పేద‌ల కోసం.. పెద్ద ల‌క్ష్యం

ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవ‌డం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అల‌వాటు

జూలై 8వ తేదీన 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ 

మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నదే సీఎం ధ్యేయం 

పేదల సొంతింటి కలను నెరవేర్చి సీఎం వైయస్‌ జగన్‌ చరిత్రకెక్కనున్నారు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

తాడేపల్లి: పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలనే కార్యక్రమం యజ్ఞంలా కొనసాగుతోందని, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజు (జూలై 8)న 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి సీఎం వైయస్‌ జగన్‌ చరిత్రకెక్కనున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రస్తుతం మధ్య తరగతి ప్రజలైనా ఇల్లు కట్టాలంటే జీవితకాలంలో సాధ్యం కాని పరిస్థితి అని, అలాంటిది 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి.. వచ్చే మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే పెద్ద టార్గెట్‌ను సీఎం వైయస్‌ జగన్‌ పేదల కోసం తీసుకున్నారన్నారు. వాస్తవాలను వక్రీకరిస్తూ కొన్ని మీడియా ఛానళ్లు, కొంతమంది నాయకులు ఇంత పెద్ద కార్యక్రమాన్ని వ్యతిరేక దృష్టితో చూస్తూ.. ప్రభుత్వంపై బురదజల్లాలని కుట్రలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. 

విజయవాడలో మంత్రి కురసాల కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోను అమలు చేయడం కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏ విధంగా పనిచేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. కరోనా లాంటి అంతర్జాతీయ విపత్తు వచ్చి ఖజానాకు రూపాయి ఆదాయం రానిరోజు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ఆర్థిక నిపుణులు ఆంధ్రరాష్ట్రంవైపు చూసి ఆలోచన చేసే విధంగా కరోనా కష్టకాలంలో మహిళలకు వడ్డీరాయితీలు మొదలుకొని రైతు భరోసా వరకు వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో సీఎం వైయస్‌ జగన్‌ జమ చేశారన్నారు.  

చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. దాదాపు రూ.40 కోట్ల పైచిలుకు పెండింగ్‌ బిల్లులు, లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఈ రాష్ట్రాన్ని అప్పజెప్పాడన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాం.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేరని టీడీపీ నేతలు, చంద్రబాబు వెకిలినవ్వులు నవ్వినా.. చెప్పిందానికంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించామన్నారు. ఈ విషయం రైతు భరోసా సాయంలోనే ప్రజలంతా గమనించారన్నారు. 

మేనిఫెస్టోలో 25 లక్షల ఇళ్ల స్థలాలు అని ప్రకటించి చెప్పినదానికంటే ఎక్కువ దాదాపు 30 లక్షల ఇళ్ల స్థలాలు సీఎం వైయస్‌ జగన్‌ ఇవ్వబోతున్నారన్నారు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ఓటు వేశారా అనేది చూడకుండా.. అర్హత ఉంటే చాలు ఇళ్ల స్థలం ఇస్తామని సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారన్నారు. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యమా అని చాలా మంది మాట్లాడారని, కానీ, 26.77 లక్షల మందిని అర్హులుగా గుర్తించి గ్రామ సచివాలయాల్లో జాబితా ప్రదర్శించామన్నారు. 

ఇంకా చాలా మంది అర్హులు మిగిలిపోయారని సమాచారం రావడంతో దరఖాస్తుల స్వీకరణకు సీఎం వైయస్‌ జగన్‌ గడువు పెంచారన్నారు. మే నెలలో దాదాపు 6.08 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటిని పరిశీలిస్తున్నామన్నారు. వీరిలో సగం అర్హత ఉన్న దరఖాస్తు అనుకున్నా.. 30 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సొంతింటి కలను నిజం చేస్తున్న నాయకుడిగా సీఎం వైయస్‌ జగన్‌ చరిత్రకెక్కబోతున్నారన్నారు. 

ఇంతకు ముందు ఏదైనా సంక్షేమం పథకం కావాలంటే.. జన్మభూమి కమిటీల వద్దకు వెళ్లి చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి ఉండేదని, కానీ, ఈ రోజున ఎంపీ, ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లకుండా.. వలంటీర్ల ద్వారా అర్హత ఉన్న వారికి సంక్షేమ పథకం అందిస్తున్న  ఏకైక ప్రభుత్వం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అని మంత్రి కన్నబాబు అన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఇంత పారదర్శకతతో ఏ పథకం అమలు కావడం లేదన్నారు. ఇంటి స్థలాన్ని మహిళల పేరు మీద ఇస్తున్నారని, భవిష్యత్తులో వారి అవసరాల కోసం దానిపై అప్పుతెచ్చుకునే పరిస్థితిని క్రియేట్‌ చేశారన్నారు. 

ఇంతకు ముందు నగరాల్లో, మున్సిపాలిటీ పరిధిలో ఇంటి స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవని, పట్టణాల్లో, నగరాల్లో కూడా ఇంటి స్థలం ఇస్తున్న ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు. గజం రూ.30 వేలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇంటి స్థలాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారన్నారు. హౌసింగ్‌ ప్రోగ్రామ్‌కి 25,842.10 ఎకరాల ప్రభుత్వ భూమిని, 16,078 ఎకరాల ప్రైవేట్‌ భూమిని సేకరించారన్నారు. దాదాపుగా 42 వేల ఎకరాల ఇళ్ల పట్టాల పంపిణీ కోసం సమకూర్చారన్నారు. లబ్ధిదారులు పెరిగినా వారి కోసం కూడా భూములు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రూ.6,500 కోట్లు కేటాయించి.. ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లు వెచ్చించామన్నారు. లేఅవుట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. 

జూలై 8వ తేదీన ఇళ్ల పట్టాలు పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారని మంత్రి కన్నబాబు చెప్పారు. జిల్లాలో ఎమ్మార్వో స్థాయి అధికారి నుంచి కలెక్టర్‌ వరకు.. కమిషనర్స్‌ మొదలుకొని ప్రిన్సిపల్‌ సెక్రటరీస్‌ వరకు పూర్తిగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై నిమగ్నమయ్యారన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top