విశాఖ: కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్.. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడనే భయం, బాధతో తెలుగుదేశం కంపెనీ విషప్రచారాలకు, కుట్రలకు తెరతీస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే హామీల అమలును సీఎం వైయస్ జగన్ ప్రారంభించారన్నారు. ప్రపంచాన్ని వణికించే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, పేదల ఆర్థిక పరిస్థితిని దిగజారిపోకుండా చూడటం కోసం నిధులు సమకూర్చి పథకాలు అమలు చేశారన్నారు. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకే నగదు జమ చేశారన్నారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు.
విశాఖలో మంత్రి కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘‘చంద్రబాబు, యనమల రామకృష్ణుడు కలిసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలకు తీరని అన్యాయం చేశారు. ఇప్పుడు నీతులు చెబుతున్నారు. అప్పులు ఏదో ఇప్పుడే చేస్తున్నట్టుగా, గతంలో చంద్రబాబు ఏమీ చేయనట్టుగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్నాడు. రాష్ట్రానికి చంద్రబాబు ఏ సంపద సృష్టించాడు. అలాంటి సృష్టే ఉంటే ఇవాళ అప్పుల పరిస్థితి ఉంటుందా..? అమ్మఒడి పథకం పాత పథకం.. టీడీపీ అమలు చేసిందని మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నాయకుల బతుకులకు సిగ్గుందా..?
ప్రభుత్వ పాఠశాలను బాగుచేద్దామని తెలుగుదేశం నేతలు ఎప్పుడైనా కల కన్నారా..? వారి బతుకంతా నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలను బాగుచేయడమే తప్ప.. ప్రభుత్వ పాఠశాలలను మంచి చేయడానికి ప్రయత్నం చేశారా..? పిల్లలంతా బడిబాట పట్టాలని, తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తాను తీసుకుంటానని, పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం వైయస్ జగన్ అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి తల్లి బ్యాంక్ ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తున్నారు. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రైవేట్ స్కూళ్లు వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అంటే కోర్టుల్లో కేసులు, బడులు బాగు చేస్తుంటే కోర్టులో కేసులు వేస్తున్నారు. అమ్మఒడి పాతదే.. కొత్త పథకం కాదని మాట్లాడుతున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కింద కోట్ల మంది లబ్ధిదారులకు నగదు జమ చేస్తున్నారు. అవినీతి, వివక్షకు తావులేకుండా పథకాలు అమలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో డీబీటీని తొలిసారిగా చూస్తోంది. కానీ, యనమల రామకృష్ణుడు కొత్తది కాదు.. 2004లో వరల్డ్ బ్యాంకు చెప్పింది.. 2009లో మేనిఫెస్టోలో పెట్టామని చెప్పుకుంటున్నాడు. మేనిఫెస్టోలో పెట్టడం కాదు.. 2014లో అధికారంలోకి వచ్చాక ఎందుకు వెలగబెట్టలేదు..? అంత గొప్ప ముందుచూపున్నవారైతే ఆరోజు డీబీటీ ఎందుకు అమలు చేయలేదు..? దేశంలోనే అత్యున్నతంగా డీబీటీని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్.
చంద్రబాబు ఇంకా ఎంత కాలం కట్టుకథలు చెప్పుకొని కాలం గడుపుతారు. ఎంతకాలం అబద్ధాలను మీ ఫ్యాక్టరీలో వండివార్చి ప్రజలను మభ్యపెట్టాలనుకుంటున్నారు..? కరెంటు కొరత ఒక్క రాష్ట్రంలోనే ఉందా..? దేశం మొత్తం విద్యుత్ కొరత ఉంది. విదేశాల్లో బొగ్గు డిమాండ్ పెరగడం, దిగుమతులు పెరగడం వంటి కారణాలు ఉన్నాయి. దేశమంతా కరెంటు కష్టాలు వస్తాయని అలర్ట్ వస్తుంది. కేంద్రం కూడా దీనిపై దృష్టిపెట్టింది. ఏ విధంగా గాడిన పెట్టాలని సీఎం వైయస్ జగన్ కూడా ప్రయత్నం చేస్తున్నారు.
2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగం మీద చంద్రబాబు చేసిన దుర్మార్గాలు, దాష్టీకాలు ఎవరూ చేయలేదు. కాల్తేరులో, ఏలూరులో, బషీర్‌బాగ్‌లో రైతుల మీద కాల్పులు జరిగాయి. కరెంట్ బిల్లులు కట్టడం లేదన్న కారణంతో వరంగల్, మహబూబ్‌నగర్ లాంటి జిల్లాల్లో రైతుల చేతులకు బేడీలు వేసి, కాళ్లకు సంకెళ్లు వేసిన చరిత్ర చంద్రబాబుది. అందుకే 2004లో తిప్పికొట్టారు. అప్పటి నుంచి మళ్లీ అధికారంలోకి రావడానికి 2014 అయ్యింది. 5 ఏళ్లకే మళ్లీ 23 సీట్లకే పరిమితం చేశారు.
96 శాతం మంది రైతులు మీటర్లు బిగించడానికి సమ్మతమేనని అఫిడవిట్ ఇచ్చారు. జవాబుదారీతనం కోసం మీటర్లు ఏర్పాటు చేశాం. చంద్రబాబు విద్యుత్ సంస్థలకు డబ్బులు చెల్లించకపోవడం వల్ల డిస్కమ్‌లు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఎప్పటికప్పుడు రైతాంగం తరఫున ప్రభుత్వం ఇంత మొత్తం చెల్లిస్తుందని, ఇంత సబ్సిడీ అని చెబుతూ.. ఆ డబ్బు రైతులపై భారం పడకుండా ఎప్పటికప్పుడు నేరుగా డిస్కమ్‌లకు చెల్లించే కార్యక్రమం చేస్తున్నాం. వైయస్ జగన్ ప్రభుత్వం వచ్చాక 2019లో చంద్రబాబు పెట్టిన విద్యుత్ బకాయిలు రూ.8500 కోట్లు చెల్లించారు.
26 జూలై 2019లో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు గృహ వినియోగానికి ఇవ్వాలని అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం ఈపీడీఎస్సీల పరిధిలో 1,25,791 మంది ఎస్టీ గృహ వినియోగదారులకు, 35,148 ఎస్సీ గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉన్నవారందరికీ ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. కళ్లు మూసుకుపోయినట్టుగా నటించే తెలుగుదేశం పార్టీ నేతలకు నిజాలు తెలియవు".