రభాష్యాలేంటి..? అసలు, పేదవాడి పేరెత్తే అర్హత చంద్రబాబుకు ఉందా..? అని అడుగుతున్నాను. గతంలో బాబు పేదోళ్లకు ఎన్ని ఆశలు పెట్టాడు..? అధికారంలోకి రాగానే పేదలను, బడుగులను నోటికొచ్చినట్లు మాట్లాడి తోకలు కత్తిరిస్తానని, తోలు తీస్తానని బెదిరించింది వాస్తవం కాదా..? అందుకనే ఆయన్ను 2019లో ఓడించారు. మరి, ఈరోజు వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలు చూడకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఉన్నతవర్గాల్లోని పేదవాళ్లంతా తన ప్రజలుగా మేలు చేస్తూ, ఈ వర్గాలకు అండగా ఉన్న నాయకుడు మా వైయ‌స్‌ జగన్‌. అందుకే, ఇప్పుడు జరుగుతున్న క్లాస్‌వార్‌లో వైయ‌స్‌ జగన్‌ పేదలపక్షం నాయకుడుగా భావిస్తున్నాం. 

తనది పెత్తందార్ల పక్షమని బాబు చెప్పగలడా..?
క్లాస్‌వార్‌లో వైయ‌స్‌ జగన్‌ పేదల పక్షమైతే, చంద్రబాబు ఒక దొంగ. అన్నిరకాలుగా దొరికినటువంటి ఒక గజ దొంగ. ఆయన పరిపాలనలో అబద్ధాలు, మోసాలు, దగాలతో మభ్యపెట్టాలనే ఆలోచనతోనే రాజకీయాలు చేశాడు. బాబు వస్తే జాబు అన్నాడు. రూ. రెండువేల నిరుద్యోగభృతి అన్నాడు. చివరికి రెండు చేతులెత్తేసిన గజదొంగ ఈ చంద్రబాబు. కనుక సమాజంలో పెత్తందార్లు, బలమైన వర్గాల వారి పక్షానే తానుంటాని దమ్మూ,ధైర్యంగా చంద్రబాబు చెప్పగలడా..? అని నిలదీస్తున్నాను. 

బాబును నిలదీయాలని పిలుపునిస్తున్నాను 
పేదవారిని, బడుగుల జీవితాలను హేళన చేస్తూ,  అనేక సందర్భాల్లో తూలనాడి.. ఆఖరికి పేదవాళ్ల ఇంటి స్థలాన్ని సమాధులతో పోల్చిన చంద్రబాబును ఎక్కడికెళ్లినా పేదలంతా  నిలదీయమని పిలుపునిస్తున్నాను. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో,  ఇన్నాళ్లూ పేదల పట్ల, బడుగుల పట్ల ప్రదర్శించిన నిరంకుశమైన ఆలోచనసరళికి తగిన సమాధానం చెప్పిన తర్వాతనే,  ఆయన పేదల పల్లెల్లో పర్యటించాలని డిమాండ్‌ చేస్తున్నాను. 

తాజా వీడియోలు

Back to Top